ఒక్క పరిచయం.. 30 మందిపై అత్యాచారం!

351
Rape

దిశ, వెబ్‌డెస్క్ : పక్కా ప్లాన్‌తో ఓ వ్యక్తి ఒంటరి మహిళలనే టార్గెట్ చేస్తూ అత్యాచారాలకు పాల్పడుతున్నాడు. ఆ తర్వాత వారి వద్ద ఉన్న నగదు, నగలతో ఉడాయిస్తున్నాడు. ఇలా 30 మందిని మోసం చేసిన అతగాడిని ఓ మహిళ ఫిర్యాదుతో పోలీసులు ఆటకట్టించారు. రాచకొండ సీపీ మహేశ్ భగవత్ అతడి దుర్మార్గాలను మీడియాకు వివరించారు.

మేడ్చల్ జిల్లా ఘట్ కేసర్ మండలానికి చెందిన హుస్సేన్ ఖాన్ (46) కూరగాయల వ్యాపారం చేస్తుంటాడు. కల్లు తాగే అలవాటు ఉన్న ఖాన్.. కల్లు కంపౌండ్లలో ఒంటరిగా ఉన్న మహిళలతో పరిచయం చేసుకుంటాడు. అలా వారిని మచ్చిక చేసుకుని తర్వాత డబ్బు ఆశ చూపిస్తాడు. అలా తన బండిపై నగర శివార్లలోని నిర్మానుష్య ప్రాంతాలకు తీసుకెళ్తాడు. అక్కడ వారికి మాయమాటలు చెప్పి నగలు, నగదును తీసుకుని స్కూటర్ డిక్కీలో పెట్టేస్తాడు. ఆ తర్వాత మహిళలపై అత్యాచారం చేస్తాడు. అనంతరం మహిళలను ఏమార్చి అక్కడి నుంచి పరారీ అవుతాడు.

హుస్సేన్ ఖాన్ ఇలా 30 మంది మహిళలపై లైంగిక దాడి చేయడంతోపాటు దోపిడీ చేశాడు. ఇటీవల జిల్లేలగూడ కల్లు కంపౌండ్‌లో ఓ మహిళను ఇదే విధంగా మోసం చేశాడు. ఆమె ఫిర్యాదుతో ఘట్ కేసర్ పోలీసులు రంగంలోకి దిగి విచారించగా.. విస్తుపోయే ఘటనలు వెలుగులోకి వచ్చాయి. నిందితుడిని అరెస్ట్ చేసిన పోలీసులు అతడి వద్ద నుంచి రూ.3.9 లక్షల విలువ చేసే ఆభరణాలు, నగదు, ఇతర వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. 2006లోనూ గోపాలపురం పోలీసులు హుస్సేన్ ఖాన్‌ను అరెస్ట్ చేశారు. ప్రస్తుతం నిందితుడిపై పీడీ యాక్ట్ నమోదు చేసినట్లు సీపీ మహేశ్ భగవత్ తెలిపారు.

గల్లీ టూ గ్లోబల్ అప్డేట్స్.. రంగులు మారే రాజకీయాలపై ఆసక్తికర విశ్లేషణలు.. దమ్మున్న వార్తలు.. ఎప్పటికప్పుడు.. వాట్సాప్ ద్వారా పొందాలంటే.. మా నెంబ‌ర్‌ +91 88864 24242 ను సేవ్ చేసుకొని, "START" అని వాట్సాప్ ద్వారా మెసేజ్ పంపండి..