ముంచుకొస్తున్న రెమాల్.. కాసేపట్లో తీరం దాటే అవకాశం

by Hajipasha |
ముంచుకొస్తున్న రెమాల్.. కాసేపట్లో తీరం దాటే అవకాశం
X

దిశ, నేషనల్ బ్యూరో : ‘రెమాల్' తుఫాను ప్రభావంతో పశ్చిమ బెంగాల్‌లో హై అలర్ట్ ప్రకటించారు. ఆదివారం అర్థరాత్రి సమయానికి ఈ తుఫాను బెంగాల్‌లోని కానింగ్‌కు ఆగ్నేయంగా 190 కి.మీ దూరంలో, బంగ్లాదేశ్‌లోని మోంగ్లాకు దక్షిణంగా 220 కిమీ దూరంలో ఉంది. సోమవారం తెల్లవారుజాములోగా ఈ తుఫాను బంగ్లాదేశ్‌లోని మోంగ్లా, బెంగాల్‌లోని సాగర్‌ద్వీప్‌ల వద్ద తీరం దాటే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) అంచనా వేసింది. తుఫాను తీరం దాటే టైంలో గాలి వేగం గంటకు 135కి.మీ ఉంటుందని తెలిపింది. ఆదివారం అర్థరాత్రి 12 గంటలకు కడపటి సమాచారం అందేసరికి.. రెమాల్ తుఫాను బెంగాల్‌లోని సాగర్ ద్వీప్‌కు ఆగ్నేయంగా 160 కి.మీ దూరంలో ఉంది. అది బంగాళాఖాతం మీదుగా ఉత్తర దిశగా కదులుతున్నట్లు ఐఎండీ తెలిపింది. తుఫాను ప్రభావంతో తీర ప్రాంతాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తున్నాయని పేర్కొంది.

ఇక తుఫాను దృష్ట్యా బెంగాల్‌లోని కోల్‌కతా ఎయిర్ పోర్టును 21 గంటల పాటు (సోమవారం ఉదయం 9 వరకు) మూసివేశారు. వందలాది రైళ్లను కూడా రద్దు చేశారు. తుఫాను ప్రభావంతో రాష్ట్రంలోని ఉత్తర, దక్షిణ 24 పరగణాలు, కోల్‌కతా, తూర్పు మిడ్నాపూర్, హౌరా, హుగ్లీలలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ హెచ్చరించింది. ఈ జిల్లాలకు రెడ్ అలర్ట్ ప్రకటించింది. ముందుజాగ్రత్త చర్యల్లో భాగంగా ఆదివారం సాయంత్రం నాటికే సుందర్‌బన్స్, సాగర్ ద్వీపం సహా రాష్ట్రంలోని పలు సముద్ర తీరప్రాంతాల నుంచి దాదాపు 1,10,000 మందిని తాత్కాలిక షెల్టర్ జోన్లకు తరలించారు. ఇక తుఫాను ప్రభావంతో ఇప్పటికే ఏపీ, తెలంగాణలోని పలు జిల్లాల్లో వర్షాలు పడుతున్నాయి. హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం పడింది. కాకినాడ జిల్లా ఉప్పాడ తీరంలో సముద్రం అల్లకల్లోలంగా మారింది.

Next Story

Most Viewed