పాతకక్షలు.. కేఫ్‌లో యువకుడి కాల్చివేత

by Naga Rani Yarlagadda |   (  Updated:2026-01-24 08:11:31  IST  )

పాతకక్షల నేపథ్యంలో దేశ రాజధాని న్యూఢిల్లీలో ఓ యువకుడు హత్యకు గురయ్యాడు. నార్త్ ఈస్ట్ ఢిల్లీలోని మౌజ్‌పూర్‌లోని ఓ కేఫ్‌లో ఈ దారుణ ఘటన జరిగింది.

పాతకక్షలు.. కేఫ్‌లో యువకుడి కాల్చివేత
X

దిశ, వెబ్‌డెస్క్: పాతకక్షల నేపథ్యంలో దేశ రాజధాని న్యూఢిల్లీలో ఓ యువకుడు హత్యకు గురయ్యాడు. నార్త్ ఈస్ట్ ఢిల్లీలోని మౌజ్‌పూర్‌లోని ఓ కేఫ్‌లో ఈ దారుణ ఘటన జరిగింది. పాతకక్షల నేపథ్యంలో 24 ఏళ్ల ఫైజాన్ అనే యువకుడిని కాల్చి చంపినట్లు పోలీసులు తెలిపారు. కేఫ్ లో ఉన్న సీసీటీవీలో రికార్డైన దృశ్యాలను బట్టి నిందితుడిని మొయిన్ అనే వ్యక్తిగా గుర్తించారు. పైగా హత్యానంతరం ఇన్ స్టాగ్రామ్ లో మొయిన్ ఒక వీడియో కూడా విడుదల చేయడం గమనార్హం. మొయిన్ ఖురేషి అనే అకౌంట్ నుంచి పోస్ట్ అయిన వీడియోలో.. ఫైజాన్ ను చంపినందుకు తనకెలాంటి పశ్చాత్తాపం లేదని మొయిన్ తెలిపాడు. కొన్ని నెలల క్రితం అతను తనను కొట్టాడని, ఆ కక్షతోనే ఇప్పుడు అతన్ని చంపి పగ తీర్చుకున్నట్లు చెప్పాడు. ఇందులో ఆర్థిక లావాదేవీల కారణాలేవీ లేవని, అతన్ని చంపమని తనకెవరూ చెప్పలేదని స్పష్టం చేశాడు. కానీ ఫైజాన్ సోదరుడు మాత్రం ఈ హత్య వెనుక ఆర్థిక లావాదేవీలే ప్రధాన కారణమని, మొయిన్ తో పాటు అతని తండ్రిని కూడా అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశాడు.

వారి నుంచి అప్పు తీసుకున్నాడని, తిరిగి కట్టలేకపోవడంతో తమ ఇంటికి వచ్చి గొడవ కడా చేశారని వాపోయాడు. అప్పుడే భజన్పురా పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేశామన్నాడు. కానీ పోలీసులు ఆ సమయంలో వారిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని, తమకు న్యాయం చేయాలని కోరాడు. కాగా.. పోలీసులు ప్రస్తుతం మొయిన్, అతని తండ్రి పరారీలో ఉన్నట్లు తెలిపారు.

ఈ ఘటనపై ఢిల్లీ పోలీసులు భారతీయ న్యాయ సంహిత సెక్షన్ 103 (1)తో పాటు ఆయుధాల చట్టం సెక్షన్లు 25, 27 కింద కేసు నమోదు చేశారు. ఈ ఘటనతో ఢిల్లీలో శాంతిభద్రతలు రోజురోజుకూ దిగజారుతున్నాయన్న ఆందోళన పెరిగింది. రాజధాని నగరంలో గన్ కల్చర్ విస్తరిస్తోందన్న భయాలు వ్యక్తమవుతున్నాయి. నిందితుడిని పట్టుకునేందుకు పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేపట్టి, సీసీటీవీ ఫుటేజీని పరిశీలిస్తున్నారు.

Next Story