మిషన్ భగీరథ.. ఇంకెన్నిరోజులు..!

by  |
మిషన్ భగీరథ.. ఇంకెన్నిరోజులు..!
X

‘ఏ ఒక్క ఆడపడుచునూ ఖాళీ బిందెలతో రోడ్డుపైకి రానివ్వం.. ఇంటింటికీ నల్లా కనెక్షన్‌‌ ఇస్తేనే ఓట్లు అడుగుతం.. లేదంటే ఓట్లు అడుగం..’ ఈ మాటలు అక్షరాల మన సీఎం కేసీఆర్ చెప్పినవే.. 2018 ఎన్నికల ముందు పనులతో కాస్త హడావుడి చేశారు. ఎన్నికల్లో విజయం సాధించాక పనులు మళ్లీ మొదటికి వచ్చాయి. సీఎం చెప్పిన మాటలకు వాస్తవ పరిస్థితులకు ఎక్కడా పొంతన కుదరడం లేదు. ఉమ్మడి జిల్లాలో మిషన్ భగీరథ పనులు ఇంకా నత్తనడకన సాగుతూనే ఉన్నాయి.

దిశ, మహబూబ్‌నగర్ : రాష్ట్రంలో ప్రతి ఇంటికీ తాగునీటిని అందించేందుకు ప్రభుత్వం మిషన్ భగీరథ పథకాన్ని ప్రవేశపెట్టింది. మొదట్లో పనులు చకచకా జరిగేవి. ప్రభుత్వం సైతం అందుకు సంబంధించిన నిధులను వెంటవెంటనే విడుదల చేసింది. 2018 ఎన్నికల లోపు పనులు పూర్తి చేయాలని భావించింది. ఒక వేళ ఇంటింటికీ నల్లా కనెక్షన్ ఇవ్వకుంటే ఎన్నికల్లో ఓట్లు అడగబోమని స్వయానా సీఎం కేసీఆరే చెప్పారు. కానీ పనుల్లో తీవ్ర జాప్యం తలెత్తింతి. ఎన్నికలు దగ్గరపడటంతో పనుల్లో కాస్త వేగం పెంచి అధికారులు, ప్రజాప్రతినిధులు కాస్త హడావుడి చేశారు. తీరా ఎన్నికల్లో విజయం సాధించాక పనులు పరిస్థితి మళ్లీ మొదటికే వచ్చింది.

పనులు నత్తనడకన..

ఎన్నికల ముందు చేపట్టిన మిషన్ భగీరథ పనులకు ప్రభుత్వం నుంచి బిల్లులు రాకపోవడంతో చాలా గ్రామాల్లో పనులు నిలిచిపోయాయి. మరికొన్ని చోట్ల పనులు నెమ్మదిగా కొనసాగుతున్నాయి. సీఎం ఇచ్చిన హామీ అటకెక్కడంతో నీటి కోసం మహిళలు అక్కడక్కడా ఖాళీ బిందెలతో నిరసన తెలుపుతూనే ఉన్నారు. గ్రామాల్లో పరిస్థితి ఎలా వున్న పురపాలికలో సైతం నల్ల కనెక్షన్లు పూర్తి కాకపోవడం విమర్శలు తావిస్తుంది.

సగానికి పైగా అందని కనెక్షన్లు..

ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మొత్తం 19 మున్సిపాలిటీలు ఉండగా వాటిలో మహబూబ్‌నగర్, అయిజ మినహా ఎక్కడా సగానికి మించి కనెక్షన్లు ఇవ్వలేదు. జిల్లాలో వున్న పది ప్రధాన మున్సిపాలిటీల ను పరిశీస్తే ఈ విషయం బయటపడుతోంది.

కరోనా ఎఫెక్ట్..

ఉమ్మడి జిల్లా వ్వాప్తంగా మొత్తం 1692 గ్రామ పంచాయతీలున్నాయి. ఇందులో సగానికి పైగా గ్రామాల్లో పనులు పూర్తికాలేదు. కరోనా సైతం మిషన్ భగీరథ పనులకు కాస్త అడ్డంకిగా మారింది. ఈ పథకంలో భాగంగా నల్లా కనెక్షన్లు ఇచ్చేందుకు వచ్చిన ఇతర రాష్ట్రాల కార్మికులు కరోనా కారణంగా తమ స్వస్థలాలకు వెళ్లిపోయారు. దీంతో చాలా గ్రామాల్లో జరగాల్సిన పనులు నిలిచిపోయాయి. మరికొన్ని చోట్ల ట్యాంకుల నిర్మాణ పనులు, పైపులైన్ పనులు ఆగిపోయాయి. చాలా గ్రామాల్లో పైపులైన్ పనులు పూర్తయి ట్యాంకుల నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి.


Next Story

Most Viewed