తెలంగాణ గాంధీ కేసీఆర్‌: మంత్రి ఎర్ర‌బెల్లి

by  |
తెలంగాణ గాంధీ కేసీఆర్‌: మంత్రి ఎర్ర‌బెల్లి
X

దిశ ప్ర‌తినిధి, వ‌రంగ‌ల్: అలుపెర‌గ‌ని ఉద్య‌మ పోరాటంతో స్వ‌రాష్ట్రాన్ని సాధించిన ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ మ‌హాత్ముడంటూ మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్‌రావు అభివ‌ర్ణించారు. వ‌రంగ‌ల్ మునిసిప‌ల్ కార్పోరేష‌న్ కార్యాల‌యంలో ఏర్పాటు చేసిన ‘దీక్షా దివస్‌ పైలాన్‌ను ఆదివారం మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్‌రావు, ప్ర‌భుత్వ చీఫ్ విప్ విన‌య్‌భాస్క‌ర్‌తో క‌ల‌సి ఆవిష్క‌రించారు. బల్దియా ప్రధాన కార్యాలయంలోని స్మార్ట్‌రోడ్డు పక్కన రూ.10లక్షలతో పైలాన్‌ నిర్మించారు.

12అడుగుల ఎత్తుండే దీని నాలుగు వైపులా తెలంగాణ ఉద్యమం గురించి తెలిపే చిత్రాలున్నాయి. తెలంగాణ రాష్ట్ర‌ పటం అందులో కేసీఆర్‌ బొమ్మ, మరో వైపు తెలంగాణ పటంలో పిడికిలి, మరో వైపు ‘జై తెలంగాణ, జైజై తెలంగాణ’, ఇంకో వైపు ‘దీక్షా దివస్‌’ స్ఫూర్తి చిహ్నం నినాదాల‌ను ఏర్పాటు చేశారు. పైలాన్ ఆవిష్క‌ర‌ణ అనంత‌రం మంత్రి ఎర్ర‌బెల్లి మాట్లాడుతూ తెలంగాణ ఇచ్చామని కాంగ్రెస్ గొప్పలు చెబుతోంద‌ని దుయ్య‌బ‌ట్టారు. తెలంగాణ ఇస్తే రాలే.. కేసీఆర్ కొట్లాడి తెచ్చార‌ని పేర్కొన్నారు. భారతదేశానికి స్వాతంత్య్రం ఇచ్చింది బ్రిటీష్ కాదని, మహాత్మాగాంధీ తెచ్చారన్నారు. అలాగే తెలంగాణ కూడా తెచ్చింది కేసీఆరేనని కొనియాడారు. అందుకు కార్పొరేషన్ కార్యాలయంలో సీఎం కేసీఆర్ నిలువెత్తు విగ్రహాన్ని పెట్టాలని ఎర్రబెల్లి వ్యాఖ్యానించ‌డం గ‌మ‌నార్హం.


Next Story