క్రేజీ కాంబోలో రాబోతున్న ‘ఉడ్తా తీర్’ సినిమా.. రిలీజ్ తేదీ ప్రకటించిన మేకర్స్

by Mallepaka Hamsa |

గూఢచారి ప్రపంచాన్ని పూర్తిగా వినోదాత్మకంగా, తలకిందులు చేసేలా చూపిస్తూ ఒక స్పై యాక్షన్ కామెడీగా రాబోతోంది.

క్రేజీ కాంబోలో రాబోతున్న ‘ఉడ్తా తీర్’ సినిమా..  రిలీజ్ తేదీ ప్రకటించిన మేకర్స్
X

దిశ, సినిమా: బాలీవుడ్ వెండితెరపై ఓ సరికొత్త కలయిక ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతోంది. విలక్షణ నటుడు ఆయుష్మాన్ ఖురానా,యంగ్ సెన్సేషన్ సారా అలీఖాన్ జంటగా నటిస్తున్న క్రేజీ ప్రాజెక్ట్ ‘ఉడ్తా తీర్’. ఈ సినిమాకు సంబంధించిన విడుదల తేదీని మేకర్స్ తాజాగా అధికారికంగా ప్రకటించారు. సాధారణంగా గూఢచారి సినిమాలు అంటే యాక్షన్, సీరియస్ డ్రామాతో నిండి ఉంటాయి. కానీ, ‘ఉడ్తా తీర్’ ఆ గూఢచారి ప్రపంచాన్ని పూర్తిగా వినోదాత్మకంగా, తలకిందులు చేసేలా చూపిస్తూ ఒక స్పై యాక్షన్ కామెడీగా రాబోతోంది. ఆయుష్మాన్ ఖురానా తనదైన శైలిలో చేసే కామెడీ అడ్వెంచర్లు ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణ కానున్నాయట.

ప్రముఖ రచయిత ఆకాష్ ఎ కౌశిక్ ఈ చిత్రం ద్వారా దర్శకుడిగా ఇండస్ట్రీకి పరిచయం కాబోతున్నారు. విభిన్నమైన కథాంశంతో ఆయన ఈ కథను సిద్ధం చేశారని సమాచారం. ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని అందించాలనే లక్ష్యంతో స్టార్ ప్రొడ్యూసర్ కరణ్ జోహార్, అదర్ పూనావాలా, గునీత్ మోంగా కపూర్ వంటి హేమాహేమీలు ఈ ప్రాజెక్ట్ కోసం చేతులు కలిపారు. వినోదానికి ప్రాధాన్యతనిస్తూనే, ఒక సాహసోపేతమైన ప్రయాణంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. షూటింగ్ పనులను శరవేగంగా జరుపుకుంటున్న ఈ సినిమాను సెప్టెంబర్ 11, 2026న థియేటర్లలో విడుదల కాబోతున్నట్లు మూవీ మేకర్స్ అఫీషియల్‌గా అనౌన్స్ చేశారు. ఆయుష్మాన్ మార్క్ కామెడీకి సారా అలీఖాన్ గ్లామర్ తోడైతే బాక్సాఫీస్ వద్ద వినోదాల పంట పండటం ఖాయమని మేకర్స్ భావిస్తున్నారు.

Next Story