‘ధురంధర్’ను చూసి మారకపోతే.. ఇక తెలుగు నిర్మాతల కథ ముగిసినట్లే.. రవి సంచలన వ్యాఖ్యలు

by Mallepaka Hamsa |   (  Updated:2026-04-07 12:32:46  IST  )

మూవీ క్రియేటివిటీని పక్కన పెడితే, ఇది మన రెగ్యులర్ నిర్మాతలకు ముగింపునకు ఆరంభం అని నేను భావిస్తున్నాను

‘ధురంధర్’ను చూసి మారకపోతే.. ఇక తెలుగు నిర్మాతల కథ ముగిసినట్లే.. రవి సంచలన వ్యాఖ్యలు
X

దిశ, సినిమా: టాలీవుడ్ ప్రముఖ రచయిత, దర్శకుడు, నటుడు బి.వి.ఎస్ రవి ఇటీవల చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో పెను సంచలనం సృష్టిస్తున్నాయి. ముఖ్యంగా బాలీవుడ్ సెన్సేషన్ రణవీర్ సింగ్ నటించిన ‘ధురంధర్’ సినిమా సాధించిన ఘనవిజయాన్ని ఉదాహరణగా చూపిస్తూ, తెలుగు నిర్మాతలకు ఆయన ఒక రకమైన హెచ్చరిక జారీ చేశారు. ‘రానా నాయుడు’ వంటి వెబ్ సిరీస్‌లకు రచయితగా పనిచేసిన రవి, టాలీవుడ్ మేకింగ్ స్టైల్‌పై తన అసహనాన్ని వ్యక్తం చేశారు. ఆదిత్య ధర్ దర్శకత్వంలో వచ్చిన ‘ధురంధర్’ సినిమాను చూసి తాను ఆశ్చర్యపోయానని రవి పేర్కొన్నారు. "ఈ మూవీ క్రియేటివిటీని పక్కన పెడితే, ఇది మన రెగ్యులర్ నిర్మాతలకు ముగింపునకు ఆరంభం అని నేను భావిస్తున్నాను" అని ఆయన ఘాటుగా వ్యాఖ్యానించారు.

కేవలం ₹260 కోట్ల బడ్జెట్‌తో రణవీర్ సింగ్, సంజయ్ దత్, అర్జున్ రాంపాల్ వంటి వారు కీలక పాత్రలో నటించిన ఈ చిత్రం రెండు భాగాలుగా ఇంత అద్భుతంగా ఎలా తీశారో అర్థం చేసుకోవాలని సూచించారు. మనం మన సినిమాలను ₹500 కోట్ల బడ్జెట్‌తో మొదలుపెడతామని, కానీ అవుట్‌పుట్ విషయంలో మాత్రం వెనకబడిపోతున్నామని రవి విమర్శించారు. దీనికి కారణం హీరోల రెమ్యునరేషన్ అని ఇంటర్వ్యూయర్ అనగా, రవి దాన్ని ఖండించారు. అసలు లోపం నిర్మాతలలో ఉందని, ప్రీ-ప్రొడక్షన్, ప్రొడక్షన్ ప్లానింగ్‌లో పక్కాగా లేకపోవడం వల్లే ఖర్చులు పెరుగుతున్నాయని ఆయన కుండబద్దలు కొట్టారు. బ్యాంకాక్ వంటి ఖరీదైన ప్రదేశాల్లో సెట్లు వేసినా, ఆదిత్య ధర్ టీమ్ బడ్జెట్‌ను కంట్రోల్ చేస్తూనే విజువల్ వండర్‌ను సృష్టించిందని కొనియాడారు.

గత ఏడాది డిసెంబర్‌లో విడుదలైన ‘ధురంధర్’ మొదటి భాగం ₹1300 కోట్లు వసూలు చేయగా, మార్చి 19న విడుదలైన సీక్వెల్ ‘ధురంధర్: ది రివెంజ్’ ఇప్పటికే ₹1600 కోట్ల మార్కును దాటేసింది. గల్ఫ్ దేశాల్లో విడుదల కాకపోయినా ఈ రేంజ్ కలెక్షన్స్ రావడం విశేషం. ప్రస్తుతం ఇండియాలో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రాల్లో ‘దంగల్’, ‘పుష్ప 2’, ‘బాహుబలి 2’ తర్వాత ఈ సినిమా నాలుగో స్థానంలో నిలిచింది. పక్కా విజన్ ఉంటే తక్కువ బడ్జెట్‌తో కూడా ప్రపంచస్థాయి సినిమాలు తీయొచ్చని ఈ చిత్రం నిరూపించిందని బి.వి.ఎస్ రవి అభిప్రాయపడ్డారు. టాలీవుడ్ నిర్మాతలు ఇప్పటికైనా మేల్కొనకపోతే ఇబ్బందులు తప్పవని ఆయన వ్యాఖ్యానించారు.

ఇండియన్ సినిమాలో ముందెన్నడూ చూడని అనుభూతి .. ‘ధురంధర్-2’ మూవీకి కోహ్లీ ఫిదా

Next Story