‘ది లేడీ కిల్లర్’ ఫ్లాప్‌ను పెద్ద గుణపాఠంగా భావించా.. భూమి ఫెడ్నేకర్ షాకింగ్ కామెంట్స్

by Mallepaka Hamsa |

‘ది లేడీ కిల్లర్’ (The Lady Killer)ఫ్లాప్‌ను గుణపాఠంగా భావించి ముందుకు సాగుతున్నాను.

‘ది లేడీ కిల్లర్’ ఫ్లాప్‌ను పెద్ద గుణపాఠంగా భావించా.. భూమి ఫెడ్నేకర్ షాకింగ్ కామెంట్స్
X

దిశ, సినిమా: బాలీవుడ్ యంగ్ హీరోయిన్ భూమి పెడ్నేకర్(Bhumi Pednekar) 2023లో వచ్చిన ‘ది లేడీ కిల్లర్’ (The Lady Killer)ఫ్లాప్ అవడం తన జీవితంలో అత్యంత చేదు అనుభవం అని షాకింగ్ విషయాలు వెల్లడించింది. తాజాగా.. ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న భూమి .. అసలు ఈ సినిమా థియేటర్లలోకి ఎలా వచ్చిందో తెలిసి తానే షాక్ అయ్యానని ఆవేదన వ్యక్తం చేసింది. ఈ సినిమా ఫ్లాప్ అవ్వడానికి కారణం కథ బాలేకపోవడం కాదని.. అసలు కథనే పూర్తి చేయకపోవడం అని భూమి తన ఆవేదనను బయటపెడుతూ అసలు నిజాలు చెప్పింది. ‘‘మేము చదివిన స్క్రిప్ట్ చాలా అద్భుతంగా ఉంది. కానీ, షూటింగ్‌కు వచ్చేసరికి అందులో 35 శాతం భాగాన్ని అసలు తెరకెక్కించనేలేదు. సినిమా అసంపూర్తిగా ఉండగానే నిర్మాతలు రిలీజ్ చేసేశారు. ఆ విషయం తెలిసి నా గుండె పగిలినంత పనైంది’’ అని ఆమె చెప్పుకొచ్చింది.

చాలా కుంగదీసింది..

అసలు ఆ సినిమాను ఆ స్థితిలో ఎందుకు విడుదల చేశారో ఇప్పటికీ తనకు మిస్టరీగానే ఉందని భూమి వాపోయింది. అంతేకాకుండా ఈ పరాజయం కారణంగా చాలా బాధపడినట్లు చెప్తూ.. ‘‘ఈ సినిమా ఫెయిల్యూర్ తర్వాత నా పనైపోయిందని భావించాను. వృత్తిపరంగా, వ్యక్తిగతంగా ఇది నన్ను చాలా కుంగదీసింది. ఒక చీకటి రోజుల్లోకి వెళ్ళిపోయాను. నా కెరీర్‌లో ఇలాంటి పరిస్థితి ఎప్పుడూ ఎదురవ్వలేదు. ఒకవేళ నాకు ఇండస్ట్రీలో సరైన పట్టు ఉండి ఉంటే, ఆ సినిమా అలా అసంపూర్తిగా రాకుండా ఆపేదాన్ని. కానీ నా చేతుల్లో ఏమీ లేకపోయింది.దీనిని ఒక పెద్ద గుణపాఠంగా భావించి ముందుకు సాగుతున్నాను’’ అని చెప్పుకొచ్చింది.

రూ. 45 కోట్ల బడ్జెట్.. రూ. 1 లక్షలోపు వసూళ్లు!

భూమి ఫెడ్నేకర్, అర్జున్ కపూర్ జంటగా నటించిన ఈ సినిమాను అజయ్ భేల్ తెరకెక్కించారు. సుమారు రూ. 45 కోట్ల బడ్జెట్‌తో తీసిన ఈ చిత్రం, మొదటి రోజు రూ. 38 వేల వసూళ్లు సాధించింది. లైఫ్ టైమ్ రన్‌లో కూడా లక్ష రూపాయలు దాటలేకపోయింది. దీంతో ఈ సినిమాను ఏ ఓటీటీ ప్లాట్‌ఫామ్ కొనకపోవడంతో, చివరకు యూట్యూబ్‌లో ఉచితంగా విడుదల చేశారు.

Next Story