ఇక నుంచి ప్రపంచవ్యాప్తంగా అందరూ మెచ్చే చిత్రాలే తీయాలని నిర్ణయించుకున్నాను: రాజమౌళి

by Mallepaka Hamsa |

మనం ప్రాణం పెట్టి తీసిన ఒక చిత్రానికి అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు వస్తే ఆ ఫీలింగ్ చాలా ప్రత్యేకం.

ఇక నుంచి ప్రపంచవ్యాప్తంగా అందరూ మెచ్చే చిత్రాలే తీయాలని నిర్ణయించుకున్నాను: రాజమౌళి
X

దిశ, సినిమా: టాలీవుడ్ దిగ్గజ దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళి, సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబినేషన్‌లో వస్తున్న భారీ అడ్వెంచర్ మూవీ ‘వారణాసి’. ఈ సినిమాపై ఉన్న అంచనాలు ఏ స్థాయిలో ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తాజాగా, మెక్సికోలో జరిగిన ప్రఖ్యాత కామిక్‌కాన్ ఎక్స్‌పీరియన్స్-2026 వేదికపై ఈ సినిమాకు సంబంధించిన ఒక గ్లింప్స్‌ను ప్రదర్శించారు. ఈ సందర్భంగా రాజమౌళి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. రాజమౌళి మాట్లాడుతూ తనకు మాయ నాగరికత అన్నా, వారి నిర్మాణ శైలి అన్నా చాలా ఇష్టమని తెలిపారు. "నాకు ఆ ప్రాచీన కట్టడాలపై చాలా ఆసక్తి ఉంది. అందుకే నా గత చిత్రం 'బాహుబలి'లో కూడా సిటీ సెంటర్‌ను నిర్మించేటప్పుడు మెక్సికోలోని ప్రముఖ 'చిచెన్ ఇట్జా' నిర్మాణాలను స్ఫూర్తిగా తీసుకున్నాను" అని ఆయన గుర్తు చేసుకున్నారు. తన 25 ఏళ్ల సినీ ప్రయాణం గురించి రాజమౌళి ఎమోషనల్ అవుతూ.. "మనం ప్రాణం పెట్టి తీసిన ఒక చిత్రానికి అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు వస్తే ఆ ఫీలింగ్ చాలా ప్రత్యేకం. 'ఆర్ఆర్ఆర్' సినిమాను ప్రపంచవ్యాప్తంగా మీరు ఆదరించిన తీరు చూసి నేను ఉప్పొంగిపోయాను. ముఖ్యంగా 'నాటు నాటు' పాటకు ప్రపంచం మొత్తం స్టెప్పులు వేయడం చూసినప్పుడు నా కళ్లలో నీళ్లు తిరిగాయి. ఆ క్షణమే నాకు అర్థమైంది నేను సినిమాలు ఎందుకు తీస్తున్నానో! ఆ సంతోషమే నాకు అతిపెద్ద అవార్డు" అని చెప్పుకొచ్చారు. ఇకపై తన నుండి వచ్చే సినిమాలన్నీ కేవలం భారతీయ ప్రేక్షకులనే కాకుండా, ప్రపంచం మొత్తాన్ని అలరించేలా ఉంటాయని రాజమౌళి మాటిచ్చారు. "ఆర్ఆర్ఆర్ ఇచ్చిన స్ఫూర్తితో, ఇక నుంచి ప్రపంచవ్యాప్తంగా అందరూ మెచ్చే చిత్రాలే తీయాలని నిర్ణయించుకున్నాను" అని ఆయన ప్రకటించారు. మహేష్ బాబుతో తీస్తున్న 'వారణాసి' కూడా అదే స్థాయిలో ఉండబోతుందని ఆయన మాటలను బట్టి అర్థమవుతోంది. షూటింగ్ దశలో ఉన్న ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి.

Next Story