- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
‘టీ’ కప్పులో భారీ తుపాను.. దేశంలో 26 శాతానికి పడిపోయిన తేయాకు ఉత్పత్తి
అంతర్జాతీయ టీ దినోత్సవం 2026 సందర్భంగా భారతీయ టీ పరిశ్రమ ఎదుర్కొంటున్న సవాళ్లపై ప్రత్యేక కథనం.

దిశ, వెబ్‌డెస్క్: భారత్‌లో ‘చాయ్’ అనేది కేవలం ఓ పానీయం మాత్రమే కాదు.. అది ఒక ఎమోషన్, నిత్యజీవితంలో ఓ భాగం. ప్రతి ఏటా మే 21న ప్రపంచవ్యాప్తంగా అంతర్జాతీయ టీ దినోత్సవాన్ని (International Tea Day) జరుపుకుంటున్నాం. అయితే, భారతీయులకు అత్యంత ఇష్టమైన ఈ చాయ్ కప్పు వెనుక ఓ పెద్ద వాతావరణ సంక్షోభం (Climate Crisis) పొంచి ఉందని పరిశ్రమ వర్గాలు ప్రస్తుతం తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. 19వ శతాబ్దంలో బ్రిటిష్ వారు అస్సాంలో వాణిజ్యపరంగా టీ సాగును ప్రారంభించారు. నాటి నుంచి నేటి వరకు భారతీయులు టీని తమదైన శైలిలో మార్చుకున్నారు. పాలు, చక్కెరతో పాటు అల్లం, యాలకులు, లవంగాలు కలిపి దేశంలోని ప్రతి గల్లీలోనూ ‘చాయ్ పే చర్చ’లకు వేదికగా మార్చారు. రైల్వే స్టేషన్‌లో దొరికే రూ.10ల కుల్హద్ చాయ్ నుంచి లగ్జరీ హోటళ్లలో లభించే రూ.600ల డార్జిలింగ్ టీ వరకు.. చాయ్ అనేది పేద, మిడిల్ క్లాస్, భాషల బౌండరీలను కూడా చెరిపేసింది.
భారీగా పడిపోయిన తేయాకు ఉత్పత్తి
భారతీయులకు టీతో ఉన్న అనుబంధం అటుంచితే.. దాని వెనుక ఉన్న పరిశ్రమ మాత్రం ప్రస్తుతం తీవ్ర కష్టనష్టాలను ఎదుర్కొంటోంది. ఇండియన్ టీ అసోసియేషన్ (ITA) తాజా నివేదిక ప్రకారం.. 2026 జనవరి-ఫిబ్రవరి నెలల్లో భారతదేశం మొత్తం టీ ఉత్పత్తి కేవలం 31.15 మిలియన్ కిలోలుగా నమోదైంది. గత ఏడాది ఇదే కాలంలో నమోదైన 42.12 మిలియన్ కిలోలతో పోలిస్తే ఇది ఏకంగా 26 శాతం పైగా క్షీణించింది. ఈ ప్రొడక్షన్‌లో మార్పు ముఖ్యంగా నార్త్ ఇండియాలో పరిస్థితి దీనంగా ఉంది. అక్కడ టీ ఉత్పత్తి ఏకంగా 42 శాతం పైగా పడిపోగా, పశ్చిమ బెంగాల్‌లోని డూయర్స్ (Dooars), తెరాయ్ (Terai) ప్రాంతాల్లో వరుసగా 41శాతం, 52 శాతం మేర ప్రొడక్షన్ పడిపోయింది. ఇక తేయాకు ఫేమస్ అయిన అస్సాం వ్యాలీలో కూడా దిగుబడి గణనీయంగా తగ్గడం కలవరపెడుతోంది.
వాతావరణ మార్పులే కారణం..
తేయాకు అనేది వాతావరణ మార్పులపై ఆధారపడి సాగు అవుతుంది. వర్షపాతం, టెంపరేచర్, తేమలో ఏ మాత్రం మార్పులు వచ్చినా అది నాణ్యతను, రుచిని, పంట చేతికొచ్చే సమయాన్ని దెబ్బతీస్తుంది. ఈ సంవత్సరం ప్రారంభంలో అస్సాంలో రికార్డు స్థాయిలో 97 శాతం వర్షపాత లోటు నమోదైంది. ఆలస్యంగా కురుస్తున్న వర్షాలు, పెరుగుతున్న వేడి కారణంగా టైమ్ సైకిల్ మారిపోయి తేయాక తోటల నిర్వాహకులు, వాటిని నమ్ముకుని పని చేస్తున్న లక్షలాది మంది కార్మికులు, చిన్నకారు రైతులు ఆర్థికంగా తీవ్ర నష్టాలను చవిచూస్తున్నారు. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం టీ దిగుబడి సంక్షోభంపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని వ్యవసాయ నిపుణులు కామెంట్ చేస్తున్నారు.






