‘ది ప్యారడైజ్’ రీషూట్ అంటూ వార్తలు.. హెచ్చరిక జారీ చేస్తూ కీలక ప్రకటన చేసిన మూవీ టీమ్

by Mallepaka Hamsa |

ఇప్పటి వరకు ఒక్క సీన్ కూడా రీషూట్ చేయలేదని, భవిష్యత్తులో కూడా అలాంటి ఆలోచన లేదని ఖరాకండిగా చెప్పారు. ఇప్పటికే 100 రోజులకు పైగా షూటింగ్ పూర్తయిందని, మిగిలిన షెడ్యూల్ కూడా ఎలాంటి ఆటంకాలు లేకుండా సాగుతోందని వివరించారు.

‘ది ప్యారడైజ్’ రీషూట్ అంటూ వార్తలు.. హెచ్చరిక జారీ చేస్తూ కీలక ప్రకటన చేసిన మూవీ టీమ్
X

దిశ, సినిమా: నేచురల్ స్టార్ నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్‌లో వస్తున్న భారీ చిత్రం ‘ది ప్యారడైజ్’. ‘దసరా’ వంటి బ్లాక్ బస్టర్ తర్వాత వీరిద్దరి కలయికలో సినిమా వస్తుండటంతో అంచనాలు భారీగా ఉన్నాయి. అయితే, గత కొద్దిరోజులుగా ఈ సినిమా షూటింగ్ విషయంలో నాని సంతృప్తి చెందలేదని కొన్ని సీన్లు రీషూట్ చేయాలని దర్శకుడిని కోరినట్లు పలు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. అంతేకాకుండా అనుకున్న సమయానికి షూటింగ్ కంప్లీట్ కాకపోవడం వల్లే వాయిదా పడుతోందని నెటిజన్లు చర్చించుకుంటున్నారు. రీషూట్ల వల్ల బడ్జెట్ పెరిగిపోయిందని, చిత్రబృందం ఒత్తిడిలో ఉందనే ప్రచారం కూడా జరిగింది. తాజాగా, ఈ విషయంపై మూవీ టీమ్ ఆ పుకార్లకు చెక్ పెడుతూ క్లారిటీ ఇచ్చింది. ‘‘సినిమా మొదటి రోజు నుండే పూర్తి స్పష్టతతో, పక్కా ప్లానింగ్‌తో జరుగుతోందని టీమ్ తెలిపింది.

ఇప్పటి వరకు ఒక్క సీన్ కూడా రీషూట్ చేయలేదని, భవిష్యత్తులో కూడా అలాంటి ఆలోచన లేదని ఖరాకండిగా చెప్పారు. ఇప్పటికే 100 రోజులకు పైగా షూటింగ్ పూర్తయిందని, మిగిలిన షెడ్యూల్ కూడా ఎలాంటి ఆటంకాలు లేకుండా సాగుతోందని వివరించారు. సినిమా అనుకున్న ప్రకారమే ముందుకు వెళ్తోందని, తాము అనుకున్న నాణ్యతను సాధించేందుకే పని చేస్తున్నామని స్పష్టం చేశారు. అనవసరమైన పుకార్లను నమ్మవద్దని, కేవలం అధికారిక సమాచారాన్ని మాత్రమే నమ్మాలని మేకర్స్ కోరారు. తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అన్ని అంచనాలను అందుకునేలా సినిమాను తీర్చిదిద్దుతున్నామని, ఆగస్టు 21, 2026న ప్రపంచవ్యాప్తంగా ఘనంగా విడుదల చేస్తామని ధీమా వ్యక్తం చేశారు. మొత్తానికి, ‘ది ప్యారడైజ్’ గురించి వస్తున్న గాసిప్స్‌కు ఈ అధికారిక ప్రకటనతో చెక్ పడింది. ఈ విషయం తెలుసుకున్న నాని అభిమానులు ఆనందపడుతున్నారు.

Next Story