జూన్ 1న ఇండియా కూటమి సమావేశం.. మిత్రపక్షాలకు పిలుపు

by Hajipasha |
జూన్ 1న ఇండియా కూటమి సమావేశం.. మిత్రపక్షాలకు పిలుపు
X

దిశ, నేషనల్ బ్యూరో : సార్వత్రిక ఎన్నికల తుది విడత పోలింగ్ జూన్ 1న (శనివారం) జరగనుంది. అయితే అదే రోజున ఢిల్లీ వేదికగా మిత్రపక్షాల సమావేశానికి ఇండియా కూటమి పిలుపునిచ్చింది. ఎన్నికల ఫలితాలు విడుదల కావడానికి సరిగ్గా 4 రోజుల ముందు జరగనున్న ఈ సమావేశం ప్రాధాన్యాన్ని సంతరించుకుంది. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ జూన్ 2న తిహార్ జైలు అధికారుల ఎదుట లొంగిపోనున్నారు. ఇది జరగడానికి ఒకరోజు ముందే ఇండియా కూటమి మిత్రపక్షాలు భేటీ అవుతుండటం గమనార్హం. భవిష్యత్ కార్యాచరణపై, కలిసికట్టుగా ముందుకుసాగడంపై ఈ సమావేశంలో సమీక్షించనున్నట్లు తెలుస్తోంది. తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, బిహార్ మాజీ ఉప ముఖ్యమంత్రి తేజస్వీ యాదవ్, సమాజ్ వాదీ పార్టీ నాయకుడు అఖిలేష్ యాదవ్ సహా కూటమిలోని అన్ని పార్టీల అగ్రనేతలు సమావేశంలో పాల్గొంటారని సమాచారం. కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటుకు అవసరమైన 272 లోక్‌సభ సీట్లను ఇండియా కూటమి అవలీలగా గెలుస్తుందని కాంగ్రెస్ పార్టీ వాదిస్తోంది. ఈ ఆశాభావంతోనే ఇప్పుడు జూన్ 1 సమావేశాన్ని నిర్వహిస్తున్నట్లు పరిశీలకులు చెబుతున్నారు.

Next Story

Most Viewed