సీఎం కేసీఆర్‌కు ఎంపీ రేవంత్ లేఖ

by  |
సీఎం కేసీఆర్‌కు ఎంపీ రేవంత్ లేఖ
X

దిశ, న్యూస్‌బ్యూరో: కరోనా కట్టడి విషయంలో మొదటి నుంచీ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ వెంటనే రాష్ట్రవ్యాప్తంగా హెల్త్ ఎమర్జెన్సీ విధించాలని ఎంపీ రేవంత్ రెడ్డి సూచించారు. ముఖ్యమంత్రికి రాసిన బహిరంగ లేఖలో అనేక విమర్శలు చేశారు. వీఐపీల ప్రాణాలకు ఇస్తున్నవిలువను పేద, మధ్య తరగతి ప్రజలకు ఇవ్వడంలేదని ఆరోపించారు. ప్రభుత్వాసుపత్రికి వెళ్ళడంకంటే శ్మశానానికి వెళ్ళడమే మేలు అనే సాధారణ అభిప్రాయం ప్రజల్లో నెలకొనిందని, రాష్ట్రంలో ప్రజారోగ్య వ్యవస్థ ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోడానికి ఇది చాలు అని అన్నారు. కరోనా ఇంకా విశ్వరూపం ప్రదర్శించకముందే శాసనసభ్యురాలు సీతక్క అసెంబ్లీ సమావేశాల్లో ఈ అంశాన్ని ప్రస్తావించి ప్రభుత్వం తగిన జాగ్రత్తలు చేపట్టాలని సూచించారని, కానీ పారాసిటమాల్ మాత్ర వేసుకుంటే చాలు అంటూ సభను తప్పుదోవ పట్టించారని సీఎంపై ఆరోపణలు చేశారు. వేడి నీళ్ళు తాగితే కరోనా మాయమవుతుందంటూ మంత్రులు సైతం అంతే బాధ్యతారాహిత్యంలో మాట్లాడారని గుర్తుచేశారు.

రాష్ట్రంలో నాలుగు కోట్ల మంది ప్రజలు ఉంటే కేవలం గాంధీ ఆసుపత్రి మాత్రమే కరోనా బాధితులకు దిక్కయిందని, ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగానే ఇలాంటి దుస్థితి దాపురించిందని పేర్కొన్నారు. గచ్చిబౌలిలోని టిమ్స్ ఆసుపత్రిపై ప్రభుత్వ హడావిడే తప్ప ఇంకా ప్రారంభానికి నోచుకోలేదని, గాంధీ వైద్యులు పని ఒత్తిడి పెరుగుతోందంటూ రోడ్డెక్కినా ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లుగానే ఉందని ఆరోపించారు. ఐసీఎంఆర్ ట్రేస్, టెస్ట్, ట్రీట్ అనే విధానాన్ని అమలుచేయాలని మొదటి నుంచీ మొత్తుకుంటున్నా ప్రభుత్వ చెవికెక్కలేదని, కరోనా లెక్కల విషయంలో హైకోర్టు కూడా ప్రభుత్వ తీరును ఎండగట్టిందని గుర్తుచేశారు. వైద్యశాఖనే సమర్ధవంతంగా నిర్వహించలేని కేసీఆర్ ఇక ముఖ్యమంత్రిగా ఎలా పనికొస్తారని రేవంత్ రెడ్డి ఆ లేఖలో ప్రశ్నించారు. ఇప్పటికైనా అతి తెలివిని పక్కనపెట్టి నిపుణులతో కమిటీని వేయాలని, అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసి సంక్షోభాన్ని ఎదుర్కోవడంపై సలహాలు, సూచనలు తీసుకోవాలని సీఎంకు హితవు పలికారు.


Next Story

Most Viewed