మళ్లీ కట్టెల పొయ్యిపైనే వంట.. ఎమ్మెల్యే సీతక్క ఆగ్రహం

by  |
MLA Seethakka
X

దిశ, ములుగు: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పెంచిన వంట గ్యాస్, పెట్రోలు, డీజిల్ ధరలను వెంటనే తగ్గించాలని ఏఐసీసీ మహిళా ప్రధాన కార్యదర్శి, ములుగు ఎమ్మెల్యే సీతక్క డిమాండ్ చేశారు. ఆదివారం జిల్లా కేంద్రంలో జాతీయ రహదారిపై పెరిగిన పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరలకు నిరసనగా మహిళా కాంగ్రెస్ నేతల ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న సీతక్క మాట్లాడుతూ.. పెరిగిన వంటగ్యాస్‌ను సామాన్యులు కొనలేకపోతున్నారని తెలిపారు. దీంతో మళ్ళీ పాత రోజులు వచ్చి, కట్టెల పొయ్యి మీదనే వంట వండుకోవాల్సిన పరిస్థితి వస్తోందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.

ఈ ధరలతో పేదవాడు బతికే పరిస్థితి లేదని, ఇప్పటికైనా ప్రభుత్వాలు వంటగ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించాలని డిమాండ్ చేశారు. లేకపోతే కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ధర్నాలు, రాస్తారోకోలు కొనసాగుతాయని హచ్చరించారు. ఈ కార్యక్రమంలో ములుగు జిల్లా మహిళా అధ్యక్షురాలు కొమరం ధనలక్ష్మి, జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు నల్లెల్ల కుమారస్వామి, కిసాన్ సెల్ జిల్లా అధ్యక్షుడు గొల్లపల్లి రాజేందర్ గౌడ్, ములుగు జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు బానోతు రవిచందర్ తదితరులు పాల్గొన్నారు.

Next Story