రామన్నపేటకు పూర్వ వైభవం తీసుకొస్తా: ఎమ్మెల్యే చిరుమర్తి

by  |
MLA Chirumarthi Lingaiah
X

దిశ, నకిరేకల్: గతంలో నియోజకవర్గ కేంద్రమైన రామన్నపేట పట్టణాన్ని అభివృద్ధిలో అగ్రభాగాన నిలబెడతామని నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య హామీ ఇచ్చారు. ప్రజల సహకారంతోనే అభివృద్ధికి శ్రీకారం చూడతానని చెప్పారు. పల్లెనిద్ర కార్యక్రమంలో భాగంగా సోమవారం పట్టణంలోని కురుమ వాడ, ఎస్సీ కాలనీ, ఎస్టీ కాలనీ, మైనారిటీ కాలనీలలో పర్యటించి సమస్యలు తెలుసుకున్నారు. పలువురు కాలనీవాసులు చెప్పిన సమస్యలను అక్కడికక్కడే పరిష్కరించారు. అదేవిధంగా అధికారులతో సమీక్షా సమావేశం ఏర్పాటు చేసి పట్టణంలో సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపేలా యాక్షన్ ప్లాన్ ఏర్పాటు చేయాలని సూచించారు. విద్యార్థుల భవిష్యత్తుకై జూనియర్ కాలేజీకి నిధులు మంజూరు చేస్తానన్నారు.

గత పాలకుల హయాంలో నియోజకవర్గ కేంద్రమైనా.. ఇప్పటికీ రామన్నపేట అభివృద్ధికి నోచుకోలేదన్నారు. అనంతరం పట్టణంలోని లక్ష్మీనరసింహ ఫంక్షన్ హాల్‌లో ముఖ్య కార్యకర్తల, ప్రజాప్రతినిధులతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. పార్టీ కార్యకర్తలకు ఎల్లవేళలా అండగా ఉంటానని హామీ ఇచ్చారు. సీఎం కేసీఆర్ చేపట్టిన సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని కోరారు. దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో సంక్షేమ పథకాలు అమలు అవుతున్నాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ శిరీష, స్థానిక ప్రజా ప్రతినిధులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Next Story