సోషల్ మీడియాను బ్యాన్ చేస్తే పిల్లలు వెనుకబడిపోతారు.. ఘజియాబాద్ ఘటనపై ఆర్జీవీ సంచలన పోస్ట్!

by Mallepaka Hamsa |   (  Updated:2026-02-09 08:30:05  IST  )

ఘజియాబాద్‌లో ఫిబ్రవరి 4న ముగ్గురు అక్కాచెల్లెళ్లు ఆత్మహత్య చేసుకోవడం దేశవ్యాప్తంగా కలకలం రేపింది.

సోషల్ మీడియాను బ్యాన్ చేస్తే పిల్లలు వెనుకబడిపోతారు.. ఘజియాబాద్ ఘటనపై ఆర్జీవీ సంచలన పోస్ట్!
X

దిశ, సినిమా: ఘజియాబాద్‌లో ఫిబ్రవరి 4న ముగ్గురు అక్కాచెల్లెళ్లు ఆత్మహత్య చేసుకోవడం దేశవ్యాప్తంగా కలకలం రేపింది. ఈ ఘటనకు సోషల్ మీడియా వ్యసనమే కారణమని భావిస్తూ.. 16 ఏళ్ల లోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించాలనే డిమాండ్లు వినిపిస్తున్నాయి. ఈక్రమంలో.. తాజాగా, ఈ విషయంపై టాలీవుడ్ వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ(Ram Gopal Varma) ట్విట్టర్ ద్వారా స్పందిస్తూ సంచలన పోస్ట్ పెట్టాడు. ‘‘బ్యాన్ ది బ్యానర్స్’’ (BAN THE BANNERS) పేరుతో ఆయన ఒక సుదీర్ఘమైన నోట్ రాస్తూ.. సోషల్ మీడియాను నిషేధించడం వల్ల లాభం కంటే నష్టమే ఎక్కువని హెచ్చరించారు. సోషల్ మీడియాను కేవలం కాలక్షేపంగా చూడటం మూర్ఖత్వమని ఆర్జీవీ పేర్కొన్నారు.

నేటి వేగవంతమైన ప్రపంచంలో నాలెడ్జ్, స్కిల్స్, నెట్‌వర్కింగ్‌కు సోషల్ మీడియానే ప్రధాన వనరు అని ఆయన అభిప్రాయపడ్డారు. ‘‘సోషల్ మీడియాను నిషేధించని దేశాల్లోని పిల్లలు యూట్యూబ్ ట్యుటోరియల్స్, రెడ్డిట్, టిక్ టాక్ వంటి ప్లాట్‌ఫామ్స్ ద్వారా కోడింగ్, సైన్స్, బిజినెస్ వంటి విషయాలను క్లాస్ రూమ్ కంటే వేగంగా నేర్చుకుంటున్నారు. మనం గనుక ఇక్కడ నిషేధం విధిస్తే.. మన పిల్లలు గ్లోబల్ పోటీలో వెనుకబడిపోతారు’’ అని వర్మ వివరించారు. 14 ఏళ్ల వయసు నుండే డిజిటల్ ప్రపంచంపై పట్టు సాధించడం వల్ల పిల్లలకు భవిష్యత్తులో మంచి కెరీర్ అవకాశాలు ఉంటాయని ఆర్జీవీ చెప్పుకొచ్చారు.

ఆస్ట్రేలియా వంటి దేశాల్లో నిషేధం ఉన్నప్పటికీ, అది పిల్లల స్టడీస్‌ను దెబ్బతీస్తుందని ఆయన హెచ్చరించారు. రక్షణ పేరుతో సమాచార మార్గాలను కట్ చేయడం వల్ల పిల్లల మధ్య అసమానతలు పెరుగుతాయని, వారు కొత్త ఆలోచనలకు దూరమవుతారని ఆర్జీవీ తన పోస్ట్‌లో స్పష్టం చేశారు. కేవలం నెగెటివ్ కంటెంట్ చూసి మొత్తం వ్యవస్థను నిషేధించడం సరికాదన్నది ఆయన ముఖ్య ఉద్దేశం అని తెలుస్తోంది. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. అది చూసిన నెటిజన్లు కొందరు ఆయనకు సపోర్ట్‌గా కామెంట్లు పెడుతుండగా.. మరికొందరు తప్పు పడుతూ విమర్శలు చేస్తున్నారు.

Next Story