‘పెద్ది’ రిలీజ్ తేదీ ఫిక్స్.. మరోసారి అఖిల్ వెనక్కి తగ్గక తప్పదా?

by Mallepaka Hamsa |

‘పెద్ది’ రాకతో మరో సినిమాకు చిక్కులు వచ్చి పడ్డాయి. మే 1న విడుదల కావాల్సిన ‘లెనిన్’ చిత్రం అప్పట్లో ‘పెద్ది’ కోసమే వాయిదా పడి జూన్ 26ను తన డేట్‌గా లాక్ చేసుకుంది.

‘పెద్ది’ రిలీజ్ తేదీ ఫిక్స్.. మరోసారి అఖిల్ వెనక్కి తగ్గక తప్పదా?
X

దిశ, సినిమా: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, ‘ఉప్పెన’ ఫేమ్ బుచ్చిబాబు సనా కాంబినేషన్‌లో ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న చిత్రం ‘పెద్ది’. ‘ఆర్ఆర్ఆర్’ వంటి గ్లోబల్ హిట్ తర్వాత చరణ్ నటిస్తున్న సినిమా కావడంతో దీనిపై అంచనాలు భారీగా ఉన్నాయి. ఈ సినిమాలో రామ్ చరణ్ సరసన అతిలోక సుందరి శ్రీదేవి తనయ జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తుండటం విశేషం. జగపతి బాబు, కన్నడ స్టార్ శివరాజ్ కుమార్, దివ్యేందు శర్మ, సాయి కుమార్ వంటి స్టార్స్ ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సమర్పణలో వస్తున్న ఈ సినిమా వాస్తవానికి ఏప్రిల్ 30న విడుదల కావాల్సి ఉంది. కానీ, షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్ పనులలో జాప్యం కారణంగా ఈ సినిమాను జూన్ నెలకి వాయిదా వేస్తున్నట్లు చిత్ర యూనిట్ ఇప్పటికే అధికారికంగా ప్రకటించిన విషయం తెలిసిందే. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. మేకర్స్ చివరకు జూన్ 25ను ఫైనల్ చేసినట్లు టాక్.

అయితే, ‘పెద్ది’ రాకతో మరో సినిమాకు చిక్కులు వచ్చి పడ్డాయి. మే 1న విడుదల కావాల్సిన ‘లెనిన్’ చిత్రం అప్పట్లో ‘పెద్ది’ కోసమే వాయిదా పడి జూన్ 26ను తన డేట్‌గా లాక్ చేసుకుంది. ఇక ఇప్పుడు ‘పెద్ది’ జూన్ 25న వస్తుందనే వార్తలతో, ‘లెనిన్’ టీమ్ మళ్ళీ డైలమాలో పడింది. గ్లోబల్ స్టార్ సినిమాతో పోటీ పడటం రిస్క్ కాబట్టి, ‘లెనిన్’ మరోసారి వాయిదా పడటం దాదాపు ఖాయమని ఇండస్ట్రీ వర్గాలు చర్చించుకుంటున్నాయి. ఈ విషయం తెలిసిన నెటిజన్లు పాపం అఖిల్ అని అంటున్నారు. కాగా.. ఈ సినిమా గురించి మరో ఇంట్రెస్టింగ్ వార్త నెట్టింట హల్చల్ చేస్తోంది. ఇందులో ఒక అదిరిపోయే ఐటమ్ సాంగ్ ఉంటుందని, అందుకోసం చాలా మంది భామల పేర్లు పరిశీలించిన చిత్ర బృందం, చివరకు శృతి హాసన్ను ఖరారు చేసినట్లు పుకార్లు వినిపిస్తున్నాయి. ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తుండటంతో, ఈ ఐటమ్ సాంగ్ రేంజ్ మరో లెవల్‌లో ఉంటుందని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. ప్రస్తుతం శరవేగంగా పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ చిత్రం, సమ్మర్ సీజన్ చివరలో బాక్సాఫీస్ వద్ద పెద్ద సునామీ సృష్టించేందుకు సిద్ధమవుతోంది.

Next Story