‘అర్జునుడి’గా తండ్రిని మరిపించిన బాలయ్య

by  |
‘అర్జునుడి’గా తండ్రిని మరిపించిన బాలయ్య
X

దిశ, వెబ్‌డెస్క్ : విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు పౌరాణిక పాత్రలకు పెట్టింది పేరు. రాముడు, కృష్ణుడు, దుర్యోధనుడు, కర్ణుడిగానే కాకుండా వేంకటేశ్వర స్వామిగా మెప్పించి.. తెరపై తెలుగువారి దేవుడిగా వెలుగొందారు ఎన్టీఆర్. అదే వారసత్వాన్ని పుణికిపుచ్చుకున్న నటసింహం నందమూరి బాలకృష్ణ కూడా పౌరాణిక, జానపద పాత్రలు పోషించి తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకున్నారు.

ఎన్నో మరపురాని పాత్రలు.. మరెన్నో అద్భుత సినిమాలు చేసిన ఎన్టీఆర్ చిత్రాల్లో ‘నర్తనశాల’ ఒక ఆణిముత్యం. అదే చిత్రాన్ని రీమేక్ చేయాలనేది బాలయ్య డ్రీమ్. అయితే ఈ సినిమా షూటింగ్ ప్రారంభించిన కొద్ది రోజులకే, ఇందులో ద్రౌపదిగా నటించిన సౌందర్య.. విమాన ప్రమాదంలో చనిపోవడంతో షూటింగ్ ఆగిపోయింది. దీంతో ప్రాజెక్ట్ కూడా అక్కడే ఎండ్ అయిపోయింది. కాగా ఇన్ని రోజులకు దాదాపు 17 నిమిషాల నిడివితో ఉన్న నర్తనశాల సన్నివేశాలను ప్రదర్శించేందుకు సిద్ధం అయ్యారు బాలయ్య. దసరా కానుకగా శ్రేయాస్ యాప్‌లో ఎన్‌బీకే థియేటర్స్‌లో రిలీజ్ చేయనున్నారు.

స్వయంగా బాలకృష్ణ దర్శకత్వం వహించి, అర్జునుడిగా నటించిన సినిమా నుంచి తాజాగా ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. అర్జునుడిగా బాలయ్య లుక్ అదిరిపోగా.. దైవభక్తిలో తేలియాడుతున్నట్లుగా ఉంది. తండ్రి ఎన్టీఆర్‌ను తలపించేలా ఉన్న లుక్‌పై ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. కాగా శరత్ కుమార్ ధర్మరాజుగా, శ్రీహరి భీముడిగా కనిపించిన సినిమా కోసం పౌరాణిక చిత్రాలు మెచ్చే ప్రేక్షకులు వెయిట్ చేస్తున్నారు.


Next Story

Most Viewed