- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
జ్ఞాపకాలను గుర్తుచేసుకోవడం ఇష్టంలేక ఆ సినిమానే పూర్తిగా మర్చిపోయా.. విద్యాబాలన్ ఎమోషనల్ పోస్ట్
అప్పట్లో ఆయన అత్యంత సహజమైన నటుడని నా సోదరితో చెప్పాను. 25 ఏళ్ల తర్వాత నిన్న రాత్రి ఈ సినిమా చూసినప్పుడు కూడా నాకు అదే అనిపించింది.

దిశ, సినిమా: బాలీవుడ్ దిగ్గజ నటుడు, దివంగత ఇర్ఫాన్ ఖాన్ ఆరో వర్ధంతి సందర్భంగా ఆయన అభిమానులకు ఒక అద్భుతమైన సర్ ప్రైజ్ లభించింది. ఇర్ఫాన్ ఖాన్, విద్యాబాలన్ ప్రధాన పాత్రల్లో నటించి, దాదాపు 25 ఏళ్లుగా వెలుగు చూడని ‘ది లాస్ట్ టెనెంట్’ అనే చిత్రం ఎట్టకేలకు యూట్యూబ్‌లో విడుదలైంది. పాతికేళ్ల తర్వాత ఈ సినిమాను చూసిన విద్యాబాలన్, సోషల్ మీడియా వేదికగా ఒక ఎమోషనల్ నోట్ షేర్ చేశారు. విద్యాబాలన్ తన సినీ కెరీర్ ప్రారంభంలో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్నారు. తన మొదటి మలయాళ చిత్రం ఆగిపోవడం, దాదాపు డజను సినిమాల నుంచి ఆమెను తొలగించడం వంటి కష్టకాలంలో ‘ది లాస్ట్ టెనెంట్’ షూటింగ్ జరిగింది. ఆ చేదు జ్ఞాపకాలను గుర్తు చేసుకోవడం ఇష్టం లేక, ఈ సినిమాను పూర్తిగా మర్చిపోయానని విద్యాబాలన్ తెలిపారు. అయితే దర్శకుడు సార్థక్ దాస్‌గుప్తా నుంచి వచ్చిన మెసేజ్‌తో మళ్ళీ ఆ పాత రోజులు గుర్తొచ్చాయని ఆమె ఆవేదన చెందారు.
షూటింగ్ సమయంలో ఇర్ఫాన్ ఖాన్ నటన చూసి తాను ఎంతగానో ముగ్ధురాలినయ్యానని విద్యాబాలన్ గుర్తు చేసుకున్నారు. "అప్పట్లో ఆయన అత్యంత సహజమైన నటుడని నా సోదరితో చెప్పాను. 25 ఏళ్ల తర్వాత నిన్న రాత్రి ఈ సినిమా చూసినప్పుడు కూడా నాకు అదే అనిపించింది. ఆయన నటనలో ఎక్కడా కృత్రిమత్వం ఉండదు" అని ఆమె కొనియాడారు. ఇర్ఫాన్‌తో కలిసి నటించిన సినిమాలు కొన్ని ఆగిపోయినందుకు బాధపడే విద్యాబాలన్, ఇప్పుడు కనీసం ఈ ఒక్క సినిమా ఉన్నందుకు సంతోషం వ్యక్తం చేశారు. ఈ మూవీ ఫుటేజ్ పోవడంతో దర్శకుడు సార్థక్ దాస్‌గుప్తా ఆశలు వదిలేసుకున్నారు. అయితే, అనుకోకుండా లభించిన ఒక వీహెచ్‌ఎస్ కాపీ సహాయంతో సినిమాను పునరుద్ధరించి విడుదల చేశారట. ఒక విరిగిన మనసు గల సంగీతకారుడు, దేశం వదిలి వెళ్లే ముందు ఒక పాడుబడిన ఇంట్లో తలదాచుకోవడం.. అక్కడ అతనికి ఎదురైన జ్ఞాపకాలు, సంగీతం చుట్టూ ఈ కథ సాగుతుంది.






