వైవీ సుబ్బారెడ్డికి మంత్రి పదవి?

by  |
YV Subbareddy
X

దిశ, ఏపీ బ్యూరో : టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డికి మంత్రి పదవి దక్కుతుందని సోషల్​ మీడియాలో పోస్టులు వైరలవుతున్నాయి. చైర్మన్​ పదవి ఈనెల 23తో ముగుస్తుంది. తర్వాత ఏంటనేది అధికార పార్టీ వర్గాల్లో చర్చనీయాంశమైంది. రాష్ట్ర మంత్రి వర్గం ఏర్పాటు సమయంలో సీఎం జగన్ ​మంత్రి పదవులు రెండున్నర సంవత్సరాలేనని స్పష్టంగా ప్రకటించారు. తర్వాత రెండున్నర సంవత్సరాల్లో మిగతా సీనియర్లకు అవకాశమిస్తామని స్పష్టం చేశారు. దీంతో ప్రస్తుతం మంత్రులుగా ఉన్న వాళ్లు ప్రాధాన్యం గల శాఖలు కోరుకుంటున్నారు. గతంలో బెర్త్​దక్కని వాళ్లు ఎప్పుడెప్పుడు పిలుస్తారా అని ఎదురు చూస్తున్నారు.

టీటీడీ చైర్మన్‌గా మేకపాటి రాజమోహన్‌రెడ్డి?

రెడ్డి సామాజిక వర్గంలో వైవీ సుబ్బారెడ్డిని ఎమ్మెల్సీగా చేసి మంత్రి పదవి ఇస్తారనేది టాక్. టీటీడీ చైర్మన్ పదవిని పార్టీ సీనియర్ నేత మేకపాటి రాజమోహన్​రెడ్డికి కట్టబెట్టబోతున్నారని తెలుస్తోంది. తనకు ఈ ఒక్క అవకాశం ఇవ్వాలని సీఎం జగన్​ను అడిగినట్లు సమాచారం. ఈ పరిణామాల నేపథ్యంలో వైవీకి మంత్రి పదవి ఖాయమని ఆయన అనుచరుల్లో చర్చ సాగుతోంది.

ఇక విస్తరణ విషయానికి వస్తే నెల్లూరు జిల్లా నుంచి రెండో దఫా ఎవరికీ అవకాశం ఉండకపోవచ్చని తెలుస్తోంది. యాదవ సామాజిక వర్గం నుంచి పార్టీ సీనియర్​నేత పార్థసారధికి దక్కే అవకాశాలున్నాయి. అలాగే కృష్ణా జిల్లాకు సంబంధించి మంత్రి వెల్లంపల్లి స్థానంలో అదే సామాజిక వర్గానికి చెందిన మిగిలిన ఇద్దరు ఎమ్మెల్యేల్లో ఒకరికి అవకాశం రావొచ్చు. ఇదే పద్దతిలో మిగతా సామాజిక వర్గాలకు చెందిన మంత్రుల స్థానంలో అదే సామజికవర్గాలకు చెందిన ఎమ్మెల్యేలకు సీఎం అవకాశం ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.

కేబినెట్ విస్తరణపై సీఎం జగన్ ప్రత్యేక దృష్టి

వాస్తవానికి వైవీ సుబ్బారెడ్డికి ఒంగోలు ఎంపీ సీటు ఇవ్వాల్సింది. రాజకీయ సమీకరణలు, అప్పటి పరిస్థితుల్లో టీడీపీని ఎదుర్కొనే ఎత్తుగడల్లో భాగంగా ఆ అవకాశాన్ని కోల్పోవాల్సి వచ్చింది. టీడీపీ నుంచి వచ్చిన మాగుంట శ్రీనివాసుల రెడ్డికి ఎంపీ సీటు ఇవ్వడంతో టీడీపీకి పోటీ చేసేవాళ్లు లేక అప్పటిదాకా మంత్రిగా కొనసాగిన శిద్దా రాఘవరావు టీడీపీ తరపున ఒంగోలు ఎంపీగా నిలబడాల్సి వచ్చింది. సిట్టింగ్​ స్థానాన్ని మరొకరికి ఇవ్వడమంటే పదవిని త్యాగం చేసినట్లే లెక్క.

నాడు సీఎం జగన్​నిర్ణయానికి వైవీ కట్టుబడ్డారు. తర్వాత మంత్రివర్గం ఏర్పాటు సమయానికి ముందే సుబ్బారెడ్డికి టీటీడీ చైర్మన్ ​పదవిని ఖాయం చేశారు. రెండేళ్లలో ఆయనకు పెద్ద బాధ్యతలే అప్పగించారు. ఎన్నికలకు ముందే ఉభయ గోదావరి జిల్లాల బాధ్యతలు చేపట్టి పార్టీకి తిరుగులేని విజయాన్ని సాధించడంలో కీలక పాత్ర పోషించారు. అప్పటి నుంచి ఆయన అవే జిల్లాల బాధ్యత చూస్తున్నారు. ఆ తర్వాత చిత్తూరు జిల్లాను కూడా అప్పగించారు. అతి పెద్ద జిల్లాల్లో పార్టీని సమన్వయం చేస్తూ ఎక్కడైనా విభేదాలు తలెత్తితే సామరస్యంగా పరిష్కరించడంలో వైవీ సుబ్బారెడ్డి పాత్ర ఎనలేనిది.

గతేడాది రాజ్యసభకు వెళ్లాలని భావించారు. అప్పుడు కూడా ఆయన కోరిక నెరవేరలేదు. ఎప్పటికప్పుడు సీఎం జగన్ ​ముందుకు వస్తున్న ప్రాధాన్యతల వల్ల సుబ్బారెడ్డికి అవకాశం దక్కకుండా పోయింది. ప్రస్తుతం ఆయన రాజ్యసభ సీటుపై ఆశలు వదులుకున్నారు. ఇప్పట్లో ఖాళీలు వచ్చే అవకాశం కూడా లేదు. అందువల్ల ఎమ్మెల్సీ అవడం ద్వారా మంత్రి పదవి చేపట్టాలని భావిస్తున్నారు. ఇంకా ఆర్నెల్లు సమయం ఉంది. ఈలోగా మంత్రి పదవులు ఎవరెవరికి ఇవ్వాలి.. ఎవరి పనితీరు ఎలా ఉందనే అంశాలపై సీఎం జగన్​ ప్రత్యేక దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది.

Next Story

Most Viewed