మౌనికకు అండగా నిలిచిన కేటీఆర్

2404

దిశ, వెబ్‌డెస్క్ : అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో తెలంగాణకు చెందిన ఓ ఫ్యామిలీ ప్రాణాలు కోల్పోగా, అందులో ఒకరు తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. ఈ ఘటన నవంబర్ 27వ తేదీన శుక్రవారం వెలుగులోకి వచ్చింది.

వివరాల్లోకివెళితే.. రాష్ట్రంలోని నారాయణపేట జిల్లాకు చెందిన గౌని నరసింహారెడ్డి హైదరాబాద్ లో కండక్టర్ గా విధులు నిర్వహిస్తున్నాడు. ఆయన కొడుకు భరత్, కుమారై మౌనిక అమెరికాలోని టెక్సాస్‌లో ఉంటున్నారు. పిల్లలను చూసేందుకు వెళ్ళిన నరసింహారెడ్డి, ఆయన సతీమణి లక్ష్మి కొవిడ్ నేపథ్యంలో అక్కడే చిక్కుకుపోయారు. తాజాగా ఇండియాకు తిరుగుప్రయాణమయ్యారు. ఏయిర్ పోర్టుకు వెళ్లే క్రమంలో ఘోర రోడ్డుప్రమాదం సంభవించింది. ఇందులో మౌనిక మినహా ఎవరూ ప్రాణాలతో బయటపడలేదు. ఆమె ఒక్కతే తీవ్ర గాయాలపాలై ప్రస్తుతం టెక్సాస్ లోని ఓ ఆస్పత్రిలో ప్రాణాలతో కొట్టుమిట్టాడుతోంది. ఆమె ఆరోగ్య పరిస్థితిపై ఇప్పుడే ఏమి చెప్పలేమని వైద్యులు తెలిపారు.

కాగా, ప్రస్తుతం మౌనిక ఆస్పత్రి ఖర్చులకు డబ్బులు లేవు.దీంతో సందీప్ గుడిపల్లి అనే వ్యక్తి ఆమె చికిత్స నిమిత్తం gofundme.com పేరిట వెబ్‌సైట్ ప్రారంభించాడు. దీనికి ఫండ్ రైజ్ చేయాలని కోరాడు. ఈ విషయాన్ని సోమవారం తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్ దృష్టికి తీసుకెళ్లాడు. స్పందించిన కేటీఆర్ ఆమె ఆస్పత్రి ఖర్చుల విషయమై ఎన్‌ఆర్‌ఐ అఫైర్స్ బృందంతో పాటు కాన్సులేట్‌తో మాట్లాడాలని మంత్రి తన కార్యాలయ అధికారులను ఆదేశించారు. మౌనికకు అండగా ఉంటానని మంత్రి కేటీఆర్ భరోసానిచ్చారు.