లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండండి : ఎమ్మెల్యే గండ్ర

by  |
లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండండి : ఎమ్మెల్యే గండ్ర
X

దిశ, భూపాలపల్లి : గత మూడు రోజులుగా కురుస్తున్న వర్షాల వల్ల నదులు, వాగులు పొంగిపొర్లుతున్నాయి. వరదల కారణంగా లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించి వారికి పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేయాలని భూపాలపల్లి శాసనసభ్యుడు గండ్ర వెంకటరమణ రెడ్డి అధికారులకు సూచించారు. పల్లెల్లో సీజనల్ వ్యాధులు రాకుండా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తెలిపారు.

బుధవారం మధ్యాహ్నం భూపాలపల్లి జిల్లాలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. భారీగా కురిసిన వర్షాల వల్ల వరద నీరు రావడంతో పాటు చెరువులు, కుంటలు పూర్తిగా నిండిపోయాయని అన్నారు. దీంతో పల్లెల్లో వ్యాధులు ప్రబలే ప్రమాదం ఉందని వ్యాధుల పట్ల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు. అధికారులు ఎప్పటికప్పుడు గ్రామాల్లో పర్యటించి వ్యాధులు ప్రబలకుండా ప్రజలకు సూచనలు ఇవ్వాలని కోరారు.

ప్రస్తుతం కరోనాతో ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. పల్లెల్లో వింత వ్యాధులు ప్రబలితే ప్రజలకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతాయని.. ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన వైద్యాధికారులకు సూచించారు. అనంతరం ఆయన 13 మందికి ఆరు లక్షల 36 వేల ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ వెంకట రాణి సిద్దు, వైస్ చైర్మన్ హరిబాబు, టీఆర్ఎస్ కార్యకర్తలు పాల్గొన్నారు.


Next Story

Most Viewed