మహేంద్ర గ్రూప్ సేవలను అన్ని రంగాలకు విస్తరించాలి : కేటీఆర్

by  |
మహేంద్ర గ్రూప్ సేవలను అన్ని రంగాలకు విస్తరించాలి : కేటీఆర్
X

దిశ, బేగంపేట : మహేంద్ర గ్రూపు సేవలను అన్ని రంగాలకు విస్తరించాలని రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. మహేంద్ర గ్రూపు సౌజన్యంతో సనత్ నగర్ సెయింట్ థెరిస్సా ఆసుపత్రిలో రూ. కోటి వ్యయంతో నూతనంగా ఏర్పాటు చేసిన ఆక్సిజన్ ప్లాంటు, రాష్ట్రంలోని ఏజెన్సీ ప్రాంతాలతో పాటు నగరంలోని పలు ప్రభుత్వ ఆసుపత్రుల సేవల కోసం కొత్తగా ఏర్పాటు చేసిన 7 అంబులెన్సులను ఆయన సోమవారం జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆసుపత్రి ఆవరణలో కేటీఆర్ మొక్కలు నాటారు. అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. కార్పొరేటు సంస్థలు సామాజిక బాధ్యతలను మహేంద్ర గ్రూపు సమర్ధవంతంగా నిర్వహిస్తోందని, ప్రత్యేకించి కొవిడ్ సమయాల్లో సంస్థ అందించిన చేయూత ఎనలేనిదన్నారు.

మహేంద్ర గ్రూపు రాష్ట్రంలోని జహీరాబాద్ లో అత్యాధునికమైన ట్రాక్టర్లు యేటా లక్ష యూనిట్లను ఉత్పత్తి చేస్తుండడం అభినందించదగ్గ విషయమన్నారు. టెక్ మహేంద్రలో 24 వేల పై చిలుకు ఉద్యోగాలను కల్పించడం అభినందనీయమన్నారు. సీఎస్ఆర్ కింద విలువైన సేవలను అందిస్తున్న మహేంద్ర గ్రూపు అధినేత ఆనంద్ మహేంద్రకు ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్రంలో కొవిడ్ పూర్తి నియంత్రణలో ఉందని, దేశంలో ఇతర పెద్ద రాష్ట్రాల కంటే తెలంగాణ సర్కార్ మరింత సమర్ధవంతంగా చేపట్టిన కొవిడ్ నివారణ చర్యలకు ఫలితంగా కేసులు వందల సంఖ్యకు తగ్గాయన్నారు.

కొవిడ్ పట్ల అవగాహన పెంచుకుంటూ భవిష్యత్తును ఆశాజనంగా తీర్చిదిద్దుకునే దిశగా అడుగులు వేసేందుకు సమయమిదన్నారు. ఈ సందర్భంగా ఏజెన్సీ ప్రాంతమైన ఏటూరు నాగారంలో ఆంబులెన్స్ అవసరాన్ని గుర్తిస్తూ తొలి అంబులెన్స్ తాళాలను ఆ జిల్లాకు కేటాయిస్తూ అందజేశారు. ఈ కార్యక్రమంలో ఐటీ కార్యదర్శి జయేష్ రంజన్, మహేంద్ర గ్రూపు సీఈవో సీపీ గుర్నాని, సెయింట్ థెరిస్సా ఆసుపత్రి అడ్మినిస్ట్రేటర్ పాల్గొన్నారు.

Next Story

Most Viewed