చేతిలో లాఠీ… గుండెలో తడి!

by  |
చేతిలో లాఠీ… గుండెలో తడి!
X

దిశ, నల్లగొండ: సాటి మనిషికి సాయం చేయాలంటే… లక్షలు, కోట్ల రూపాయలే ఉండనక్కరలేదు…! గుప్పెడు మనసు, గుండెలో తడి ఉంటే చాలు!! నల్లగొండ పోలీసులు తమ ఆచరణలో వాటినే చాటి చెప్పారు!

వాళ్లంతా కాలినడక సొంతూర్లకు ప్రయాణమై అక్కడి చేరుకున్నారు. ఆ సమయంలో ఖాకీలు వాళ్లను గమనించారు. విషయం ఆరా తీశారు. వారి బాధేందో వాళ్ల కళ్లకు కనిపించింది. దీంతో వారి కోసం తెచ్చుకున్న బిస్కెట్లతో ఆ పేదల ఆకలి తీర్చారు. ఆ వివరాలేంటో.. ప్రత్యేక కథనంలో..

ఎర్రటి ఎండ, నెత్తిన మూట‌, ఆపై చేతిలో పసిబిడ్డ.. స్వగ్రామానికి వెళ్లాలనే తపనతో హైదరాబాద్ నుండి సూర్యాపేటకు కాలినడకన వ‌ల‌స కూలీలు పయనమయ్యారు. వాళ్లంతా సూర్యాపేట జిల్లాలోని గాజుల మ‌ల్క‌పురానికి చెందినవారు. బతుకుదెరువు కోసం హైదరాబాద్ కు వెళ్లి కూలీ పనులు చేసుకుంటూ హయత్ నగర్ లో జీవనం సాగిస్తున్నారు. కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వం కొనసాగిస్తున్న లాక్ డౌన్ కారణంగా గత పది రోజులుగా కూలీ పని చేసుకునే వీరికి పని దొరకడంలేదు. అటు ఆకలితో అలమటిస్తూ ఇబ్బందులు ఎదుర్కొవాల్సి వచ్చింది. ప‌స్తుల‌తో అల‌మ‌టించే బ‌దులు రేష‌న్ బియ్యం తినైనా బ‌తుకొచ్చ‌ని సొంతూరికి పోవాల‌ని నిర్ణ‌యించుకొని కాలిన‌డ‌క‌న గురువారం ఉద‌యం హ‌య‌త్‌న‌గ‌ర్ నుంచి సూర్యాపేటకు పయనమయ్యారు.

నెత్తిన మూటలు ఎత్తుకొని, చేతిలో ప‌సిబిడ్డ‌ను ప‌ట్టుకొని ఎర్రటి ఎండ‌లో ఆయాస‌ప‌డుతూ న‌డుచుకుంటూ చౌటుప్పల్ మండలం పంతంగి టోల్ ప్లాజా వద్దకు సాయంత్రం నాలుగు గంట‌ల‌కు చేరుకున్నారు. రోడ్డుపై కొన్ని లారీలు తిరుగుతున్న‌ప్ప‌టికీ పోలీసుల భ‌యంతో డ్రైవ‌ర్లు వీరిని ఎక్కించుకోలేదు. టోల్‌ప్లాజా వ‌ద్ద కాపాల ఉన్న చౌటుప్ప‌ల్ పోలీసులు వీరు ప‌డుతున్న ఆయాసాన్ని గ‌మ‌నించి చ‌లించారు. వ‌ల‌స కూలీల‌తో మాట్లాడి వారి వివ‌రాల‌ను ఆరా తీశారు. సూర్య‌పేట ప‌క్క‌న గాజుల‌ మ‌ల్క‌పుర‌మ‌ని, బ‌తుకుదెరువు కోసం ప‌ట్నం వెళ్ల‌గా ప‌నులు బంద్ అవ్వ‌డంతో ప‌ది రోజుల నుంచి అర్ధాక‌లిలో అల‌మ‌టిస్తున్నామ‌ని వారు పోలీసులకు చెప్పారు. దీంతో ఆ పోలీసులు తమ కోసం తెచ్చ‌కున్న బిస్కెట్ ప్యాకెట్ల‌ను ఆ కూలీల‌కు ఇచ్చి త‌మ మాన‌వ‌త్వాన్ని చాటుకున్నారు. టోల్‌ప్లాజా సిబ్బందితో నీళ్లు తెప్పించి ఇచ్చారు. ఆ త‌రువాత సూర్య‌పేట వైపు వెళ్తున్న లారీని ఆపి అందులో కూలీల‌ను ఎక్కించి పంపించి త‌మ ఔన‌త్యాన్ని పోలీసులు చాటుకున్నారు.

Tags : nalgonda, migrant labourers, police, walking

Next Story

Most Viewed