మహీంద్రా అండ్ మహీంద్రా నికర లాభం 86 శాతం క్షీణత!

by  |
మహీంద్రా అండ్ మహీంద్రా నికర లాభం 86 శాతం క్షీణత!
X

దిశ, సెంట్రల్ డెస్క్: దేశీయ దిగ్గజ వాహన తయారీ సంస్థ మహీంద్రా అండ్ మహీంద్రా 2019-20 ఆర్థిక సంవత్సరంలో నికర లాభం 86 శాతం క్షీణించి రూ. 740 కోట్లని వెల్లడించింది. అంతకుముందు ఆర్థిక సంవత్సరంలో ఇది రూ. 5,401 కోట్లని పేర్కొంది. ఆటోమోటివ్, ట్రాక్టర్ విభాగాల్లో తక్కువ విక్రయాలు, బీఎస్4 కు మారడం, కొవిడ్-19 పరిణామాలతో ఆదాయం, లాభం క్షీణించినట్టు కంపెనీ స్టాక్ ఎక్స్చేంజీ ఫైలింగ్‌లో తెలిపింది. గత ఆర్థిక సంవత్సరానికి ఎంఅండ్ఎం ఆదాయం 15 శాతం తగ్గి రూ. 44,866 కోట్లకు చేరుకుంది. కంపెనీ నిర్వహణ లాభం 23 శాతం క్షీణించి రూ. 5,402 కోట్లకు చేరిందని, అంతకుముందు ఇది రూ. 7,011 కోట్లని పేర్కొంది. త్రైమాసిక పరంగా చూస్తే, మార్చితో ముగిసిన చివరి త్రైమాసికంలో దీర్ఘకాలిక పెట్టుబడుల బలహీనతల కారణంగా ఎంఅండ్ఎం నికర నష్టం రూ. 3,255 కోట్లుగా ఉందని తెలిపింది. ఆదాయం రూ. 9,005 కోట్లుగా ఉందని, అంతకుముందు ఇదే త్రైమాసికంలో రూ. 13,808 కోట్లతో పోలిస్తే ఈసారి 35 శాతం క్షీణించింది. కంపెనీ విక్రయాల్లో ట్రాక్టర్ల్ మార్కెట్ వాటా 1 శాతం, ఆటో ఎల్‌సీవీ 1.2 శాతం పెరిగాయని, ఆటో సీవీల వాటా 0.8 శాతం తగ్గాయని పేర్కొంది. భవిష్యత్తు మూలధన కేటాయింపులపై నిర్ణయం తీసుకోవడానికి ప్రస్తుతం పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని అంతర్జాతీయ అనుబంధ సంస్థలైన సాంగ్‌యాంగ్‌తో వ్యాపారంపై కంపెనీ పరిశీలిస్తోందని మహీంద్రా వెల్లడించింది. 2019-20 ఆర్థిక సంవత్సరంలో మూడవ త్రైమాసికంతో పోలిస్తే నాలుగో త్రైమాసికంలో కంపెనీ ధోరణి తిరోగమనంలో ఉందని కంపెనీ తెలిపింది. ‘కరోనా వైరస్ వ్యాప్తితో లాక్‌డౌన్ వల్ల సరఫరా, డిమాండ్ రెండూ తగ్గాయి. దీనికి అదనంగా తక్కువ ఆదాయం, అనిశ్చితి పెరగడంతో పాటు వినియోగదారుల వ్యయం, పెట్టుబడులను తగ్గించాయి’ అని ఎంఅండ్ఎం తెలిపింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో భాగంలో క్రమంగా కోలుకుంటామని కంపెనీ భరోసా వ్యక్తం చేసింది.

Advertisement
Next Story