‘ఖమ్మంలో ఒకే కేసు.. ఆందోళన వద్దు’

by  |

దిశ‌, ఖ‌మ్మం: జిల్లాలో ఇప్పటివరకు ఒకే కరోనా పాజిటివ్ కేసు నమోదైందనీ, బాధితుడితో సన్నిహితంగా ఉన్నవారి రిపోర్టులు నెగటివ్‌గా వచ్చాయనీ, కావునా ప్రజలెవరూ భయాందోళనలు చెందొద్దని మంత్రి పువ్వాడ అజయ్ ధైర్యం నింపారు. కరోనా మహమ్మారి నుంచి ఖమ్మం జిల్లాను సురక్షితంగా ఉంచేందుకు ప్రజలు సహకరించాలని కోరారు. జిల్లా కలెక్టర్ ఆర్.వి.కర్ణన్, పోలీసు కమిషనర్ తఫ్సీర్ ఇక్బాల్, డీఎంహెచ్‌వో మాలతి, వైద్య అధికారులతో కలెక్టరేట్‌లో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అజయ్ కుమార్ మాట్లాడుతూ.. జిల్లా యంత్రాంగం తీసుకున్న చర్యల ఫలితంగా నెలరోజుల వరకూ ఖమ్మంలో ఒక్క పాజిటివ్ కేసూ న‌మోదు కాలేద‌ని అన్నారు. జిల్లాలో పాజిటివ్ కేసు నమోదైన వెంటనే బాధితుడిని గాంధీ అసుపత్రికి గాంధీ ఆస్పత్రికి తరలించామని చెప్పారు. ఐసోలేషన్‌లో ఉన్న 12 మందికి నెగిటివ్ రిపోర్టు వచ్చిందని స్ప‌ష్టం చేశారు. జిల్లాలో పరిస్థితి పూర్తిగా అదుపులోనే ఉందనీ, ప్రజలు భయాందోళనకు గురికావ‌ద్ద‌ని సూచించారు. పాజిటివ్ వచ్చిన పెద్దతండాలో అదనపు కలెక్టర్ నేతృత్వంలో 19 బృందాలు పర్యవేక్షిస్తున్నాయ‌ని తెలిపారు. వీటితో పాటు రఘునాథ‌పాలెం, నేలకొండపల్లి ప్రాంతాల్లోనూ సర్వే చేస్తున్నట్లు వెల్లడించారు. ప్రైమ‌రీ కాంటాక్ట్ కలిగిన వారి నమూనాలను పరీక్షకు పంపించామనీ, సెకండరీ కాంటాక్ట్ ఉన్నవారు పరీక్షలు నిర్వహించుకునేందుకు స్వచ్ఛందంగా ముందుకు రావాలని కోరారు. లాక్ డౌన్‌ను మరింత పటిష్టం చేస్తున్నామనీ, రేపటి నుంచి ఉదయం 11గంటల వరకే నిత్యావసర వస్తువులు, కూరగాయల కొనుగోలుకు అనుమతిస్తామని తెలిపారు. 11 తర్వాత మెడికల్ షాపులు మాత్రమే తెరిచి ఉంటాయని చెప్పారు. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

tags: corona, virus, puvvada ajay, khammam, collector R.V karnan, dmho malathi, police commissioner tafseer,

Advertisement
Next Story

Most Viewed