మంచిర్యాలలో మెడికల్ వార్

by  |
Manchiryala Town
X

దిశ ప్రతినిధి, ఆదిలాబాద్ : మంచిర్యాల జిల్లాకు కొత్తగా మంజూరైన మెడికల్ కాలేజీ ఏర్పాటుపై ముగ్గురు ఎమ్మెల్యేల మధ్య మూడు ముక్కలాట మొదలైంది. ఎవరికి వారే తమ ప్రాంతంలో ఏర్పాటు చేయాలంటే.. తమ ప్రాంతంలో ఏర్పాటు చేయాలంటూ పావులు కదుపుతున్నారు. అధికార పార్టీకి చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలకు మెడికల్ కాలేజీ ఏర్పాటు ప్రతిష్టాత్మకంగా మారగా.. ఆఖరికి ఆధిపత్యం దక్కించుకునేదెవరో చూడాలి.

మంచిర్యాల జిల్లా కేంద్రంలో కాకుండా.. బెల్లంపల్లిలో ఏర్పాటు చేయాలంటూ ఆందోళనలు మొదలయ్యాయి.. అఖిల పక్షంతో పాటు ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య వాదన వినిపిస్తున్నారు. జైపూర్లో ఏర్పాటు చేసేందుకు విప్ బాల్క సుమన్ పావులు కదుపుతుండగా.. మంచిర్యాల జిల్లా కేంద్రంలోనే ఉంచేలా ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు ప్రయత్నాలు సాగుతున్నాయి.

ఇటీవల మంజూరైన ఏడు మెడికల్ కాలేజీల్లో మంచిర్యాల జిల్లాకు ఒకటి మంజూరైంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఇప్పటికే రాజీవ్ గాంధీ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెన్స్ (రిమ్స్) ఉంది. కొత్తగా మంచిర్యాల జిల్లాకు మెడికల్ కాలేజీని మంజూరు చేశారు. మంచిర్యాల జిల్లాలో మూడు నియోజకవర్గాలుండగా.. ముగ్గురు అధికార పార్టీ ఎమ్మెల్యేలే ఉన్నారు. ఎవరికి వారు తమ సెగ్మెంటులో ఏర్పాటు చేయాలంటే.. తమ వద్ద పెట్టాలంటూ పావులు కదుపుతున్నారు. మెడికల్ కాలేజీ ఏర్పాటు చేయాలంటే.. దానికి అనుంబంధంగా ఆసుపత్రి ఉండాలి. మంచిర్యాలలో జిల్లా కేంద్ర ఆసుపత్రి ఉండగా.. మెడికల్ కాలేజీ ఇక్కడే ఏర్పాటు చేస్తారనే చర్చ ఉంది. జిల్లా కేంద్రం కావటంతో.. మంచిర్యాల కేంద్రం పెడతారనే వాదన వినిపిస్తోంది. మంచిర్యాలలో పెడితేనే అందరికి అనుకూలంగా ఉంటుందని స్థానిక ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు కోరుతుండగా.. అందుకు అనుగుణంగా పావులు కదుపుతున్నారు.

బెల్లంపల్లిలో ప్రభుత్వ భూములు వేలాది ఎకరాలున్నాయని.. భవనాలు కూడా అందుబాటులో ఉన్నందున ఇక్కడే ఏర్పాటు చేయాలని అఖిల పక్షం నాయకులతో పాటు స్థానిక ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య కోరుతున్నారు. అప్పట్లో చంద్రబాబు ప్రభుత్వ హయాంలో 1998-98లో టెస్లా కంపెనీ ద్వారా మెడికల్ కాలేజీ ఏర్పాటు చేయాలని భావించారు. సుమారు 50ఎకరాల ప్రభుత్వ భూమిలో కెమికల్ కాంప్లెక్స్ ఉంది. ప్రస్తుతం రాష్ట్ర రహదారి ఉండగా.. కొత్తగా జాతీయ రహదారి వస్తోంది. గతంలో భవనాలు నిర్మించి వదిలేశారు. మంచిర్యాల జిల్లాకు మెడికల్ కాలేజీ మంజూరు చేస్తామని.. బెల్లంపల్లిలో ఏర్పాటు చేస్తామని సీఎం కేసీఆర్ 2018ఎన్నికల సభలో హామీ ఇచ్చారు. 300పడకల సింగరేణి ఆస్పత్రి, క్వార్టర్లున్నాయి. ఇప్పటికే అఖిల పక్షం నిరాహార దీక్ష, బంద్ నిర్వహణ, రాస్తారోకోలు చేశారు. ఎమ్మెల్యే చిన్నయ్య ఆధ్వర్యంలో మున్సిపాలిటీ తీర్మానం చేసి.. హైదరాబాద్ వెళ్లి అన్ని శాఖల మంత్రులను కలిశారు.

మరోవైపు మంచిర్యాలకు చెన్నూర్ నియోజకవర్గం జైపూర్ మండలం 8కిలో మీటర్ల దూరంలోనే ఉంది. జైపూర్ మండలం సింగరేణి థర్మల్ పవర్ ప్లాంటు (ఎస్టీపీపీ) ముందున్న రసూల్పల్లిలో ఏర్పాటు చేసేందుకు విప్, స్థానిక ఎమ్మెల్యే బాల్క సుమన్ పావులు కదుపుతున్నారు. అధికార పార్టీకి చెందిన నాయకుల భూములు ఉండగా.. వీటిని కొనుగోలు చేయాలని చూస్తున్నారు. అక్కడ మెడికల్ కాలేజీ ఏర్పాటు చేస్తే మంచిర్యాల జిల్లా కేంద్ర ఆస్పత్రికి దగ్గరగా ఉంటుందని భావిస్తున్నారు.

రాష్ట్ర ప్రభుత్వ స్థాయిలో బాల్క సుమన్ పావులు కదుపుతుండగా.. ఏ మేరకు సఫలీకృతుడు అవుతారో చూడాలి. బెల్లంపల్లిలో ప్రభుత్వ భూములు, భవనాలు, సింగరేణి ఆస్పత్రి, క్వార్టర్లు ఉన్నందున.. కొంత వెసులుబాటు ఉంది. మంచిర్యాల జిల్లా కేంద్రంలో అయితే జిల్లా కేంద్రంతో పాటు జిల్లా ఆస్పత్రి ఉంది. కాలేజీ ఎక్కడ ఏర్పాటు చేస్తారనేది ఆసక్తికరంగా మారగా.. ముగ్గురు ఎమ్మెల్యేలు ఎవరికి వారే పావులు కదుపుతున్నారు. మెడికల్ కాలేజీ మూడు ముక్కలాటలో గెలిచేది ఎవరో వేచి చూడాల్సిందే.

Next Story

Most Viewed