Himachal Pradesh: హిమాచల్ ప్రదేశ్‌లో వరదల ధాటికి 150 కి.మీ దూరం కొట్టుకుపోయిన మృతదేహాలు

by S Gopi |

వారి కోసం ముమ్మరంగా గాలింపు చర్యలు కొనసాగిస్తున్నట్టు అధికారులు వెల్లడించారు.

Himachal Pradesh: హిమాచల్ ప్రదేశ్‌లో వరదల ధాటికి 150 కి.మీ దూరం కొట్టుకుపోయిన మృతదేహాలు
X

దిశ, నేషనల్ బ్యూరో: హిమాచల్ ప్రదేశ్‌ను వరదలు అతలాకుతలం చేస్తున్నాయి. తాజాగా శుక్రవారం పంగ్లుయెడ్ గ్రామంలో వరదలకు తొమ్మిది మంది గల్లంతయ్యారు. నలుగురి మృతదేహాలు లభించగా, అవి ఆ గ్రామం నుంచి 150 కి.మీ దూరంలో ఉన్న జ్వాలాపూర్‌లో లభించాయి. మరో ఐదుగురు ఇప్పటికీ కనిపించడం లేదు. వారి కోసం ముమ్మరంగా గాలింపు చర్యలు కొనసాగిస్తున్నట్టు అధికారులు వెల్లడించారు. మొత్తంగా వరదల కారణంగా ఇప్పటివరకు మరణించిన వారి సఖ్య 91కి చేరిందని, రాష్ట్రవ్యాప్తంగా ప్రధాన రహదారులపై కొండచరియలు విరిగిపడి ప్రజలు తిరిగేందుకు ఇబ్బందులు పడుతున్నట్టు అధికారులు వెల్లడించారు. వరదల్లో చిక్కుకుని మరణించిన వారి మృతదేహాలు ఒక్కొక్కటిగా బయటపడుతుండటం అందరినీ విషాదంలోకి నెట్టేస్తోంది. మృతదేహాలు చాలాదూరం కొట్టుకుపోవడంతో గుర్తించి, కుటుంబసభ్యులకు అప్పగించడంలో సవాళ్లు ఉన్నాయని అధికారులు అభిప్రాయపడ్డారు. సుమారు 130 మంది వరకు క్షతగాత్రులు స్థానిక ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారని, వరదలను దృష్టిలో ఉంచుకుని రాష్ట్రంలో మొత్తం 207 రోడ్డు మార్గాలను మూసేసినట్టు అధికారులు వెల్లడించారు. ఈ ప్రభావంతో కొన్ని ప్రాంతాల్లో విద్యుత్ కూడా లభించడం కష్టంగా మారింది. వందలాది మంది ప్రజలు నిరాశ్రయులయ్యారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో ఎన్‌డీఆర్ఎఫ్‌తో పాటు బోర్డర్ రోడ్ ఆర్గనైజేషన్, స్టేట్ డిజాస్టర్ రెస్పాంద్ ఫోర్స్, హిమాచల్ పోలీసులు సహాయక చర్యల్లో పాల్గొంటున్నారు. కొండచరియలు విరిగిపడే అవకాశాలు ఎక్కువ ఉన్న చోట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేశారు.

Next Story