పెండింగ్ వర్క్స్ వేగవంతం చేయండి

by  |

దిశ, మహబూబ్ నగర్ :
జిల్లాలో డబుల్​ బెడ్​రూం ఇళ్లు, జిల్లా కోర్టు సముదాయ భవనం, గోదాం నిర్మాణాలను వేగంగా పూర్తి చేయాలని సంబంధిత అధికారులను నాగర్ కర్నూలు జిల్లా కలెక్టర్ శ్రీధర్ ఆదేశించారు. నూతన కలెక్టరేట్​ నిర్మాణ పనులు చేపట్టిన కాంట్రాక్టర్​ను బ్లాక్​లిస్టులో పెట్టేందుకు నివేదిక తయారు చేయాలని అధికారులకు సూచించారు. జిల్లా కలెక్టరేట్​ కార్యాలయంలో​ ఆర్​ అండ్​ బీ, ఇంజినీరింగ్​ అధికారులతో సమీక్ష నిర్వహించి, జిల్లాలో జరుగుతున్న డబుల్ బెడ్ రూం ఇళ్ల పనుల పురోగతిని అడిగి తెలుసుకున్నారు. జిల్లాలో ఇప్పటి వరకు 3,816 డబుల్ బెడ్‌రూం ఇళ్లు మంజూరు కాగా, 1235 ఇళ్లకు టెండర్ ప్రక్రియ ముగిసింది. 767ఇళ్లకు వివిధ దశల్లో నిర్మాణ పనులు కొనసాగుతున్నాయన్నారు. వాటిని మూడు నెలల్లో పూర్తి చేయాలని సంబంధిత ఇంజినీరింగ్ అధికారులను కలెక్టర్ ఆదేశించారు. టెండర్ ప్రక్రియ ముగిసినా 262 ఇళ్ల పనులు ప్రారంభం కాకపోవడం, నూతన కలెక్టరేట్ సముదాయ భవనం నిర్మాణ ప్రగతిపై కలెక్టర్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. భవన నిర్మాణంలో ఏమాత్రం పురోగతి లేదని, ఇప్పటివరకు బేస్​మెంట్​ లెవల్ మాత్రమే పూర్తి చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సంబంధిత కాంట్రాక్టర్​ను బ్లాక్ లిస్టులో ఉంచేందుకు రాష్ట్ర ప్రభుత్వానికి నివేదించాలని అదనపు కలెక్టర్ మను చౌదరికి సూచించారు. జిల్లా కేంద్రంలో నిర్మిస్తున్న కోర్టు సముదాయ భవనాన్నినెలలోపు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.

Next Story