కొహెడ మార్కెట్‌ను సందర్శించిన మంత్రులు

by  |
కొహెడ మార్కెట్‌ను సందర్శించిన మంత్రులు
X

దిశ, రంగారెడ్డి: కొహెడలో నూతనంగా నిర్మించిన పండ్ల మార్కెట్‌ను మంత్రులు నిరంజన్‌రెడ్డి, సబితా‌ ఇంద్రారెడ్డి‌, ఎమ్మెల్యేలు దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి, మంచిరెడ్డి కిషన్‌రెడ్డి, మార్కెట్ చైర్మన్ రాంనర్సింహ‌గౌడ్ మంగళవారం పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రులు మాట్లాడుతూ.. పూర్తి స్థాయిలో మరో మూడ్రోజుల్లో అందుబాటులో వస్తుందన్నారు. అనధికారికంగా మామిడి రాక ఇప్పటికే మొదలయ్యిందని తెలిపారు. కరోనా నేపథ్యంలో యుద్ద ప్రాతిపదికన పనులు సిద్ధం చేస్తున్నామన్నారు. రోజుకు 600 వాహనాలు వస్తున్నాయని, ఇది మరింత పెరుగుతుందన్నారు. రెండు భారీ షెడ్లు కూడా సిద్ధం చేయగా, మరో షెడ్‌లు నిర్మిస్తామన్నారు. రూ.65 లక్షలతో 1.26 లక్షల చదరపు అడుగుల షెడ్లు అందుబాటులోకి తీసుకొస్తామని తెలిపారు. తాగునీటి కోసం 22వేల లీటర్ల ట్యాంకులు, ఔటర్ నుంచి మార్కెట్ వరకూ వెంటనే లైటింగ్ సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. రైతులు, ఏజెంట్లు, సహాయకుల కోసం క్యాంటీన్ ఏర్పాటు చేయాలన్నారు. మార్కెట్ ఏజెంట్లు, సహాయకులకు పోలీసులతో ఇబ్బందులు లేకుండా గుర్తింపు కార్డులు వెంటనే ఇవ్వాలని తెలిపారు. తెలంగాణలో 4 లక్షల ఎకరాలలో మామిడి పంట సాగయిందన్నారు. జగిత్యాల మామిడి పంట ముంబయికి వెళ్తుందని, మిగిలిన మామిడి అంతా కొహెడకే వస్తుందన్నారు. గడ్డిఅన్నారం మార్కెట్ సరిపోదని ముందస్తు ప్రణాళికతో కోహెడలో ఈ ఏడాది మామిడి మార్కెట్ సిద్ధం చేశామన్నారు. మార్కెట్లో సీసీ కెమెరాలు, ప్రథమ చికిత్స కేంద్రం, అగ్నిమాపక కేంద్రం, పార్కింగ్ తదితర సౌకర్యాలన్నీ సిద్దమయ్యాయి. వ్యవసాయ మార్కెట్ కమిటీ నుంచి ఉచితంగా మాస్కులు సరఫరా చేస్తున్నామని తెలిపారు. రైతులు, ఏజెంట్లు సామాజిక దూరం పాటించాలని సూచించారు.

Tags: Ministers, visited, Koheda,Fruit Market,rangareddy, sabitha indra reddy

Advertisement
Next Story

Most Viewed