ఆ సమస్యపై నోరు మెదపని ఎమ్మెల్యే.. వారి ఆశలు అడియాశలేనా

by  |
ఆ సమస్యపై నోరు మెదపని ఎమ్మెల్యే.. వారి ఆశలు అడియాశలేనా
X

దిశ, గీసుకొండ : కార్పొరేషన్‌లో విలీనమైన గ్రామాల అభివృద్ధికి కృషి చేస్తానని పరకాల నియోజకవర్గ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. సోమవారం విలీన గ్రామాల్లో అభివృద్ధి పనుల పరిశీలనలో భాగంగా 15వ డివిజన్ మొగిలిచర్ల గ్రామంలో మున్సిపల్ కమిషనర్ ప్రావీణ్య, మేయర్ గుండు సుధారాణి గార్లతో ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా గ్రామంలో వివిధ సమస్యల గూర్చి ప్రజలను అడిగి తెలుసుకున్నారు. వీధుల్లో అస్తవ్యస్తంగా ఉన్న డ్రైనేజీ‌లను శుభ్రం చేయించవలసిందిగా సంబంధిత కార్పొరేటర్‌ను ఆదేశించారు.పెండింగ్‌లో ఉన్న పన్నుల విషయంలో అలసత్వం వహించకుండా వెంటనే పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. డివిజన్‌లో పురోగతిలో ఉన్న అభివృద్ధి పనులను ఈ సందర్బంగా ఆయన పరిశీలించారు. ఈ కార్యక్రమంలో డీ ఈ, ఏ ఈ,కార్పోరేటర్లు మనోహర్, సుంకరి మనీషా శివకుమార్, పీఏసీ చైర్మన్ కందుల శ్రీనివాస్ రెడ్డి, గ్రామస్థులు పాల్గొన్నారు.

డ్రైనేజీ సమస్య హామీపై మాట్లాడని ఎమ్మెల్యే..

విలీన గ్రామాల్లో అభివృద్ధి పనుల పరిశీలనలో భాగంగా మున్సిపల్ కమిషనర్, మేయర్, అధికారులతో పర్యటించినా, పరకాల శాసనసభ్యులు చల్లా ధర్మారెడ్డి గ్రామంలోని పెద్ద బాట వీధిలో నూతనంగా, అస్తవ్యస్తంగా నిర్మించిన డ్రైనేజీ సమస్య పై మాట్లాడకపోవడం పై కాలనీ వాసులను అసహనానికి గురి చేసింది. ఈ సందర్భంగా కాలనీ వాసులు మాట్లాడుతూ.. గత నెల రోజుల క్రితం నిరుపయోగంగా నిర్మించిన డ్రైనేజీ విషయంపై కాలనీ వాసులు ఆందోళన చేపట్టడంతో గ్రామానికి వచ్చిన ఎమ్మెల్యే స్పందించి సమస్యను తెలుసుకుని డ్రైనేజీ లోతు పెంచే విషయంపై అధికారులతో చర్చించి చర్యలు తీసుకుంటామని తెలిపారు. కాగా, నెల రోజులు గడిచినా డ్రైనేజీ సమస్యలో ఎలాంటి పురోగతి లేదన్నారు. సోమవారం అధికారులతో సహా వచ్చిన ఎమ్మెల్యే అస్తవ్యస్తంగా నిరుపయోగంగా నిర్మించిన డ్రైనేజీని పరిశీలించి మాట్లాడుతారని కాలనీ వాసులు ఎదురు చూశారు. కానీ ఎమ్మెల్యే, అధికారులు అటువైపు‌కు రాకపోవడంతో కాలనీవాసులు ఆవేదనతో అసహనం వ్యక్తం చేశారు. కాగా డ్రైనేజీ విషయమై అధికారులతో చర్చించి మాకు న్యాయం చేయాలని కాలనీవాసులు ఎమ్మెల్యేని ఈ సందర్భంగా కోరారు.


Next Story

Most Viewed