- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఢిల్లీ అసెంబ్లీ సమావేశాల తొలి రోజే గందరగోళం
ఢిల్లీ సీఎం కార్యాలయంలో బాబా సాహెబ్ అంబేద్కర్ ఫొటోను తొలగించి తమ దళిత వ్యతిరేక బుద్దిని బయటపెట్టుకుందని ఆతిశీ అన్నారు.

- ఢిల్లీ అసెంబ్లీ స్పీకర్‌గా విజేందర్ గుప్తా
- ప్రతిపక్ష నేతగా ఆతిశీ
- ప్రారంభమైన శాసనసభ సమావేశాలు
- తొలిరోజే సభలో ఆప్ భారీ నిరసన
- సీఎం ఆఫీస్ నుంచి అంబేడ్కర్, భగత్ సింగ్ ఫొటోలు తొలగించారని ఆరోపణ
దిశ, నేషనల్ బ్యూరో: ఢిల్లీ అసెంబ్లీ సమావేశాలు సోమవారం లాంఛనంగా ప్రారంభమయ్యాయి. బీజేపీ ఎమ్మెల్యే విజేందర్ గుప్తాను స్పీకర్‌గా ఎన్నికయ్యారు. ఆ తర్వాత స్పీకర్ విజేందర్ గుప్తాను సీఎం రేఖా గుప్తా, ప్రతిపక్ష నేత ఆతిశీ తోడ్కొని వెళ్లి స్పీకర్ కుర్చీలో కూర్చోబెట్టారు. ఇక ఆమ్ ఆద్మీ పార్టీ ఆతిశీని శాసన సభ పక్ష నేతగా ఎన్నుకున్నారు. దీంతో ఢిల్లీకి తొలి మహిళా ప్రతిపక్ష నాయకురాలిగా ఆతిశీ రికార్డు సృష్టించారు. ఢిల్లీ అసెంబ్లీ సమావేశాలు తొలి రోజు అధికార బీజేపీ, ప్రతిపక్ష ఆప్ మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి డాక్టర్ బీఆర్ అంబేద్కర్, భగత్ సింగ్ ఫొటోలను తొలగించడంపై ఆప్ తీవ్రంగా మండిపడింది. వారిద్దరి ఫొటోలను తొలగించి మహాత్మా గాంధీ, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని నరేంద్ర మోడీ ఫొటోలను అమర్చారు. ఈ విషయాన్ని ప్రతిపక్ష నేత ఆతిశీ మీడియా ముందు లేవనెత్తారు. బీజేపీ తమ దళిత వ్యతిరేకత మనస్థత్వాన్ని చాటుకుంటుందని విమర్శించారు.
ఢిల్లీ సీఎం కార్యాలయంలో బాబా సాహెబ్ అంబేద్కర్ ఫొటోను తొలగించి తమ దళిత వ్యతిరేక బుద్దిని బయటపెట్టుకుందని ఆతిశీ అన్నారు. అర్వింద్ కేజ్రివాల్ సీఎంగా ఉన్న సమయంలో డాక్టర్ బీఆర్ అంబేద్కర్, షాహీద్ భగత్ సింగ్ ఫొటోలను అన్నిప్రభుత్వ కార్యాలయాల్లో ఏర్పాటు చేశారు. కానీ బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ఫొటోలను సీఎం కార్యాలయం నుంచి తొలగించారని ఆతిశీ ఆరోపించారు. బీజేపీ యాంటీ దళిత్, యాంటీ సిక్ పార్టీని అని ఆతిశీ విమర్శించారు. ఇక మాజీ సీఎం అర్వింద్ కేజ్రివాల్ కూడా ఈ అంశంపై స్పందించారు. అంబేద్కర్ ఫొటోను తొలగించి లక్షలాది మంది దళితుల మనోభావాలను బీజేపీ గాయపరిచిందని విమర్శించారు. కొత్తగా ఏర్పడిన బీజేపీ ప్రభుత్వం బాబా సాహెబ్ ఫొటోను తొలగించి, ప్రధాని మోడీ ఫొటోను పెట్టింది. ఇది సరైన చర్య కాదని చెప్పారు. ప్రధాని నరేంద్ర మోడీ ఫొటో పెట్టుకోవచ్చు. కానీ బాబా సాహెబ్ ఫొటోను తొలగించడం మంచిది కాదని అన్నారు. వెంటనే బాబా సాహెబ్ ఫొటోను పెట్టాలని అర్వింద్ కేజ్రివాల్ డిమాండ్ చేశారు.
కాగా, ఆమ్ ఆద్మీ పార్టీ విమర్శలను ఢిల్లీ సీఎం రేఖా గుప్తా కొట్టిపారేశారు. ఆప్ అవినీతి, అక్రమాలు బయటపడతాయనే భయంతోనే ఇలాంటి అనవసరమైన వ్యాఖ్యలు చేస్తుందని అన్నారు. ప్రభుత్వ అధినేత ఫొటో పెట్టకూడదా? మన రాష్ట్ర పతి ఫొటోను.. జాతిపిత ఫొటోను పెట్టకూడదా అని ప్రశ్నించారు. భగత్ సింగ్, అంబేద్కర్‌లు గౌరవించదగిన వ్యక్తులు. కానీ ఇది ఢిల్లీ సీఎం కార్యాలయం, ప్రభుత్వ అధినేతకు సంబంధించిన గది. ఇక్కడ ఏ ఫొటోలు ఉండాలో తనకు తెలుసని రేఖా గుప్తా అన్నారు. నేను మా పనికి మాత్రమే బాధ్యరాలిని.. అలాగే ఢిల్లీ ప్రజలకు మాత్రమే జవాబుదారిని అని రేఖా గుప్తా చెప్పారు. అయితే రేఖా గుప్తా వెనుక మహాత్మా గాంధీ, ప్రెసిడెంట్ ముర్ము, పీఎం మోడీ ఫొటోలు ఉన్నాయి. ఆమెకు ఎదురుగా అంబేద్కర్, భగత్ సింగ్ ఫొటోలు ఏర్పాటు చేశారు.
మూడు రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలను నిర్వహించనున్నారు. ఆప్ ప్రభుత్వ పని తీరుపై రూపొందించిన కాగ్ రిపోర్టును ఈ సమావేశాల్లోనే ప్రవేశపెట్టనున్నారు. కాగా, కేజ్రివాల్ పార్టీ కాగ్ రిపోర్టులను చూసి భయపడుతుందని బీజేపీ ఎమ్మెల్యే అర్విందర్ సింగ్ లవ్లీ ఆరోపించారు. ఆ రిపోర్టుకు భయపడే అసెంబ్లీలో గందరగోళం సృష్టిస్తున్నారని విమర్శించారు. వారికి ఈ రిపోర్టుల నుంచి తప్పించుకోవడానికి ఎలాంటి కారణాలు కనపడటం లేదని అన్నారు. ఇవ్వాళ భగత్ సింగ్, అంబేద్కర్ ఫొటోలు తొలగించారని గొడవ చేస్తున్నారు. మరి వారు అధికారంలోకి వచ్చిన తర్వాత మహాత్మా గాంధీ ఫొటోలు తొలగించలేదా అని ప్రశ్నించారు.






