సంజన సంచలన వ్యాఖ్యలు.. టాలీవుడ్ స్టార్ నిర్మాత చేతిలో రెండు కోట్లు మోసం!

by Mallepaka Hamsa |

నా మొదటి సినిమా మీటింగ్‌కు వెళ్లేటప్పుడు కూడా డబ్బులు ఆదా చేయడం కోసం సగం దూరం నడిచి వెళ్లి, మిగతా సగం దూరం ఆటోలో వెళ్లాను

సంజన సంచలన వ్యాఖ్యలు.. టాలీవుడ్ స్టార్ నిర్మాత చేతిలో రెండు కోట్లు మోసం!
X

దిశ, సినిమా: ఒకప్పటి పాపులర్ హీరోయిన్, క్యారెక్టర్ ఆర్టిస్ట్ సంజన గురించి తెలియని వారు ఉండరు. దాదాపు 50కి పైగా సినిమాల్లో నటించిన ఆమె, తన నటనతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. అయితే మధ్యలో కొన్ని డ్రగ్స్ ఆరోపణలు, జైలు జీవితం వంటి వివాదాల వల్ల ఆమె కెరీర్‌ కాస్త ఒడిదుడుకులకు లోనైంది. ఆ తర్వాత అవకాశాలు తగ్గినా, బిగ్‌బాస్ వంటి రియాలిటీ షోల ద్వారా మళ్ళీ ప్రేక్షకులకు దగ్గరయ్యారు. ప్రస్తుతం టీవీ షోలు, సీరియల్స్‌తో తన సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టిన సంజన, తాజాగా ఒక ఇంటర్వ్యూలో తన వ్యక్తిగత జీవితం గురించి ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు. సంజన మాట్లాడుతూ తనది చాలా సాదాసీదా మధ్యతరగతి కుటుంబమని చెప్పారు. తన తల్లిదండ్రులను చూసుకోవాల్సిన బాధ్యత తనపై ఉండటంతో ప్రతి రూపాయిని ఎంతో జాగ్రత్తగా ఖర్చు చేసేదానిని అని తెలిపారు. "నా మొదటి సినిమా మీటింగ్‌కు వెళ్లేటప్పుడు కూడా డబ్బులు ఆదా చేయడం కోసం సగం దూరం నడిచి వెళ్లి, మిగతా సగం దూరం ఆటోలో వెళ్లాను" అని తన పాత జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. అలా కష్టపడి సంపాదించిన డబ్బును పొదుపు చేస్తూ వచ్చానని ఆమె చెప్పారు.

కష్టపడి సంపాదించిన డబ్బును తన అన్నవారికే సహాయంగా ఇస్తే, వాళ్లే తనను మోసం చేశారని సంజన ఆవేదన వ్యక్తం చేశారు. తనకు తెలిసిన నలుగురైదుగురికి సుమారు రెండు కోట్ల రూపాయలు ఇచ్చి నష్టపోయానని, అందులో తెలుగు ఇండస్ట్రీకి చెందిన ఒక పెద్ద నిర్మాత కూడా ఉన్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇప్పటికీ ఆ డబ్బు కోసం చెక్ బౌన్స్ కేసులు నడుస్తున్నాయని ఆమె వెల్లడించారు. కానీ ఆ నిర్మాత పేరును మాత్రం రివీల్ చేయలేదు. ఈ చేదు అనుభవాల తర్వాత, ఎవరికైనా డబ్బులు ఇస్తే వారు శత్రువులుగా మారుతారని జ్యోతిష్యులు కూడా చెప్పారని ఆమె తెలిపారు. ఈ సంఘటనల తర్వాత సంజనలో చాలా మార్పు వచ్చిందట. ఇప్పుడు ఎవరైనా డబ్బులు అడిగితే అసలు ఇవ్వడం లేదని, తనకు ఇప్పుడు డబ్బు విలువ, దాని అవసరం ఏంటో పూర్తిగా అర్థమైందని ఆమె స్పష్టం చేశారు. కష్టకాలంలో ఎవరూ తోడుండరని, మన దగ్గర ఉన్న డబ్బే మనల్ని కాపాడుతుందని ఆమె తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. సంజన చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Next Story