- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బాలీవుడ్ తీరుపై సిమ్రాన్ ఫైర్.. సౌత్ స్టార్స్‌ను జీరోగా చూస్తారంటూ సంచలన వ్యాఖ్యలు
చాలా సార్లు నాకు హిందీ సినిమాల్లో అవకాశాలు వచ్చాయి, కానీ వాటన్నింటినీ నేను తిరస్కరించాను.

దిశ, సినిమా: సీనియర్ హీరోయిన్ సిమ్రాన్.. ఈ పేరు వినగానే తెలుగు, తమిళ ప్రేక్షకులకు ఆమె అద్భుతమైన డ్యాన్స్, నటన గుర్తొస్తాయి. దశాబ్దాల పాటు దక్షిణాది చిత్ర పరిశ్రమలో అగ్ర కథానాయికగా వెలిగిన సిమ్రాన్, తాజాగా హిందీ చిత్ర పరిశ్రమ (బాలీవుడ్) తీరుపై సంచలన వ్యాఖ్యలు చేశారు. సౌత్ నటుల పట్ల బాలీవుడ్ ప్రదర్శించే వివక్షను ఎండగడుతూ ఆమె వ్యక్తం చేసిన అభిప్రాయాలు ఇప్పుడు ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారాయి. బాలీవుడ్‌లో ఎదురయ్యే ఇబ్బందుల గురించి సిమ్రాన్ మాట్లాడుతూ.. "చాలా సార్లు నాకు హిందీ సినిమాల్లో అవకాశాలు వచ్చాయి, కానీ వాటన్నింటినీ నేను తిరస్కరించాను. అక్కడ వారితో సరైన కమ్యూనికేషన్ కుదరదు. మేము సౌత్‌లో సంపాదించుకున్న పేరును, మాకున్న లెగసీని వారు అస్సలు గుర్తించరు. మేము ఏదో సున్నా నుంచి మొదలుపెడుతున్న కొత్త నటుల్లాగా మాతో వ్యవహరిస్తారు. ఇది నన్ను తీవ్రంగా కలిచివేస్తుంది" అని ఆవేదన వ్యక్తం చేశారు.
సినిమాల కోసం సగం జీవితాన్ని ధారపోసినా, సీనియర్ నటులకు కనీస గౌరవం దక్కకపోవడం బాధాకరమని సిమ్రాన్ మండిపడ్డారు. ముఖ్యంగా వసతి సౌకర్యాల విషయంలో కూడా బాలీవుడ్ నిర్మాతలు బేరసారాలు ఆడతారని ఆమె వెల్లడించారు. "మా వెంట వచ్చే స్టాఫ్ సంఖ్యను పరిమితం చేస్తారు. హోటల్ గదులు, విమాన టిక్కెట్ల విషయంలోనూ రాజీపడమంటారు. ఇవన్నీ చూడటానికి చిన్న విషయాలుగా అనిపించవచ్చు, కానీ దశాబ్దాల కాలం సినిమా కోసం ప్రాణమిచ్చిన మా లాంటి వారికి ఇది అవమానకరంగా అనిపిస్తుంది. అక్కడ ఉండే ఆధిపత్యం చూశాక పనిచేయాలనే ఆసక్తి పోతుంది" అని ఆమె వాపోయారు. బాలీవుడ్‌లో చేదు అనుభవాలు ఉన్నప్పటికీ, అందరూ అలా ఉండరని సిమ్రాన్ స్పష్టం చేశారు. బాలీవుడ్ స్టార్ హీరో సన్నీ డియోల్ గురించి ఆమె ప్రత్యేకంగా ప్రస్తావించారు. సన్నీ డియోల్ ఎంతో వినయపూర్వకంగా ఉంటారని, ఆయనతో కలిసి పనిచేయడం తనకు ఎంతో సంతోషాన్ని ఇచ్చిందని ఆమె కొనియాడారు. కేవలం సౌత్ నటి అనే వివక్ష చూపకుండా గౌరవించే వ్యక్తులు అక్కడ చాలా తక్కువ మంది ఉన్నారని సిమ్రన్ అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం సిమ్రాన్ చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా, దక్షిణాది నటులకు మద్దతుగా నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.






