బడ్జెట్ కోతలంటే హీరోయిన్లే బలి కావాలా? హీరోలకు మాత్రం కోట్లు కుమ్మరిస్తారంటూ కృతి సెన్సేషనల్ కామెంట్స్

by Mallepaka Hamsa |

పారితోషికం విషయంలో నిర్మాతలు కోతలు విధించాల్సి వస్తే మొదట హీరోయిన్ల జీతాన్నే తగ్గిస్తారని, కానీ బడ్జెట్‌లో ఎక్కువ భాగం హీరోలకే ఇస్తారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.

బడ్జెట్ కోతలంటే హీరోయిన్లే బలి కావాలా? హీరోలకు మాత్రం కోట్లు కుమ్మరిస్తారంటూ కృతి సెన్సేషనల్ కామెంట్స్
X

దిశ, సినిమా: టాలీవుడ్ సెన్సేషన్ ‘1: నేనొక్కడినే’ సినిమాతో వెండితెరకు పరిచయమై, ప్రస్తుతం బాలీవుడ్‌లో టాప్ హీరోయిన్‌గా, నిర్మాతగా, సక్సెస్‌ఫుల్ వ్యాపారవేత్తగా రాణిస్తున్న నటి కృతి సనన్. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె, సినీ పరిశ్రమలో నెలకొన్న లింగ వివక్ష, తన కెరీర్‌లో ఎదుర్కొన్న సవాళ్ల గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. పారితోషికం విషయంలో నిర్మాతలు కోతలు విధించాల్సి వస్తే మొదట హీరోయిన్ల జీతాన్నే తగ్గిస్తారని, కానీ బడ్జెట్‌లో ఎక్కువ భాగం హీరోలకే ఇస్తారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. సెట్స్‌పై కూడా చిన్న చిన్న విషయాల్లో వివక్ష కనిపిస్తుందని కృతి పేర్కొన్నారు. "షూటింగ్ సమయంలో హీరో వేచి ఉండకూడదని హీరోయిన్ ముందుగా రెడీ అయ్యిందో లేదో చెక్ చేస్తారు. అలాగే కెరీర్ ఆరంభంలో నాతో సమాన హోదా ఉన్న హీరోకి మంచి కారు ఇచ్చి, నాకు మాత్రం సాధారణ కారు ఇచ్చేవారు.

ఇది కారు గురించి కాదు, సమాన గౌరవం గురించి" అని ఆమె స్పష్టం చేశారు. చిత్ర పరిశ్రమలో పితృస్వామ్య ధోరణి ఇంకా బలంగా ఉందని, దీన్ని మార్చాల్సిన అవసరం ఉందని ఆమె అభిప్రాయపడ్డారు.తన కెరీర్‌లో ‘మిమీ’ సినిమా ఒక పెద్ద మలుపు అని, ఆ సినిమాతోనే తనపై ఉన్న అంచనాలు మారాయని కృతి తెలిపారు. ‘మిమీ’ చిత్రానికి జాతీయ ఉత్తమ నటి అవార్డు రావడం తన జీవితంలో మర్చిపోలేని మధుర జ్ఞాపకమని చెప్పారు. అయితే ఈ స్థాయికి రావడం అంత సులభం కాలేదని, సినీ నేపథ్యం లేకపోవడం వల్ల ఎన్నో అవకాశాలు తన చేజారి స్టార్ కిడ్స్ వద్దకు వెళ్లాయని ఆమె గుర్తుచేసుకున్నారు. "నేను ఏదీ ఉచితంగా పొందలేదు, ప్రతి అవకాశాన్ని నా కష్టంతోనే సంపాదించుకున్నాను" అని ఆమె గర్వంగా చెప్పుకొచ్చారు. ప్రస్తుతం కృతి సనన్, హోమీ అదాజానియా దర్శకత్వంలో వస్తున్న ‘కాక్టెయిల్ 2’ సినిమాలో షాహిద్ కపూర్, రష్మిక మందన్నలతో కలిసి నటిస్తున్నారు. ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి.

Next Story