జోరుగా ఇసుక దందా.. మధ్యలో ఒక ఎమ్మెల్యే

by  |
జోరుగా ఇసుక దందా.. మధ్యలో ఒక ఎమ్మెల్యే
X

దిశ ప్రతినిధి, ఆదిలాబాద్: ఇసుక దందా అధికార పార్టీ నేతలు, నాయకులు, ఖాకీలకు కాసుల వర్షం కురిపిస్తోంది. ఇసుక దోపిడీలో నాయకులదే కీలక పాత్ర కాగా.. ప్రజాప్రతినిధులే ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. గోదావరి, స్వర్ణ, పెన్గంగా, ప్రాణహిత, కడెం, పెంబి, సుద్దవాగుల్లో యంత్రాలతో తవ్వకాలు చేసి.. రాత్రి వేళ లారీల్లో గుట్టుచప్పుడు కాకుండా తరలిస్తున్నారు. ఈ వ్యవహారంలో ఓ జడ్పీటీసీ సభ్యుడు కీలకంగా వ్యవహరిస్తుండగా.. పోలీసులు బండ్లు ఆపితే ఓ ఎమ్మెల్యే కాపాడుతున్నాడనే చర్చ సాగుతోంది. కాసుల వేటలో పడి పోలీసులు కేసుల సంగతి మరిచారు. ఏదో ప్రతి నెలా టార్గెట్ల కోసం విడతల వారీగా ట్రాక్టర్లు, టిప్పర్లు పట్టుకోవటం కొసమెరుపు. ఈ నదులు, వాగుల పరివాహక ప్రాంతంలోని గ్రామాభివృద్ధి కమిటీలే అనధికారికంగా వేలం పాటలు నిర్వహిస్తుండగా.. భారీగా ఆదాయం సమకూరుతోంది.

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఇసుక దందా జోరుగా సాగుతోంది. జిల్లాలో గోదావరి, స్వర్ణ, ప్రాణహిత, పెన్గంగా, పెంబి, కడెం, సుద్దవాగుల నుంచి పెద్ద ఎత్తున ఇసుక తరలిస్తున్నారు. గోదావరి, స్వర్ణ, కడెం నదుల పరివాహక ప్రాంతంలో అనధికారికంగా వీడీసీలే వేలంగా పాటలు నిర్వహిస్తుండగా.. దీని ద్వారా లక్షలాది ఆదాయం వస్తోంది. గోదావరి నదిపై బాసర, ముధోల్, లోకేశ్వరం, నర్సాపూర్, దిలావర్పూర్, సోన్, నిర్మల్(ఆర్), లక్ష్మణచాంద, మామడ, ఖానాపూర్, కడెం, జన్నారం, దండేపల్లి మండలాల్లో.. స్వర్ణవాగు సారంగాపూర్, నిర్మల్(ఆర్), సోన్ మండలాల్లో వేలంపాటలు వేసి అక్రమంగా ఇసుక తరలిస్తున్నారు. అక్టోబర్ నుంచి జూన్ వరకు టెండర్లు పిలుస్తుండగా.. పెద్ద ఎత్తున ఆదాయం సమకూరుతోంది. కూలీలతో తవ్వకాలు చేయాల్సి ఉండగా.. రాత్రనక, పగలనక భారీ యంత్రాలతో తవ్వి లారీలు, టిప్పర్లలో తీసుకెళ్తున్నారు.

ఎస్సారెస్పీ ఎగువన, ఈ నదుల పరివాహక ప్రాంతంలో పట్టాభూముల్లోనూ అనధికారికంగా ఇసుక తవ్వకాలు చేస్తున్నారు. వాస్తవానికి పెంబి మండలం షెట్పల్లిలో నాలుగు ఎకరాల్లో 5 వేల క్యూబిక్ మీటర్లకే అనుమతి ఇచ్చారు. అదీ కూలీలతో తవ్వి, నింపి ట్రాక్టర్ల ద్వారా తీసుకెళ్లేందుకు అనుమతి ఉంది. జిల్లాలో జేసీబీలు, ప్రొక్లెయిన్లు పెట్టి తవ్వి.. లారీలు, టిప్పర్లలో తరలిస్తున్నారు. ప్రభుత్వ భూముల్లోనూ ఇసుక తవ్వకాలకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఇక్కడ కూడా అనుమతులకు మించి అక్రమంగా తరలిస్తున్నారు. గోదావరి, స్వర్ణ నదుల పరివాహక ప్రాంతాల్లో కొన్నిచోట్ల నదులు, వాగుల్లో ఇసుక తరలింపునకు జిల్లా స్థాయి సాండ్ కమిటీ మార్గదర్శకాల ప్రకారం స్థానికంగా నిర్మాణాలు, అవసరాలకు ఇసుక తీసుకెళ్లవచ్చు. స్థానిక తహసీల్దార్లకు రూ.481 డీడీ ఇస్తే ట్రాక్టర్‌కి వేబిల్లు జారీ చేస్తున్నారు. ఇక్కడ కూడా డీడీలు చెల్లించకుండా స్థానిక గ్రామాల వారితో మాట్లాడుకుని అక్రమంగా తరలిస్తున్నారు.

గోదావరి నది నుంచి ఇసుక అక్రమంగా తరలించడంలో ఓ జడ్పీటీసీ సభ్యుడు కీలక పాత్ర పోషిస్తున్నారు. అక్కడ వీడీసీకి రూ.15 వేలకు మాట్లాడుకుని రూ.20 వేలకు లారీల వారికి అప్పగిస్తున్నారు. వారు బయట రూ.50 వేలకు అమ్ముతున్నారు. సదరు జడ్పీటీసీ సభ్యుడికి లారీకి రూ.5 వేలు మిగలగా.. రోజుకు 12 లారీల నుంచి రూ.60 వేలు వస్తున్నాయి. రాత్రి పూట 10 గంటలకు లారీలు బయలు దేరి తెల్లవారు జామున నిర్మల్ చేరుతాయి. పట్టణ శివారులోని మంచిర్యాల రోడ్డులోని ఓ ధర్మకాంట వద్ద తూకం చేయించి.. వినియోగదారుల ఇండ్లకు తరలిస్తున్నారు. మధ్యలో పోలీసులు ఆపితే సదరు జడ్పీటీసీ సభ్యుడు.. ఓ ఎమ్మెల్యే ద్వారా ఫోనులో మాట్లాడిస్తున్నారు. గతంలోనూ ఓ నియోజకవర్గంలోని ఇసుక పక్క నియోజకవర్గం వెళ్లకుండా సదరు ఎమ్మెల్యే అడ్డుకున్నట్లు చర్చ నడుస్తోంది.

నిర్మల్ పట్టణంలోని కొందరు ప్రముఖ నాయకులు, ప్రజాప్రతినిధులు, కీలక పోస్టుల్లో ఉన్నవారు ఇసుక దందానే ప్రధాన ఆదాయంగా పెట్టుకున్నారు. టిప్పర్లు, లారీలు, జేసీబీలు కొనగా.. ఇసుక తవ్వకాలు, దందా చేసి కాసులు దండుకుంటున్నారు. దీంతో పోలీసులు, రెవెన్యూ అధికారులు కాసుల వేటలో పడి కేసుల సంగతి మర్చిపోతున్నారనే విమర్శలున్నాయి. లారీ, టిప్పరుకి రూ.10 వేలు, ట్రాక్టరుకు రూ.5 వేల చొప్పున ప్రతి నెలా వసూలు చేస్తున్నారు. ఓ ఎస్సైకి ఇసుక ద్వారా ప్రతి నెలా రూ.2.50 లక్షల ఆదాయం వస్తుందంటే.. దందా ఎలా ఉందో అర్థమవుతోంది. నెలవారీ మామూళ్లు ఇచ్చినా.. ప్రతి నెలా టార్గెట్ల కోసం విడతల వారీగా ట్రాక్టర్లు, టిప్పర్లు పట్టుకుని కేసులు నమోదు చేస్తుండటం గమనార్హం.

Next Story

Most Viewed