Pehalgam: పెహల్గాం ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పించినందుకు ఇద్దరిని అరెస్టు చేసిన ఎన్ఐఏ

by S Gopi |

వారు ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబాతో సంబంధాలున్న పాకిస్తానీ పౌరులని కూడా నిర్ధారించారు.

Pehalgam: పెహల్గాం ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పించినందుకు ఇద్దరిని అరెస్టు చేసిన ఎన్ఐఏ
X

దిశ, నేషనల్ బ్యూరో: జమ్ముకశ్మీర్‌లోని పెహల్గామ్‌లో ఇటీవల జరిగిన ఉగ్రవాదుల దాడి అంతర్జాతీయంగా కూడా సంచలనం రేపిన సంగతి తెలిసిందే. ఈ ఘటనతో భారత్, పాక్ మధ్య ఉద్రిక్తతలు యుద్ధం చేసే స్థాయి వరకు వెళ్లాయి. తాజాగా ఈ ఘటనలో పాల్గొన్న ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పించిన ఇద్దరిని జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) అరెస్ట్ చేసినట్టు ఆదివారం ప్రకటించింది. ఎన్ఐఏ అధికారికంగా వెల్లడించిన వివరాల ప్రకారం, బాట్‌కోట్‌కు చెందిన పర్వైజ్ అహ్మద్ జోథర్, హిల్ పార్క్‌కు చెందిన బషీర్ అహ్మద్ జోథర్ అనే ఇద్దరు వ్యక్తులు దాడిలో పాల్గొన్న ముగ్గురు సాయుధ ఉగ్రవాదులను గుర్తించారు, వారు ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబాతో సంబంధాలున్న పాకిస్తానీ పౌరులని కూడా నిర్ధారించారు. అరెస్ట్ అయిన ఇద్దరు నిందితులూ పెహల్గామ్‌కు చెందినవారు. దాడి జరగడానికి ముందు వీరు ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పించారు. ఆహారం, రవాణా సదుపాయం లాంటి సౌకర్యాలు కూడా ఏర్పాటు చేసినట్టు విచారణలో తేలింది. మరిన్ని వివరాల కోసం దర్యాప్తు కొనసాగుతోందని ఎన్ఐఏ పేర్కొంది.

జమ్మూకశ్మీర్‌లోని అనేక చోట్ల సోదాలు

పెహల్గామ్ ఉగ్రవాద దాడికి సంబంధించి కొనసాగుతున్న దర్యాప్తులో భాగంగా, జమ్మూకశ్మీర్‌లోని 32 చోట్ల ఎన్ఐఏ సోదాలు నిర్వహించింది. అనేక వారాల తర్వాత ఇప్పుడు ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. ది రెసిస్టెన్స్ ఫ్రంట్ (టీఆర్ఎఫ్), యునైటెడ్ లిబరేషన్ ఫ్రంట్ జమ్మూ & కాశ్మీర్ (యూఎల్ఎఫ్ జే&కె), ముజాహిదీన్ గజ్వత్-ఉల్-హింద్, జమ్మూకశ్మీర్ ఫ్రీడమ్ ఫైటర్స్ సహా పలు సంస్థలతో సంబంధం ఉన్న వ్యక్తుల ఇళ్లలో సోదాలు జరిగాయి. ఈ గ్రూపులు లష్కరే తోయిబా, జైష్-ఏ-మొహమ్మద్, అల్-బాదర్ వంటి నిషేధిత ఉగ్రవాద సంస్థలతో సంబంధాలను కొనసాగిస్తున్నాయి. కాగా, ఈ ఏడాది ఏప్రిల్ 22న పెహల్గామ్‌లోని పర్యాటక ప్రదేశంలో ఉగ్రవాదులు అత్యంత దారుణంగా 26 మంది సామాన్యులను పొట్టన పెట్టుకున్న సంగతి తెలిసిందే. దీనికి ప్రతీకారంగా భారత ప్రభుత్వం పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాద స్థావరాలపై ఆపరేషన్ సిందూర్ ద్వారా దాడులు నిర్వహించింది.

Next Story