- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సీఎంగా సముద్రఖని.. ఎం.కె స్టాలిన్ బయోపిక్ షురూ!
ఇప్పుడు మరో భారీ పొలిటికల్ బయోపిక్‌కు రంగం సిద్ధమైంది. తమిళనాడు ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్ జీవిత చరిత్ర త్వరలో సినిమాగా రాబోతోందని సమాచారం.

దిశ, సినిమా: వెండితెరపై బయోపిక్‌ల ట్రెండ్ ఇప్పట్లో తగ్గేలా లేదు. మహానటి సావిత్రి, ఎన్టీఆర్, జయలలిత వంటి మహామహుల జీవిత గాథలు ఇప్పటికే ప్రేక్షకులను అలరించగా, ఇప్పుడు మరో భారీ పొలిటికల్ బయోపిక్‌కు రంగం సిద్ధమైంది. తమిళనాడు ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్ జీవిత చరిత్ర త్వరలో సినిమాగా రాబోతోందని సమాచారం. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టును విలక్షణ నటుడు, దర్శకుడు సముద్రఖని తెరకెక్కిస్తుండటం విశేషం. ఈ చిత్రంలో సముద్రఖని కేవలం దర్శకత్వానికే పరిమితం కాకుండా, స్వయంగా ముఖ్యమంత్రి స్టాలిన్ పాత్రలో నటించబోతున్నట్లు తెలుస్తోంది. సముద్రఖని నటనలోని తీవ్రత, ఆయన బాడీ లాంగ్వేజ్ స్టాలిన్ పాత్రకు సరిగ్గా సరిపోతాయని చిత్ర యూనిట్ భావిస్తోంది. ఈ సినిమాకు సంబంధించిన కథా చర్చల్లో మరో ప్రముఖ నటుడు, దర్శకుడు బోస్ వెంకట్ కూడా భాగస్వామిగా ఉంటూ స్క్రిప్ట్ పనులను పర్యవేక్షిస్తున్నట్లు టాక్.
స్టాలిన్ కేవలం ఒక రాజకీయ వారసుడిగానే కాకుండా, తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోవడానికి పడ్డ కష్టాలను ఈ సినిమాలో చూపించబోతున్నారట. ఆయన బాల్యం, యువజన నాయకుడిగా ఎదిగిన తీరు, ముఖ్యంగా 1975లో ఎమర్జెన్సీ సమయంలో ఆయన అనుభవించిన జైలు శిక్ష, అక్కడ ఎదుర్కొన్న చిత్రహింసల వంటి ఉద్వేగభరితమైన ఘట్టాలను దర్శకుడు ప్రధానంగా ఫోకస్ చేయనున్నారు. ఒక సాధారణ కార్యకర్త స్థాయి నుండి తమిళనాడు ముఖ్యమంత్రి వరకు ఆయన సాగించిన ప్రయాణం స్ఫూర్తిదాయకంగా సాగనుంది. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన ప్రీ-ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన పోస్టులు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ప్రేక్షకుల్లో భారీ అంచనాల నెలకొన్నాయి.






