- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
జిల్లాల పేర్లలో రాచరికపు పోకడలు కనిపించడం లేదా?.. ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఫైర్
తెలంగాణ చిహ్నన్ని మారుస్తున్నారని వార్తల్లో చూశాం.. రాచరికపు ఆనవాళ్లు లేకుండా చేయాలని చూస్తున్న రేవంత్ రెడ్డికి జిల్లాల పేర్లలో రాచరికపు పోకడలు కనిపించడం లేదా అని బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి అన్నారు.

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణ చిహ్నన్ని మారుస్తున్నారని వార్తల్లో చూశాం.. రాచరికపు ఆనవాళ్లు లేకుండా చేయాలని చూస్తున్న రేవంత్ రెడ్డికి జిల్లాల పేర్లలో రాచరికపు పోకడలు కనిపించడం లేదా అని బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి అన్నారు. రాష్ట్ర బీజేపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఆయన కాంగ్రెస్ ప్రభుత్వంపై ఫైర్ అయ్యారు. ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర చిహ్నాన్ని మారుస్తున్నారని వార్తల్లో చూశామని, చిహ్నంలో రాచరికపు ఆనవాళ్లు లేకుండా చేయాలని కాంగ్రెస్ భావిస్తోందని అన్నారు. కొత్త చిహ్నాన్ని బయటకు లీక్ ఇచ్చి విమర్శలు రావడంతో పునరాలోచనలో పడినట్లు వార్తలు వస్తున్నాయని, రేపు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజు రిలీజ్ చేస్తారని తొలుత చెప్పినప్పటికీ గీతాన్ని మాత్రమే ఆవిష్కరిస్తున్నట్లు తెలుస్తోందని అన్నారు.
రాచరికపు ఆనవాళ్లను పూర్తిగా తొలగించాలనుకున్న సీఎం, కేబినెట్.. కొత్త లోగోలో తెలంగాణ ఉద్యమ స్ఫూర్తి కనిపించేలా అమరుల స్తూపాన్ని పెట్టడాన్ని స్వాగతిస్తున్నామని, కానీ కాకతీయ తోరణాన్ని లోగో నుంచి తీసివేయాలని అనుకోవడం శోచనీయమని, కాకతీయ తోరణం రాష్ట్ర చిహ్నంలో ఉండాల్సిందేనని స్పష్టం చేశారు. ఇదే కాంగ్రెస్ 1970లో తొలిదశ ఉద్యమంలో పోలీసుల కాల్పుల్లో దాదాపు 370 మందిని బలి తీసుకుందని సంచలన ఆరోపణలు చేశారు. చిహ్నం విషయంలో కాంగ్రెస్ సమాధికి చిహ్నమైన చార్మినార్ ను తొలగించడం కాదని, ముస్లిం పాలకుల ఆనవాళ్లను మొత్తమే తొలగించాలని, బీజేపీ వచ్చాక ముస్లిం పాలకుల ఆనవాళ్లను తొలగించడంపై పూర్తిస్థాయిలో ఆలోచన చేస్తామని పేర్కొన్నారు. ముస్లిం దురాక్రమణదారులు హిందువులపై అరాచకాలు చేసి పాలన సాగించారని, ఎదులాపురంను ఆదిలాబాద్ గా, లష్కర్ ను సికింద్రాబాద్ గా, ఎలగందులను కరీంనగర్ గా, పాలమూరును మహబూబ్ నగర్ గా, మానుకోటను మహబూబాబాద్ గా, ఇందూరును నిజామాబాద్ గా ముస్లిం పేర్లతో మార్చారని, మరి వీటిలో రాచరికపు పోకడలు కనిపించడం లేదా? వీటిని ఎందుకు మార్చడం లేదని ప్రశ్నించారు.
ముస్లిం ఓట్ల కోసం పాకులాడే కాంగ్రెస్.. ఇప్పటికైనా సాంస్కృతిక పునరుద్ధరణ చేయాల్సిన అవసరం ఉందని, తెలంగాణ కొత్త సచివాలయంలో 34 గుమ్మటాలు ఒవైసీ ఆనందం కోసం నిర్మించారని, వాటిని ఎందుకు తొలగించడం లేదు. వాటిలో రాజరికపు అనవాళ్ళు మీకు కనిపించడం లేదా? అని రేవంత్ రెడ్డిపై విరుచుకుపడ్డారు. తెలంగాణ ఉద్యమకారుల ప్రతి కుటుంబానికి రూ.25 వేలు ఇస్తామన్నారు. మరి ఇంకెప్పుడు ఇస్తారు? అని ప్రశ్నించారు. అంతేగాక సోనియాగాంధీని బలిదేవతగా పిలిచి చివరకు రేవంత్ రెడ్డి ఆమెకు భక్తుడిగా మారాడని, సుష్మా స్వరాజ్, బీజేపీ మద్దతుతోనే తెలంగాణ ఏర్పాటు జరిగింది. కానీ కనీసం సుష్మా స్వరాజ్ పేరు ప్రస్తావన కూడా తీసుకురాలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ ఏర్పాటు జరిగినప్పుడు రేవంత్ కాంగ్రెస్ లో లేకపోవడం, తెలంగాణను వ్యతిరేకించిన టీడీపీలో ఆయన ఉండటం వల్ల ఆయనకు చరిత్ర సరిగ్గా తెలియదనుకుంటానని దుయ్యబట్టారు. రేవంత్ చరిత్ర తెలుసుకోవాలని, అలాగే బీజేపీ నేతలను ఆవిర్భావ వేడుకలకు పిలిస్తే బాగుండేదని ఏలేటి అన్నారు.






