క్వారెంటైన్‌ కహానీ..

by  |
క్వారెంటైన్‌ కహానీ..
X

థింక్ డిఫరెంట్ .. మేక్ బెటర్

కొత్త మార్గాన్ని చూపిన వలస కూలీలు

దిశ, న్యూస్ బ్యూరో:

కాయకష్టంతోనే కడుపు నింపుకునే వలస కూలీలు.. లాక్‌డౌన్ కారణంగా క్వారంటైన్ కేంద్రాల్లో ఉంటున్నారు. అయితే, శారీరక శ్రమకు అలవాటు పడ్డ వీరంతా.. అలా తిని ఖాళీగా కూర్చోలేకపోయారు. డిఫరెంట్‌గా ఆలోచించారు. మెరుపులాంటి ఆలోచనతో వారుంటున్న పాఠశాల రూపురేఖల్ని మార్చివేసి అద్భుతాన్ని సృష్టించారు. ఎంతోకొంత కూలీ డబ్బులు తీసుకోవాలని గ్రామ పెద్దలు ఒత్తిడి చేసినా సున్నితంగా తిరస్కరించారు. ఊరు పేరు తెలియని తమకు ఆశ్రయం కల్పించి, రెండు పూటలా కడుపు నింపినందుకు తమ శ్రమతో రుణం తీర్చుకున్నారు. పాఠశాలను పనికొచ్చే తీరులో తీర్చిదిద్దామన్న సంతృప్తి చాలన్నారు. రాజస్థాన్‌లో చోటుచేసుకున్న ఈ సంఘటన యావత్తు దేశానికి ఆదర్శంగా నిలిచింది.

వివరాల్లోకి వెళ్తే… రాజస్థాన్ రాష్ట్రం సికార్ జిల్లాలోని పల్సనా గ్రామంలోని ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాలను క్వారెంటైన్ కేంద్రంగా ఏర్పాటు చేశారు. సమీప గ్రామాల్లో పనిచేస్తున్న హర్యానా, ఉత్తరప్రదేశ్, బీహార్ రాష్ట్రాలకు చెందిన 54 మంది వలస కూలీలను ఆ కేంద్రంలో క్వారంటైన్‌లో ఉంచింది. వీరంతా రోజుకూలీకి పనిచేసే వలస కార్మికులు. లాక్‌డౌన్ కారణంగా వారిని ఆ రాష్ట్ర ప్రభుత్వం ఈ క్వారంటైన్ కేంద్రంలో పెట్టింది. రోజంతా కష్టపడి పనిచేసే వారికి తిని ఖాళీగా కూర్చోవడం, కాలక్షేపం చేయడం నచ్చలేదు. శారీరక శ్రమకు అలవాటైన కాళ్ళు చేతులు ఖాళీగా ఉండలేకపోయాయి. తమకు వచ్చిన పనులతో ఈ పాఠశాల భవనానికి మరమ్మత్తులు చేస్తామని, కొత్త రంగులు వేస్తామని, ఆకర్షణీయంగా తీర్చిదిద్దుతామని అక్కడి గ్రామ పెద్ద(సర్పంచ్)తో మాట్లాడారు. సర్పంచ్ మాట మేరకు గ్రామస్తులంతా తలా కొంత మొత్తంలో చందాల రూపేణా సాయం చేశారు. అలా పోగైన డబ్బుతో సున్నం, రంగులు, సిమెంటు లాంటివి సమకూర్చుకున్నారు. స్థానికంగా ఉన్న యువత కూడా వలస కూలీలకు చేదోడుగా పనుల్లో పాల్గొన్నారు.

క్వారంటైన్‌లో ఉన్న 14 రోజుల్లో ఆ పాఠశాల రూపురేఖలు కాస్త పూర్తిగా మారిపోయాయి. వలస కూలీలు శంకర్ సింగ్, ఓం ప్రకాశ్, రవి ఆలోచనలు.. ప్రభుత్వం ఏళ్ళ తరబడి చేయలేని పనిని సాకారం చేశాయి. గ్రామ సర్పంచ్ రూప్ సింగ్ స్పందిస్తూ.. ‘గ్రామ పాఠశాలలో ఏర్పాటు చేసిన క్వారంటైన్ కేంద్రంలో ఏప్రిల్ 18 నుంచి 54 మంది ఉంటున్నారు. మేం వారికి ప్రతీరోజు అన్నం, నీళ్లు అందించాం. మేం వారి కోసం తీసుకున్న చర్యలకు ప్రతిఫలంగా వారు మా గ్రామానికి తిరిగి ఏదైనా చేయాలని మమ్మల్ని సంప్రదించారు. పాఠశాలను శుభ్రం చేయడం, రంగులు వేయడం చేస్తామని అన్నారు. దాని కోసం అవసరమైన ప్రభుత్వ అనుమతిని కూడా మేం తీసుకొచ్చామని’ చెప్పారు. తొమ్మిదేళ్లుగా ఈ పాఠశాల గోడలకు సున్నం కూడా వేయలేదు. ఇప్పుడు పాఠశాల అద్దంలా మెరిసిపోతోందని పాఠశాల హెడ్‌మాస్టర్ రాజేంద్ర మీనా వివరించారు. తామే సంతృప్తితో ఎంతో కొంత కూలీ రూపంలో డబ్బులు ఇవ్వడానికి ప్రయత్నించామని, కానీ వారు తీసుకోలేదన్నారు. శారీరక శ్రమకు అలవాటుపడిన ఆ కూలీలు గ్రామస్తుల నుంచి అందిన సాయానికి ప్రతిఫలంగా ఏదో ఒకటి వారి స్థాయికి తగ్గట్లుగా ఇవ్వాలనుకున్నారని, దానికి నిదర్శనమే కొత్త భవనంలా కనిపిస్తున్న ఈ ప్రభుత్వ పాఠశాల అని వారి ఆలోచనను అభినందించారు.

Tags: Corona, rajasthan, migrant labour, school, painting, Rajasthani school

Next Story

Most Viewed