వరుస ఏసీబీ దాడులు.. ఎమ్మెల్సీ కవిత వార్నింగ్..

by  |
acb raids in jagtial municipality on town planning officers
X

దిశ, జగిత్యాల : టౌన్ ప్లానింగ్, రెవెన్యూ విభాగాలు అవినీతి, అక్రమాలుకు నిలయంగా మారడంతో జగిత్యాల మున్సిపాలిటీ అక్రమాలకు కేరాఫ్‌గా నిలుస్తోంది. ఉన్నత అధికారుల పర్యవేక్షణ లేక మున్సిపల్ పాలకవర్గం చూసీ చూడనట్లు వ్యవహరిస్తుండటంతో అవినీతికి అడ్డు అదుపులేకుండా పోతుంది.ప్రజా సంక్షేమమే ధ్యేయంగా పనిచేయడంతో పాటు మంచి పాలన అందిస్తామని చెప్పిన పాలకవర్గం పెద్ద ఎత్తున అవినీతిలో కూరుకుపోయిన తీరు మార్చుకోకపోవడాన్ని ప్రజలు బాహటంగానే విమర్శిస్తున్నారు. జగిత్యాల మున్సిపాలిటీలో అక్రమాలు, అవినీతి రాజ్యమేలుతుందనడానికి రెండు సార్లు జరిగిన ఏసీబీ దాడులే సాక్ష్యంగా నిలిచాయి. జగిత్యాల మున్సిపల్ గతంలో రాష్ట్ర స్థాయి అవార్డులు సొంతం చేసుకుంది. కానీ, ప్రస్తుత మున్సిపల్ అవినీతిలో కూరుకుపోవడాన్ని ప్రజలు జీర్ణించుకోలేకపోతున్నారు. టౌన్ ప్లానింగ్, రెవెన్యూ విభాగాలు అవినీతి, అక్రమాలకు అడ్డాగా మారాయి. మున్సిపల్ పాలకవర్గం, కమిషనర్, ఇతర ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు దృష్టి సారించకపోవడంతో అవినీతి, అక్రమాలు జోరుగా జరుగుతున్నాయనే విమర్శలు తలెత్తుతున్నాయి.

జగిత్యాల మున్సిపల్లో ప్రధానంగా టౌన్ ప్లానింగ్, రెవెన్యూ విభాగాలకు చెందిన పలువురు ఉద్యోగులు, అధికారులు, సిబ్బంది అవినీతి, అక్రమాలకు పాల్పడుతున్నారు. ఉద్యోగుల అవినీతి ఆగడాలను భరించలేక జనం కుదేలవుతున్నారు. మరికొందరు అవినీతి నిరోధక శాఖ ఆదికారులను ఆశ్రయిస్తున్నారు. మున్సిపల్లో ఇంటి నిర్మాణానికి అనుమతి ఇవ్వడానికి డబ్బులు డిమాండ్ చేయడంతో ఓ ప్రైవేటు వైద్యుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఫిబ్రవరి 9న ఏసీబీ అధికారులు జగిత్యాల బల్దియాలో సోదాలు జరిపి అధికారులపై వేటువేశారు. పకడ్పందీ పథకం ప్రకారం బాధిత ప్రైవేటు వైద్యుడు రామయ్య రూ. 95 వేల నగదును మున్సిపల్ టౌన్ ప్లానింగ్ ఔట్ సోర్సింగ్ ఉద్యోగికి ఇస్తుండగా రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఈ ఘటనలో బాధ్యులయిన వారిని ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. తాజాగా మున్సిపల్లోని రెవెన్యూ విభాగంలో ఉద్యోగుల ఆవినీతి, అక్రమాల ఫిర్యాదులపై ఏసీబీ అధికారులు సోదాలు జరిపారు. మ్యుటేషన్ సందర్భంగా ఆక్రమాలు, అవినీతి జరుగుతున్నాయన్న అనుమానంతో మున్సిపల్ కమిషనర్ మారుతి ప్రసాద్‌తో పాటు మేనేజర్ శ్రీనివాస్ రెడ్డి, రెవెన్యూ విభాగం సీనియర్ అసిస్టెంట్ అనూప్, బిల్ కలెక్టర్ అనిల్‌లను విచారించారు. మ్యుటేషన్ సందర్భంగా వసూలు చేసిన రుసుమును ఆన్లైన్ విధానంలో తక్కువగా నమోదు చేసి, రశీదు బుక్కుల్లో మాత్రం ఎక్కువగా నమోదు చేస్తున్నట్లుగా గుర్తించారు.

లోపించిన ఉన్నతాధికారుల పర్యవేక్షణ..

ఉన్నతాధికారుల పర్యవేక్షణ లోపించడంతో బల్దియాకు వచ్చే సాధారణ జనం పనులు పూర్తి చేసుకోవడానికి నానా అవస్థలు పడుతున్నారు. అధికారులు బల్దియాను సందర్శించిన సమయంలో ఆయా విభాగాల్లో ప్రభుత్వం నిర్దేశించిన టార్గెట్లు పూర్తి చేయడం పైనే దృష్టి సారిస్తూ, ఇతర వ్యవహారాలను పట్టించుకోవడం లేదని గుర్తించారు. మున్సిపాలిటీలో అధికారులు, ఉద్యోగులు, సిబ్బంది పనితీరు, అక్రమాలు, అవినీతి తదితర అంశాలపై జిల్లా అధికారుల నిఘా కరువైందని, దీంతో మున్సిపల్లో అవినీతి, అక్రమాలు రాజ్యమేలుతున్నాయని తేలింది. ఇప్పటికైనా ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి బల్దియాలో చోటుచేసుకున్న అక్రమాలకు అడ్డుకట్టవేయాలని ప్రజలు కోరుతున్నారు.

ఎమ్మెల్సీ కవిత సీరియస్..

జగిత్యాలలో మంగళవారం జరిగిన ఓ సన్మాన కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్సీ కవిత అనంతరం నియోజకవర్గ కార్యకర్తల సమావేశంలో పాల్గొన్నారు. సమావేశంలో సీనియర్ కార్యకర్తలు బల్దియాలో జరుగుతున్న అక్రమాలపై కవిత దృష్టికి తీసుకువెళ్లగా, తనకు ఈ విషయాలు ముందే తెలుసునని, బల్దియా చైర్మన్, కౌన్సిల్ పై సీరియస్ అయినట్లు సమాచారం.

అనుమల్ల జయశ్రీ మున్సిపల్ కౌన్సిలర్..

జగిత్యాల మున్సిపల్ కౌన్సిల్‌లో అడుగడుగునా అవినీతి, అక్రమాలు చోటు చేసుకుంటున్నప్పటికీ ఉన్నతాధికారులు పకడ్బందీ చర్యలు తీసుకోవడం లేదు.గతంలో చాలా సార్లు జిల్లా కలెక్టర్‌ దృష్టికి తీసుకెళ్లినా జగిత్యాల బల్దియాలో తీరు మారలేదు. జిల్లా ఉన్నతాధికారుల పర్యవేక్షణ లోపించడం కారణంగానే పాలక వర్గం, కింది స్థాయి ఉద్యోగులు, అధికారులు, సిబ్బంది ఆడింది ఆట పాడింది పాటగా సాగుతుంది. ఇకనైనా జిల్లా అధికారులు స్పందించి జరుగుతున్న అక్రమాలపై చర్యలు తీసుకోవాలని జయశ్రీ కోరారు.

Next Story

Most Viewed