తగ్గుతున్న పువ్వాడ ప్రభ..! సొంత సామాజికవర్గంలోనే ఎదురు దెబ్బ

by  |
Puvvada-1111
X

దిశ, నిఘా ప్రతినిధి: మంత్రి పువ్వాడ అజయ్‌కు సొంత జిల్లాలో పట్టు తప్పుతున్నదా..? సొంత సామాజిక వర్గంలోనే ఎదురుదెబ్బ తగిలిందా? ఇన్నాళ్లూ అభివృద్ధి పేరిట ఇమేజ్ పెంచుకున్నా.. ఆయన గ్రాఫ్ ఇప్పుడు పడిపోతున్నదా..? అంటే అవుననే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. యువనేత కేటీఆర్‌కు అత్యంత సన్నిహితుడిగా పేరున్న పువ్వాడపై ఇటీవల జరిగిన ఓ సమావేశంలో సీఎం కేసీఆర్ సీరియస్ అయినట్లు వార్తలొచ్చాయి. దీంతో ప్రభుత్వ పెద్దలకు, మంత్రికి మధ్య గ్యాప్ వచ్చి ఉంటుందనే ఊహాగానాలు వినిపించాయి. దీనికి తోడు ఇప్పుడు సొంత జిల్లాలో అదీ సొంత సామాజిక వర్గంలో పువ్వాడకు పట్టు తప్పినట్టే కనిపిస్తోంది. ఆదివారం జరిగిన కమ్మ మహాజన సంఘం ఎన్నికల్లో మంత్రి పువ్వాడ అజయ్ మద్దతుదారుడు ఓటమిపాలవటం రాష్ట్ర వ్యాప్త చర్చకు దారితీసింది.

ప్రత్యర్థిని బెదిరించినా!

కమ్మ మహాజన సంఘం ఎన్నికల్లో మంత్రి పువ్వాడ మద్దతుదారుడు బిక్కసాని దామోదర్ ప్యానెల్‌.. ఎర్నేని రామారావు ప్యానెళ్లు పోటీ పడ్డాయి. ఈ ఎన్నికల్లో ఎర్నేని రామారావు 180 ఓట్ల మెజారిటీతో గెలిచాడు. ఎంత ప్రయత్నించినా అజయ్ మద్దతిచ్చిన ప్యానెల్ ఓటమి పాలవటం గమనార్హం. మంత్రి తన మద్దతుదారుడిని గెలిపించేందుకు అధికారాన్ని పూర్తిస్థాయిలో దుర్వినియోగం చేశారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఓ పోలీస్ ఉన్నతాధికారి నేతృత్వంలో తాము చెప్పిన వారికే ఓటు వేయాలంటూ ఓటర్లను ప్రలోభ పెట్టడంతోపాటు వినకుంటే బెదిరించారనే ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. ఎర్నేని రామారావును పోటీ చేయొద్దంటూ బెదిరించినట్లు సైతం సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి. అయితే ఎర్నేని ఎట్టి పరిస్థితుల్లో పోటీ చేస్తానంటూ సమాధానం చెప్పినట్లు సమాచారం. దీనికి సంబంధించి రామారావు మాట్లాడిన ఓ ఆడియో కూడా సోషల్ మీడియాలో వైరల్‌గా మారడం గమనార్హం.

ఏకపక్ష నిర్ణయాలే దెబ్బతీశాయా?

రవాణాశాఖ మంత్రికి తన సామాజిక వర్గంలోనే ఎదురుదెబ్బ తగలడం ఏంటనేది ఎవరికీ అంతుచిక్కడం లేదు. తన సామాజిక వర్గంలో మంత్రికి పట్టు లేదని కొందరు రాజకీయ విశ్లేషకులు వాదిస్తున్నారు. గత కార్పొరేషన్ ఎన్నికల్లో సీనియర్లను లెక్కచేయకుండా తన వారికే టికెట్లు కేటాయించి పువ్వాడ ఏకపక్షంగా వ్యవహరించారని.. అదే తన సొంత సామాజిక వర్గంలో ఎదురు దెబ్బ తగిలేలా చేసిందని మరికొందరు అంటున్నారు. కమ్మ సామాజిక వర్గానికి చెందిన మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కూడా అజయ్ మద్దతిచ్చిన బిక్కసాని దామోదర్‌కే జై కొట్టడారు. జిల్లాపై పూర్తి పట్టున్న ఇద్దరు నేతలు మద్దతిచ్చినా బిక్కసాని ఓడిపోవడం వెనుక ఎవరి హస్తం ఉందోనని ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

వచ్చే ఎన్నికల్లో పరిస్థితి ఏంటి..?

మంత్రి అజయ్ స్థానికంగా తను మద్దతిచ్చిన వ్యక్తిని గెలిపించుకోకపోవడం అందరినీ విస్మయానికి గురిచేస్తోంది. ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఉన్న 10 నియోజకవర్గాలు, ఒక ఎంపీ స్థానంపై తన మార్క్ ఇలాగే ఉంటే పరిస్థితి ఏంటంటూ గుసగుసలు వినిపిస్తున్నాయి. పార్టీ అధిష్టానం కూడా ఆలోచించాల్సిన పరిస్థితి ఏర్పడిందంటున్నారు. ఇక రవాణాశాఖ మంత్రిగా ఉన్న అజయ్ మొదట హుషారుగా పనిచేశారని.. ఆ తర్వాత ఆర్టీసీ చైర్మన్​గా బాజిరెడ్డి గోవర్ధన్​ను, ఎండీగా సజ్జనార్‌ను నియామకం తర్వాత కొంత డీలా పడినట్లుగా వార్తలు వచ్చాయి. అజయ్‌ కి చెక్ పెట్టేందుకే వీరిద్దరినీ నియమించారనే కథనాలూ వస్తున్నాయి. ఈ నేపథ్యంలో మంత్రికి దెబ్బమీద దెబ్బ పడడంతో ఆయన వర్గం కొంత పునరాలోచనలో పడ్డట్లు సమాచారం.

క‌మ్మ సంఘం ఎన్నిక‌ల్లో ఎర్నేని గెలువు..

ఖ‌మ్మంలో జరిగిన క‌మ్మ సంఘం ఎన్నికల్లో ఎర్నేని రామారావు ప్యానెల్ విజ‌యం సాధించింది. అధ్యక్షుడిగా ఎర్నేని రామారావు, బిక్కాసాని దామోద‌ర్‌రావులు పోటీప‌డ‌గా ఎర్నేనికి 658 ఓట్లు రాగా, బిక్కసానికి 478 ఓట్లు వ‌చ్చాయి. ఉపాధ్యక్షులుగా గుడ‌వ‌ర్తి నాగేశ్వర‌రావు, చెరుకూరి ర‌మేశ్​బాబు త‌ల‌ప‌డగా గుడ‌వ‌ర్తి నాగేశ్వర‌రావుకు 576, చెరుకూరి ర‌మేష్‌బాబుకు 548 ఓట్లు వ‌చ్చాయి. ప్రధాన కార్యద‌ర్శిగా చావా నారాయ‌ణ‌రావు, తాళ్లూరి జీవ‌న్‌కుమార్‌ పోటీ చేయ‌గా చావా నారాయ‌ణ‌రావుకు 482, తాళ్లూరికి 634 ఓట్లు వ‌చ్చాయి. సంయుక్త కార్యద‌ర్శిగా ఆల‌స్యం నారాయ‌ణ‌రావు, మంద‌టి న‌రేశ్ చౌద‌రి పోటీ చేయగా ఆల‌స్యం నారాయ‌ణ‌రావుకు 497, మంద‌టికి 589 ఓట్లు, కోశాధికారిగా దండ్యాల ల‌క్ష్మణ్‌రావు, న‌ల్లమోతు ర‌ఘ‌ప‌తిరావు బ‌రిలో ఉండ‌గా దండ్యాల ల‌క్ష్మణ్‌రావుకు 464, న‌ల్లమోతు ర‌ఘ‌ప‌తిరావుకు 647 ఓట్లు వ‌చ్చాయి.

Next Story

Most Viewed