114 ఏళ్ల మారథాన్ పరుగుల వీరుడు రోడ్డు ప్రమాదంలో మృతి

by Naga Rani Yarlagadda |   (  Updated:2025-07-15 07:45:57  IST  )

పరుగుతో ప్రపంచాన్ని స్ఫూర్తిగా మార్చిన వృద్ధ రన్నర్ ఫౌజా సింగ్ (114) ఇక లేరు. అత్యధిక వయసులో మారథాన్ పూర్తిచేసిన వ్యక్తిగా గిన్నిస్‌ స్థాయిలో గుర్తింపు పొందిన ఆయన, ఓ రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు.

114 ఏళ్ల మారథాన్ పరుగుల వీరుడు రోడ్డు ప్రమాదంలో మృతి
X

దిశ, వెబ్‌డెస్క్: పరుగుతో ప్రపంచాన్ని స్ఫూర్తిగా మార్చిన వృద్ధ రన్నర్ ఫౌజా సింగ్ (114) ఇక లేరు. అత్యధిక వయసులో మారథాన్ పూర్తిచేసిన వ్యక్తిగా గిన్నిస్‌ స్థాయిలో గుర్తింపు పొందిన ఆయన, ఓ రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. సోమవారం పంజాబ్‌లోని జలంధర్ – పఠాన్‌కోట్ జాతీయ రహదారిపై జరిగిన ప్రమాదంలో ఫౌజా సింగ్‌ను ఓ కారు ఢీకొట్టింది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన ఆయనను స్థానికులు ఆసుపత్రికి తరలించారు. అయితే తలకు తగిలిన గాయాలు తీవ్రంగా ఉండటంతో చికిత్స పొందుతూ ఆయన మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. కుటుంబ సభ్యులు విదేశాల్లో ఉండటంతో మృతదేహాన్ని మార్చురీలో ఉంచారు.

ఫౌజా సింగ్ 1911 ఏప్రిల్ 1న పంజాబ్‌ రాష్ట్రంలోని బేయాస్ గ్రామంలో జన్మించారు. ఈ ఏడాది ఆయనకు 114 ఏళ్లు. భార్య, కుమారుడి మరణం అనంతరం జీవితంలో ఒంటరితనాన్ని దూరం చేసేందుకు 89 ఏళ్ల వయసులో పరుగెత్తడం ప్రారంభించారు. అప్పటి నుంచీ వందేళ్లు దాటిన తర్వాత కూడా ఆయన మారథాన్‌లో పాల్గొనడాన్ని కొనసాగించారు. ఫౌజా సింగ్.. లండన్, న్యూయార్క్, టొరంటో వంటి అంతర్జాతీయ మారథాన్‌లలో పాల్గొని లక్షల మందికి స్ఫూర్తిగా నిలిచారు. వయసు ఎంత పెరిగినా శక్తి తగ్గదనే విషయం ఆయన నిరూపించారు. ఫౌజా సింగ్ మృతి వార్తపై పంజాబ్ గవర్నర్ గులాబ్ చంద్ కటారియా దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. “వందేళ్ల వయసులోనూ పరుగెత్తిన ఆయన ఓ జీవితం అందరికీ నిజమైన ఆదర్శం,” అని కొనియాడారు.

Next Story