చీకటిని చీల్చుకుంటూ ‘సింహ’ ప్రయాణం.. ‘అగధ’ మూవీ నుంచి క్రేజీ అప్‌డేట్!

by Mallepaka Hamsa |

బాలీవుడ్ నటుడు శ్రవణ్ రెడ్డి పోస్టర్‌ను విడుదల చేశారు. ఇందులో ఆయన ‘సింహ’ అనే పవర్‌ఫుల్ పాత్రలో కనిపించబోతున్నారు.

చీకటిని చీల్చుకుంటూ ‘సింహ’ ప్రయాణం.. ‘అగధ’ మూవీ నుంచి క్రేజీ అప్‌డేట్!
X

దిశ, సినిమా: తెలుగు చిత్ర పరిశ్రమలో ఒక్కడు, వర్షం, మనసంతా నువ్వే వంటి క్లాసిక్ చిత్రాలతో సెన్సేషన్ క్రియేట్ చేసిన సీనియర్ మేకర్ ఎమ్మెస్ రాజు, ఇప్పుడు సరికొత్త ప్రయోగంతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ఆయన దర్శకత్వంలో రూపొందుతున్న తాజా చిత్రం ‘అగధ’. సుమారు ఏడాది గ్యాప్ తర్వాత ఎమ్మెస్ రాజు నుంచి వస్తున్న సినిమా కావడంతో సినీ ప్రియుల్లో ఈ ప్రాజెక్ట్ పట్ల భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రానికి ఒక ‘మిస్టికల్ డివైన్ థ్రిల్లర్’గా ఎమ్మెస్ రాజు వెండితెరపై ఆవిష్కరిస్తున్నారు. శ్రీ ఆదివరాహ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మితమవుతున్న ఈ చిత్రం తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో పాన్ ఇండియా స్థాయిలో విడుదల కానుంది.

ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుని నిర్మాణాంతర పనులలో బిజీగా ఉంది. ప్రమోషన్స్‌లో భాగంగా చిత్ర బృందం వరుసగా క్యారెక్టర్ పోస్టర్లను విడుదల చేస్తూ అంచనాలను పెంచుతోంది. ఇటీవల కామాక్షి భాస్కర్ల ‘మహాదేవి’ పోస్టర్‌కు మంచి రెస్పాన్స్ రాగా, తాజాగా బాలీవుడ్ నటుడు శ్రవణ్ రెడ్డి పోస్టర్‌ను విడుదల చేశారు. ఇందులో ఆయన ‘సింహ’ అనే పవర్‌ఫుల్ పాత్రలో కనిపించబోతున్నారు. పోస్టర్‌లో శ్రవణ్ రెడ్డి చీకటి పొగతో నిండిన వాతావరణంలో, చేతిలో మండుతున్న కాగడా పట్టుకుని సీరియస్‌గా కనిపిస్తున్నారు. ఆ చీకటిని చీల్చుకుంటూ వచ్చే ఏకైక వెలుగు ఆ కాగడా జ్వాల మాత్రమే అన్నట్లుగా దీనిని డిజైన్ చేశారు.శ్రవణ్ చూపు, నిలబడిన భంగిమ చూస్తుంటే.. ‘సింహ’ అనే పాత్ర రహస్యాలతో కూడిన ప్రయాణం చేస్తోందని, తెలియని శక్తులను ఎదుర్కొంటోందని అర్థమవుతోంది.

చుట్టూ అలుముకున్న నీడలు, చేతిలో జ్వాల చూస్తుంటే ఆయన ఒక ప్రమాదకరమైన మార్గంలో ప్రయాణిస్తూ, మానవ అవగాహనకు మించిన దేనినో అన్వేషిస్తున్నట్లు పోస్టర్ ద్వారా స్పష్టమవుతోంది. ఎమ్మెస్ రాజు మార్క్ టేకింగ్, విభిన్నమైన కథాంశం ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయి. దైవిక శక్తులకు, రహస్యాలకు ముడిపెట్టి తీస్తున్న ఈ థ్రిల్లర్ ప్రేక్షకులకు ఒక సరికొత్త అనుభూతిని ఇస్తుందని చిత్ర యూనిట్ ధీమా వ్యక్తం చేస్తోంది. త్వరలోనే ఈ సినిమా టీజర్, విడుదల తేదీకి సంబంధించిన వివరాలు వెల్లడికానున్నాయి.

Next Story