'గోల్డెన్ అవర్'తో ప్రాణాలు పదిలం – మంత్రి ఈటల

by  |
గోల్డెన్ అవర్తో ప్రాణాలు పదిలం – మంత్రి ఈటల
X

దిశ, న్యూస్‌బ్యూరో: కరోనా వైరస్ వ్యాప్తి తీవ్రంగా ఉన్న ప్రాంతాల్లో మరిన్ని ఎక్కువ నిర్ధారణ పరీక్షలు చేసి పాజిటివ్ పేషెంట్లను ప్రాథమిక దశలోనే గుర్తించడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ‘వెరా’ అనే సంస్థ స్వచ్చందంగా ముందుకొచ్చి ఇరవై వోల్వో మొబైల్ ల్యాబ్‌ (బస్సు)లను రాష్ట్ర ప్రభుత్వానికి సమకూర్చింది. ఇందులో ఏక కాలంలో పది మంది నుంచి నమూనాలను తీసుకునే సౌకర్యంతో పాటు అత్యవసర వైద్య చికిత్స కావాల్సిన పేషెంట్లను ఆసుపత్రికి తరలించేంతవరకు ప్రాణం కాపాడడానికి వీలుగా వెంటిలేటర్లు, ఆక్సిజన్ సౌకర్యంతో కూడిన ఐసీయూ మినీ వార్డు ఉంటుంది. ఒకేసారి నలుగురు పేషెంట్లకు ఐసీయూ చికిత్స అందించే వీలు కలుగుతుంది. సమీపంలోని ఏ ఆసుపత్రిలో బెడ్‌లు ఖాళీగా ఉన్నాయో తెలుసుకునే అధునాతన సాంకేతిక పరిజ్ఞానం (ఇంటెలిజెన్స్ మోనిటరింగ్ అనాలసిస్ సర్వీస్ క్వారంటైన్ – ఐ మాస్క్) కూడా ఉన్నందున ‘గోల్డెన్ అవర్’తో పేషెంట్లను బతికించవచ్చని ‘వెరా’ సంస్థ సీఈఓ ధర్మతేజ తెలిపారు.

ఇరవై మొబైల్ బస్సులను, వీటికి అనుసంధానంగా మరో ఇరవై ఆంబులెన్సులను మంత్రి ఈటల రాజేందర్ బుధవారం కరోనా కమాండ్ కంట్రోల్ కేంద్రంలో ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి ఈటల మాట్లాడుతూ ఈ బస్సుల ద్వారా కంటైన్‌మెంట్ జోన్లలోకి వెళ్ళి అక్కడికక్కడే ర్యాపిడ్ టెస్టులు చేసి నిర్ధారణ చేసే వీలు కలుగుతుందని, ఎక్కువ టెస్టులు చేయడం ద్వారా వైరస్ సోకినవారిని ప్రాథమిక దశలోనే గుర్తించే వీలవుతుందని అన్నారు. ఇప్పటికే సుమారు 1100 కేంద్రాల్లో స్వాబ్ కలెక్షన్ జరుగుతూ ఉందని, ఇప్పుడు ఈ బస్సుల ద్వారా ఏకకాలంలో పది మంది నుంచి శాంపిళ్ళను సేకరించవచ్చునని, ఎక్కడ అవసరమైతే అక్కడకు తీసుకెళ్ళే సౌకర్యం కలుగుతోందన్నారు.

వైరస్ వ్యాప్తి పెరిగిన నేపథ్యంలో ఎక్కువ మందికి పరీక్షలు చేయడం ద్వారా ప్రాణాలు పోకుండా కాపాడాలనే ఉద్దేశంతోనే ప్రభుత్వం ప్రతీరోజు 16వేల పరీక్షలను చేస్తోందని, ఈ బస్సుల ద్వారా పరీక్షల సంఖ్య మరింత పెరగనుందన్నారు. వైరస్‌ను త్వరగా గుర్తిస్తే ప్రాణాలను నిలబెట్టవచ్చన్నారు. ఈ బస్సులన్నింటినీ ప్రస్తుతానికి నగరంలోని కంటైన్‌మెంట్ జోన్లలో వినియోగించనున్నట్లు మంత్రి తెలిపారు. ప్రాణాల కంటే డబ్బులు ఎక్కువ కావని, ప్రాణాలను పణంగా పెట్టి పనిచేస్తున్న వైద్య సిబ్బంది త్యాగాన్ని, కృషిని ప్రశంసించారు. వారి మనోధైర్యాన్ని దెబ్బతీయవద్దని వివిధ పార్టీల నేతలకు మంత్రి విజ్ఞప్తి చేశారు.

Next Story

Most Viewed