కేసీఆర్ గారూ.. టూర్లు తగ్గించుకోండి

by  |
కేసీఆర్ గారూ.. టూర్లు తగ్గించుకోండి
X

దిశ, తెలంగాణ బ్యూరో: ముఖ్యమంత్రి కేసీఆర్ తరచూ ప్రగతి భవన్, ఎర్రవల్లిలోని ఫాంహౌస్ మధ్య రాకపోకలు సాగిస్తుండడం ఇప్పుడు ప్రజల్లో చర్చనీయాంశంగా మారింది. శనివారం రాత్రి జోరున వర్షం కురుస్తున్న సమయంలో ముఖ్యమంత్రి కాన్వాయ్ కోసం బేగంపేటలో ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర పావుగంటకు పైగా ఒకవైపు రోడ్డుమీద వాహనాల రాకపోకలను నిషేధించడంపై ప్రజలు ట్విట్టర్ వేదికగా ఫైర్ అయ్యారు. ఎమ్మెల్యే సీతక్క సైతం ఈ విషయాన్ని గమనించి ట్విట్టర్ ద్వారానే ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేశారు.

ప్రగతి భవన్, ఫాంహౌస్ మధ్య ప్రయాణం చేయడం ద్వారా ట్రాఫిక్ ఆపివేయాల్సి వస్తోందని, ప్రజలకు చాలా ఇబ్బందులు కలుగుతున్నాయని, ఈ ప్రయాణాలను వీలైనంతగా తగ్గించుకుని ఉపశమనం కలిగించాలని సూచించారు. 300 ఎకరాల ఫాంహౌజ్‌కు ప్రగతి భవన్‌కు మధ్య నిత్యం రాకపోకలు సాగించడం వలన 60 కి.మీ. మేర ప్రజల కదలికలకు ఆటంకం ఏర్పడుతోందని, వర్షంలో నిమిషాల తరబడి నడిరోడ్డు మీద ప్రజలకు ఇబ్బంది కలుగుతోందని, వారు కూడా క్షేమంగా, తొందరగా ఇళ్ళకు వెళ్ళాల్సిన అవసరం ఉందని ఆ ట్విట్టర్ సందేశంలో పేర్కొన్నారు.

పది నిమిషాలు మాత్రమే..

ముఖ్యమంత్రి ప్రయాణం చేసే మార్గంలో ఐదు నిమిషాల పాటు మాత్రమే వాహనాల రాకపోకలపై ఆంక్షలు విధిస్తున్నామని, బేగంపేట లాంటి రద్దీ ప్రాంతాల్లో ఒక్కోసారి పది నిమిషాలు పడుతోందని, అంతకుమించి ఎక్కువ సమయం వాహనాలను ఆపడం లేదని, గతేడాది నవంబరు 3వ తేదీన హైకోర్టు సమర్పించిన అఫిడవిట్‌లో నగర పోలీసు కమిషనర్ అంజనీకుమార్ పేర్కొన్నారు. కానీ శనివారం రాత్రి మాత్రం జోరున వర్షం కురుస్తున్నా దాదాపు ఇరవై నిమిషాలకుపైగా ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర వాహనాల రాకపోకలను పోలీసులు నిలిపివేశారు. వీఐపీ విధానం దేశంలో అమలులో లేకపోయినా ముఖ్యమంత్రి ప్రయాణాన్ని దృష్టిలో పెట్టుకుని ఎక్కవసేపు ట్రాఫిక్ ఆంక్షలను అమలు చేస్తున్నారంటూ సోమశేఖర్ దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై హైకోర్టులో జరిగిన విచారణ సందర్భంగా కమిషనర్ పై స్పష్టత ఇచ్చారు. కానీ ఇప్పుడు దానికి విరుద్ధంగా ఎక్కువ సేపు నిలిపేస్తున్నారనేది ట్విట్టర్ ద్వారా ప్రజలు చర్చించుకుంటున్నారు.


Next Story

Most Viewed