ఆఫ్రికా టు ఇండియా వయా దుబాయ్.. నటి రన్యారావు రూ.100 కోట్ల గోల్డ్ స్మగ్లింగ్ బాగోతం!

by Ramesh Naini |   (  Updated:2026-03-22 11:41:52  IST  )

కన్నడ నటి రన్యారావు గోల్డ్ స్మగ్లింగ్ కేసులో రోజుకో విస్తుపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి.

ఆఫ్రికా టు ఇండియా వయా దుబాయ్.. నటి రన్యారావు రూ.100 కోట్ల గోల్డ్ స్మగ్లింగ్ బాగోతం!
X

దిశ, డైనమిక్ బ్యూరో: కన్నడ నటి రన్యారావు గోల్డ్ స్మగ్లింగ్ కేసులో రోజుకో విస్తుపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి. అక్రమ మార్గంలో కోట్లు సంపాదించాలన్న అత్యాశతో ఆమె సాగించిన స్మగ్లింగ్ దందా.. ఆఫ్రికా గనుల నుంచి దుబాయ్ మీదుగా భారత్‌కు ఎలా విస్తరించిందో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దర్యాప్తులో బట్టబయలైంది. కేవలం ఏడాది వ్యవధిలో ఏకంగా 127 కిలోల బంగారాన్ని (సుమారు రూ.102 కోట్లు) దేశంలోకి అక్రమంగా తరలించినట్లు ఈడీ తాజాగా బెంగళూరులో దాఖలు చేసిన ఛార్జ్‌షీట్‌లో వెల్లడించింది. ఈ కేసులో రన్యారావుతో పాటు ఆమె అనుచరుడు తరుణ్ కొండూరు, బళ్లారికి చెందిన గోల్డ్ డీలర్ సాహిల్ సకారియా జైన్ పేర్లను కూడా ఈడీ చేర్చింది.

ఆఫ్రికాలో రూ.2 కోట్లు మోసపోయి..

దుబాయ్ మార్కెట్‌కు వచ్చే బంగారంలో ఎక్కువ శాతం ఆఫ్రికా గనుల నుంచే వస్తుందని తెలుసుకున్న రన్యారావు, తరుణ్ కొండూరు.. నేరుగా అక్కడి నుంచే తక్కువ ధరకు బంగారం కొనుగోలు చేయాలని పథకం పన్నారు. ఇందుకోసం దుబాయ్‌లో ‘వీరా డైమండ్స్ ట్రేడింగ్ ఎల్‌ఎల్‌సీ’ పేరుతో ఒక సంస్థను స్థాపించి, ఉగాండా, కెన్యా, టాంజానియాల్లో ఏజెంట్ల కోసం గాలింపు మొదలుపెట్టారు. ఈ క్రమంలో ఉగాండాకు చెందిన ‘బెన్’ అనే ఏజెంట్‌తో ఒప్పందం కుదుర్చుకున్నారు. మొదట ట్రయల్ రన్‌గా 5 కిలోలు, అది విజయవంతమైతే 50 కిలోల బంగారం కొనుగోలు చేసేలా ప్లాన్ చేశారు. అడ్వాన్స్‌గా 25 వేల డాలర్లతో (రూ.23.5 లక్షలు) పాటు, పన్నులు తదితర ఖర్చుల కోసం రెండు దఫాలుగా రూ.9.4 లక్షల చొప్పున బెన్‌కు చెల్లించారు. ఎంతకీ బంగారం రాకపోవడంతో 2024 జనవరిలో తరుణ్ కొండూరు స్వయంగా ఉగాండా రాజధాని కంపాలా వెళ్లాడు. అక్కడ అతనికి ఓ రిఫైనరీలో బంగారాన్ని చూపించి, దాన్ని వదిలించుకోవడానికి మరో రూ.1.7 కోట్లు వసూలు చేశారు. ఆ తర్వాత కానీ తాము మోసపోయామని ఈ జంట గ్రహించలేకపోయింది. ఈ ఉదంతంతో వీరు సుమారు రూ.2 కోట్లు నష్టపోయారు.

రూటు మార్చి.. దుబాయ్ దారిలో..

ఆఫ్రికాలో ఎదురుదెబ్బ తగలడంతో రన్యా, తరుణ్ తమ రూటు మార్చారు. ఆఫ్రికన్ డీలర్ల నుంచి దుబాయ్‌లోని ‘డెరా గోల్డ్ సౌక్’లో నేరుగా నగదు చెల్లించి బంగారం కొనుగోలు చేయడం ప్రారంభించారు. దీనికోసం రన్యా భారీగా నగదును మార్కెట్‌కు తీసుకెళ్లేది. దుబాయ్ నుంచి కొనుగోలు చేసిన బంగారాన్ని స్విట్జర్లాండ్ లేదా థాయ్‌లాండ్ వంటి మూడో దేశానికి రవాణా చేస్తున్నట్లు తరుణ్ కొండూరు నకిలీ కస్టమ్స్ డిక్లరేషన్లు సృష్టించేవాడు. కానీ వాస్తవానికి ఆ బంగారాన్ని దుబాయ్ ఎయిర్‌పోర్టులో రన్యారావు తీసుకుని, తన దుస్తుల్లో దాచుకుని భారత్‌కు స్మగ్లింగ్ చేసేది.

తండ్రి హోదా.. వీఐపీ ప్రొటోకాల్ వాడుకుంటూ..

రన్యా రావు సవతి తండ్రి ఓ సీనియర్ పోలీస్ అధికారి. ఈ హోదాను వాడుకుని ఆమె బెంగళూరు ఎయిర్‌పోర్టులో తనకు లభించే ‘వీఐపీ ప్రొటోకాల్’ సౌకర్యాన్ని దుర్వినియోగం చేసింది. పోలీసు అధికారి కుటుంబ సభ్యురాలు కావడంతో కస్టమ్స్ అధికారుల తనిఖీలను సులభంగా తప్పించుకుని దర్జాగా బయటపడేది. ఇలా 2024 మార్చి నుంచి 2025 మార్చి మధ్య కాలంలో సుమారు 15 సార్లు దుబాయ్ వెళ్లి వచ్చింది. ఈ పర్యటనల్లో ఏకంగా 127.87 కిలోల బంగారాన్ని (దీని విలువ సుమారు రూ.102 కోట్లు) భారత్‌కు స్మగ్లింగ్ చేసి, స్థానిక డీలర్లకు విక్రయించారు.

చివరకు ఇలా దొరికిపోయింది..

దుబాయ్ నుంచి వచ్చిన రన్యా రావు బెంగళూరు విమానాశ్రయంలో అధికారులకు పట్టుబడటంతో ఈ భారీ స్మగ్లింగ్ బాగోతం వెలుగులోకి వచ్చింది. అరెస్టయిన సమయంలో ఆమె వద్ద రూ.12.56 కోట్ల విలువైన 14.2 కిలోల బంగారు కడ్డీలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ప్రస్తుతం రన్యా రావు బెంగళూరు సెంట్రల్ జైలులో ఉన్నారు. డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (DRI) ఆమెకు రూ.102.55 కోట్ల భారీ జరిమానా విధించింది. ఈడీ ఇప్పటికే ఆమెకు చెందిన రూ.34 కోట్ల ఆస్తులను జప్తు చేసి, ఈ నెట్‌వర్క్‌పై లోతైన దర్యాప్తును ముమ్మరం చేసింది. ఈ కేసులో ఆమె తండ్రి (పోలీస్ అధికారి) పాత్ర ఏమైనా ఉందా అనే కోణంలోనూ విచారణ కొనసాగుతోంది.

Next Story