RS ప్రవీణ్ కుమార్‌ను పార్టీలోకి ఆహ్వానించిన కాంగ్రెస్

by  |
MLA Jagga Reddy, Madhuyashki
X

దిశ, తెలంగాణ బ్యూరో: మాజీ ఐపీఎస్ అధికారి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కాంగ్రెస్‌లోకి వస్తామంటే ఓపెన్ హార్ట్‌తో స్వాగతిస్తామని, దళిత సీఎంను చేస్తానని చెప్పిన కేసీఆర్‌ను ప్రశ్నించాల్సిన అవసరం ఉందని టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్​మధుయాష్కీ, వర్కింగ్​ప్రెసిడెంట్ జగ్గారెడ్డి అన్నారు. శనివారం గాంధీభవన్‌లో టీపీసీసీ పొలిటికల్ ఎఫైర్స్ కమిటీ సమావేశమైంది. ఈ సమావేశానికి టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, టీపీసీసీ వర్కింగ్​ప్రెసిడెంట్లు అంజన్, మహేష్ గౌడ్ తదితరులు హాజరయ్యారు. తాజా రాజకీయ పరిణామాలు, హుజూరాబాద్ ఉపఎన్నిక, ఉద్యోగాల భర్తీ కోసం 48 గంటల దీక్ష తదితర అంశాలపై చర్చించారు. అనంతరం ప్రచార కమిటీ చైర్మన్​ మధుయాష్కీ, వర్కింగ్ ప్రెసిడెంట్​ జగ్గారెడ్డి మీడియాతో మాట్లాడారు. టీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తున్న ప్రతి అవినీతిపై పోరాటం చేస్తామని, దీనిలో భాగంగా కోకాపేట భూముల అవినీతిపై త్వరలోనే ప్రత్యేక కార్యక్రమం తీసుకుంటామని ప్రకటించారు. పేదలకిచ్చిన అసైన్డ్ భూమిపై కుటుంబాలు తరతరాలు ఆధారపడి జీవిస్తాయని, కాంగ్రెస్ హయాంలో పేదలకు ఇచ్చిన భూముల విలువ పెరిగిందన్నారు. ఆ భూములను కేసీఆర్ పేదల నుంచి బలవంతంగా లాక్కుంటున్నారని, తమ గోడును చెప్పుకోవడానికి వెళితే కలెక్టర్లను కలువడం లేదని విమర్శించారు.

సిద్దాపూర్, కొండాపూర్‌లో పేదలకు ఇండ్ల కోసం ఇచ్చిన వంద ఎకరాల భూమిని అమ్మకానికి పెట్టారని, అక్కడ భూమి ఎకరా విలువ రూ.3 కోట్లకు పెరిగిందని, సంగారెడ్డి జిల్లాలో అసైన్డ్ భూములను కూడా టీఆర్ఎస్ మంత్రులు, ఎమ్మెల్యేలు కొనుగోలు చేశారని వివరించారు. తమవారికి కట్టబెట్టడానికే భూముల అమ్మకానికి తెరలేపారని, పేదలకు ఇచ్చిన అసైన్డ్ భూములను కాపాడటానికి కాంగ్రెస్ యుద్ధం మొదలైందన్నారు. పోడుభూములను లాక్కోవడాన్ని అరికట్టడం కోసం కమిటీని నియమిస్తున్నామని, ఎస్టీ ప్రతినిధులతో పోడు భూముల రక్షణ కోసం కార్యాచరణ రూపొందిస్తున్నట్లు మధుయాష్కీ, జగ్గారెడ్డి వెల్లడించారు. ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్‌ను, కిరణ్ కుమార్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడే గురుకులాలకు కార్యదర్శిగా అవకాశం ఇచ్చారని గుర్తుచేశారు. దళిత సీఎం, మూడెకరాల భూమి విషయంలో కేసీఆర్ మోసంపై ఆర్‌ఎస్ ప్రవీణ్ నిలదీయాలన్నారు. రాష్ట్రంలో ఇటీవల ప్రజా సమస్యలపై కాంగ్రెస్ చేసే నిరసనల్లో పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారని, త్వరలోనే డీజీపీని కలిసి ఫిర్యాదు చేస్తామని, హెచ్‌ఆర్సీ, హైకోర్టులో ప్రైవేట్ కేసు వేస్తామన్నారు.

కాంగ్రెస్​ నుంచి గెలిచి పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో కొన్ని కార్యక్రమాలను చేసేందుకు నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. ఏడేండ్ల కాలంలో ఎస్సీ, ఎస్టీలను ప్రభుత్వం వంచనకు గురి చేసిందని, ఈ వర్గాలకు ఖర్చు పెట్టిన నిధులపై శ్వేతపత్రం విడుదల చేయాలన్నారు. రాష్ట్రంలో త్వరలోనే దళిత, గిరిజన దండోరా చేపట్టుతామని, అనంతరం బీసీ దండోరా ఉంటుందని ప్రకటించారు. కేసీఆర్​అసలు రంగును బయటపెట్టేందుకు క్విట్​ఇండియా రోజైన ఆగస్టు 9 నుంచి 17 వరకు కాంగ్రెస్​ ఆధ్వర్యంలో దళిత దండోరా ఉంటుందన్నారు. హుజురాబాద్​ఉప ఎన్నిక అంశంపై పార్టీలో చర్చించామని, వచ్చే మంగళవారం దామోదర రాజనర్సింహా అక్కడ పర్యటిస్తారని, పార్టీ నేతల అభిప్రాయం సేకరిస్తారని మధుయాష్కీ, జగ్గారెడ్డి తెలిపారు. ఐపీఎస్‌కు రాజీనామా చేసిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్‌ను పార్టీలోకి రావాలని ఆహ్వానిస్తున్నామని, అంతేకాకుండా.. తెలంగాణ ఉద్యమం కోసం పని చేసి కోదండరాం, చెరుకు సుధాకర్, గద్దర్, విమలక్కతో తెలంగాణ వాదులందరినీ కాంగ్రెస్​తో కలిసి రావాలని ఆహ్వానిస్తామని చెప్పారు. కేసీఆర్‌పై నిజంగా పోరాటం చేయాలంటే కాంగ్రెస్​మాత్రమే సరైన వేదిక అని సూచించారు.

Next Story