తెలంగాణ దశాబ్ది ఉత్సవాలపై బీఆర్ఎస్ పార్టీ కీలక నిర్ణయం!

by Ramesh Goud |

రాష్ట్రం అవతరించి రేపటికి పది సంవత్సరాలు పూర్తి అవుతున్న సందర్భంగా తెలంగాణలో దశాబ్ది ఉత్సావాలు నిర్వహించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం భారీ ఏర్పాట్లు చేస్తోంది.

తెలంగాణ దశాబ్ది ఉత్సవాలపై బీఆర్ఎస్ పార్టీ కీలక నిర్ణయం!
X

దిశ, డైనమిక్ బ్యూరో: రాష్ట్రం అవతరించి రేపటికి పది సంవత్సరాలు పూర్తి అవుతున్న సందర్భంగా తెలంగాణలో దశాబ్ది ఉత్సావాలు నిర్వహించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం భారీ ఏర్పాట్లు చేస్తోంది. ఈ నేపధ్యంలో దశాబ్ది ఉత్సవాల నిర్వహనపై బీఆర్ఎస్ పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఈ వేడుకలను రేపు ఉదయం ప్రారంభించాలని నిర్ణయించిన నేపధ్యంలో బీఆర్ఎస్ అంతకుముందుగా ఈ రోజు సాయంత్రం నుంచే ఉత్సవాలను పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించేందుకు సన్నాహాలు చేసుకుంటుంది. దశాబ్ది వేడుకలను మూడు రోజుల పాటు నిర్వహించేలా బీఆర్ఎస్ పార్టీ షెడ్యూల్ విడుదల చేసింది. ఇవ్వాళ సాయంత్రం 5 గంటలకు మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గన్‌పార్క్ వద్ద అమరవీరులకు నివాళులు అర్పించడంతో ఈ వేడుకలు ప్రారంభం కానున్నాయి.

నివాళుల అనంతరం గన్ పార్క్ నుండి సచివాలయం ఎదురుగా ఉన్ అమరజ్యోతి వరకు క్యాండిల్ ర్యాలీ నిర్వహించనున్నారు. రేపు ఉదయం 9 గంటలకు తెలంగాణ భవన్ లో జెండా వందన కార్యక్రమం అనంతరం వేడుకల సందర్భంగా ఏర్పాటు చేసిన వేదికపై తెలంగాణ ఉద్యమ ప్రస్థానంతో పాటు పలు అంశాలపై కేసీఆర్ ప్రసంగం ఉంటుంది. మూడు రోజుల ఉత్సవాల్లో భాగంగా సోమవారం ఆసుపత్రుల్లో రోగులకు పండ్లు పంపిణీ సహా పలు సేవా కార్యక్రమాలు జరపనున్నారు. అయితే తెలంగాణ అవతరణ వేడుకల సందర్భంగా నగరంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

రేపటి వేడుకల దృష్యా గన్ పార్క్ చుట్టూ ఫెన్షింగ్ ఏర్పాటు చేసి, అమరవీరుల స్థూపం వద్ద అలంకరణ కార్యక్రమాలు చేస్తున్నారు. దశాబ్ది ఉత్సవాలకు అమరవీరుల స్థూపాన్ని ముస్తాబు చేస్తూనే.. మరోవైపు ఎన్నడు లేని విధంగా గన్ పార్క్ కు ఇనుప కంచెలు వేయడం వివాదాస్పదం అవుతున్నది. ఈ నేపధ్యంలోనే ఇవ్వాళ సాయంత్రం కేసీఆర్ అమరవీరుల స్థూపం వద్దకు వెళ్లడం చర్చనీయాంశంగా మారింది. అవతరణ వేడుకలు జరనున్న క్రమంలో ఇవ్వాల్టి నుంచే నగరంలో పలు చోట్ల ట్రాఫిక్ ఆంక్షలు కూడా విధించారు. రేపు సాయంత్రం ట్యాంక్ బండ్ పై వేడుకలు జరగనున్న నేపధ్యంలో ఇవ్వాళ రాత్రి నుండి ట్రాఫిక్ ను నిలిపివేయనున్నారు. దీంతో అమరజ్యోతి వరకు బీఆర్ఎస్ పార్టీ ప్లాన్ చేసుకున్న క్యాండిల్ ర్యాలీ ఎలా నిర్వహించనుందోనని సర్వత్రా ఆసక్తిగా మారింది. పోలీస్ పర్మిషన్ తీసుకున్నాకే బీఆర్ఎస్ పార్టీ ఈ వేడుకలు జరిపేందుకు సిద్దం చేసుకుందా అనేది తెలియాల్సి ఉంది.

Next Story