వాళ్లను ఇబ్బంది పెడితే.. ఊరుకునేదిలేదు : రేవంత్

by  |
వాళ్లను ఇబ్బంది పెడితే.. ఊరుకునేదిలేదు : రేవంత్
X

దిశ, ఎల్బీనగర్: హైదరాబాద్ నగరం నడిబొడ్డున ఉన్న కొత్తపేట ఫ్రూట్ మార్కెట్‌పై ప్రభుత్వ పెద్దల కన్నుపడి, రైతులను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నారని మల్కాజ్‌గిరి ఎంపీ రేవంత్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్ పార్టీ మహేశ్వరం నియోజకవర్గ సీనియర్ నాయకులు దేప భాస్కర్ రెడ్డితో కలిసి రేవంత్ రెడ్డి సోమవారం కొత్తపేట్ ఫ్రూట్ మార్కెట్‌ను సందర్శించి రైతుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎంపీ రేవంత్ రెడ్డి మాట్లాడుతూ… ప్రభుత్వం కొత్తపేట ఫ్రూట్ మార్కెట్‌ను కోహెడకు ఆదరబాదరగా ఎందుకు తరలించాల్సిన అవసరముందని ప్రశ్నించారు. కోహెడ మార్కెట్‌లో సౌకర్యాలన్నింటినీ పూర్తిచేసిన తర్వాతనే మార్కెట్‌ను ఇక్కడి నుంచి తరలించాలని డిమాండ్ చేశారు. స్థానిక అధికార పార్టీ ప్రజాప్రతినిధులు చొరవ తీసుకొని ప్రభుత్వంతో చర్చలు జరిపి ఇక్కడి రైతులకు న్యాయం జరిగేలా చూడాలని సూచించారు. లేకపోతే రాబోయే రోజుల్లో రైతుల కోసం నిరాహారదీక్ష చేపట్టాల్సి వస్తుందని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. అనంతరం దేప భాస్కర్ రెడ్డి మాట్లాడుతూ… మహేశ్వరం నియోజకవర్గంలోని రామకృష్ణాపురం, సరూర్‌నగర్ డివిజన్‌లోని చాలా మంది వ్యాపారులు, ఏజెంట్లు, హమాలీలు, ఆటో డ్రైవర్స్ కొత్తపేట ఫ్రూట్ మార్కెట్‌ను నమ్ముకొని జీవనం సాగిస్తున్నారని తెలిపారు. మాహేశ్వరం, కందుకూరు మండలాల రైతులు ఇక్కడే పండ్లు అమ్ముకొని వెళ్తారని, రంగారెడ్డి జిల్లా మంత్రి స్థానికులను దృష్టిలో పెట్టుకొని వ్యవహరించాలని కోరారు. ప్రభుత పెద్దల మెప్పు కోసం స్థానిక జిల్లా మంత్రి పేద రైతుల నోట్లో మట్టికొడుతున్నారని ఆరోపించారు. ప్రజలందరి తరుపున పోరాటం చేసేందుకు కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉందన్నారు.

Next Story